ప్రీ మాన్‌సూన్ సీజన్‌లో బంగాళాఖాతంలో తొలి అల్పపీడనం
నైరుతి రుతుపవనాలకు ముందే ఈ ఏడాది బంగాళాఖాతంలో తొలి అల్పపీడనం మే 22వతేదీ నాటికి ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
By : The Federal
Update: 2024-05-19 11:00 GMT
నైరుతి రుతువపనాలకు ముందే బంగాళాఖాతంలో మొట్టమొదటి సారి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రీ మాన్‌సూన్ సీజన్‌లో తొలి అల్పపీడనం మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశముందని వారు పేర్కొన్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి బలహీనపడిందని అధికారులు చెప్పారు. ఏపీ, యానాంలో ఆగ్నేయ-నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని ఐఎండీ అధికారులు వివరించారు.
దక్షిణ అండమాన్ ప్రాంతంలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు
నైరుతి ఋతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ ప్రాంతంలో విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మాల్దీవుల్లో కొంతవరకు,కోమరిన్ ప్రాంతంలో కొంత వరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ నాగరత్న చెప్పారు. శనివారం దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఆదివారం బలహీన పడింది.
రాగల మూడు రోజులకు వాతావరణ సూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ అధికారి మల్లికార్జున్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ఆవర్తనం బలహీన పడటం వల్ల తెలంగాణకు భారీవర్ష సూచన లేదని ఆయన తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో చిరుజల్లులు కురిసే అవకాశముందని మల్లికార్జునరెడ్డి వివరించారు.
ఆదివారం ఓ మోస్తరు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్,మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఈదురుగాలులు వీచే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఆదివారం ఉరుములు,మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. గంటకు 30 - 40 కిలో్మీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఐఎండీ అధికారులు రాగల మూడు రోజులపాటు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.