కొత్తవాళ్లు వస్తే.. పాతపత్రాలు పరార్

ఇక్కడింతే.. ఇలాగే జరగుతుంది.. లేకపోతే ఆశ్చర్యపోవాలి.. పాత వాళ్లు పోయి.. కొత్తవాళ్లు రాగానే..ప్రాణం లేని వాటికి.. కాళ్లు వస్తాయి.. లేకపోతే షార్ట్ సర్క్యూట్ తో సర్రున మండి పైకి వెళ్తాయి.

Producer :  Chepyala Praveen
Update: 2023-12-10 14:26 GMT
2009 లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ సెక్రటేరియట్

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గానీ, ఇప్పుడు తెలంగాణలో గానీ ఎన్నికల ముందుగానీ, ఎన్నికల తరువాత గానీ ఒకటే సంఘటన జరుగుతుంది. అది కూడా కీలకమైన కార్యాలయాలు ఉన్న చోటనే ఇవి సంభవిస్తుంటాయి. అవే అగ్ని ప్రమాదాలు. అవి సాధ్యం కాని చోట అప్పటివరకూ పని చేసిన ఆఫీసులో ఉన్న ఫైళ్లన్నీ ఎత్తుకెళ్తారు.

ఇప్పుడు కూడా అదే జరిగింది. తాజాగా విద్యాశాఖ, పశుసంవర్థకశాఖ కార్యాలయాల్లోని కీలక ఫైళ్లు మాయం చేశారని ఆరోపణలు గుప్పుమన్నాయి. వీటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం హిమాయత్ నగర్ లోని అటవీ శాఖ కార్యాలయం మొదటి అంతస్తులోని అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లన్నీ తగలబడి పోయాయి. దీనికి కారణం షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్న అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అప్పుడు కూడా ఇంతే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 ఎన్నికల ముందు కూడా సచివాలయంలోని డీ బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కీలక ఫైళ్లన్నీ తగలబడిపోయాయి. దీనిపై అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు. అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారంలోకి రావడంతో ఆ విషయం మరుగున పడిపోయింది.

అలాగే 2014 ఎన్నికలకు ముందు కూడా అప్పటి సచివాలయం సమత బ్లాక్ లో అగ్నిప్రమాదం జరిగింది. కీలక ఫైళ్లన్ని అగ్నికి ఆహూతయ్యాయి. ఇది కూడా ప్రమాదం కాదని తెలంగాణ వాదులు అనుమానం వ్యక్తం చేశారు. ఇలా ప్రభుత్వాల మారినప్పుడల్లా అగ్ని ప్రమాదాలు జరగడం.. అవి కూడా కీలక ఫైళ్లున్న ప్రాంతంలోనే జరగడం అవి కాలిపోవడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు.

రాష్ట్ర పాలనకు కీలకమైంది సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు. డిజిటల్ యుగంలో కూడా కొన్ని కీలకమైన అంశాల కోసం ఇప్పటికీ కూడా పేపర్లు వాడుతున్నారు. వాటిలోనే కీలకమైన సమాచారం ఉంటుంది. ముఖ్యంగా నిధుల విడుదల, ఎందుకు విడుదల చేశారు. నోట్ ఫైల్స్, వారి సిఫార్సు.. నిర్ణయాలు, ఒప్పందాలు ఇలా అన్ని అంశాలు ఉంటాయి.

అవి దొరికితే .. ప్రభుత్వం మారగానే తాము అవినీతి చేశారనే నెపంతో ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందో అనే భయం ఇందుకు ప్రధాన కారణం. అందుకే ఫైళ్లన్నీ అగ్ని ప్రమాదంలో కాలిపోతాయి. లేకపోతే వాటంతట అవే మాయం అవుతాయి. పక్క రాష్ట్రం ఆంధ్రలో గత ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ.. వైసీపీ సర్కార్ చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులపై కేసులు పెట్టింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో 53 రోజులు జైలు జీవితం గడిపారు. దాంతో తను నిప్పును.. అవినీతి చేయలేదు అనే ప్రచారానికి జగన్ ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్లే లెక్క.. దాంతో పాటు అరడజన్ మంత్రులపై వివిధ కేసులు పెట్టారు. అవన్నీ విచారణలో ఉన్నాయి.

తమకు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే.. కీలక ఫైళ్లన్నీ ఎత్తుకెళ్లాలి లేదా అగ్నికి ఆహూతి చేయాలి. ఇదే విధానాన్ని ఇప్పటికి దశాబ్దంగా ఏ ప్రభుత్వం ఉన్న దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోని వివిధ శాఖల ప్రధాన కార్యాలయాల్లో ఇవే జరుగుతున్నాయి. కంప్యూటర్ల లోని హర్డ్ డిస్క్ లు మాయం కావడం, ఆ పని చేస్తున్న సమయంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వాటి కేబుళ్లు తొలగించడం అనేది ఎందుకు జరుగుతుందో కాస్త తెలివితేటలు ఉన్న ఎవరైనా చెప్పగలుగుతారు.

కక్ష సాధింపు ఎందుకు చేస్తారు

ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఓటుకు నోటు కేసులో జైలుకు పంపింది. అందుకే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమను కచ్చితంగా వేధిస్తుందనేది బీఆర్ఎస్ నాయకుల భయం. అందుకే ముందు జాగ్రత్తగా కీలక ఫైళ్లన్నీ మాయం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కుటుంబానికి సెంట్రల్ జైలులో డబుల్ బెడ్రూం కట్టిస్తానని శపథంలాంటిది చేశారు. సో ఇక ఫైళ్లు మాయం చేసి, తగలబెడితే తాము సేఫ్ అని తాజా మాజీల ఆలోచన..

తాజాగా ఏం జరిగిందంటే

మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్థక శాఖ కార్యాలయం నుంచి కిటికీ గ్రిల్స్ తొలగించి కీలక ఫైళ్లు, డిజిటల్ పరికరాలు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం మొత్తం చిందరవందరగా ఉంది. శనివారం ఉదయం వాచ్ మెన్ మందల లక్ష్మయ్య వచ్చి ఆఫీసు ను చూడగా తెరిచి ఉంది. ఈ ఘటనపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పెషల్ డ్యూటీ అధికారి కల్యాణ్ కుమార్ సహ, మరో నలుగురిపై కేసు నమోదు అయింది.

వారిలో కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలిజా, మోహన్, అటేండర్లు వెంకటేశ్, ప్రశాంత్ ఉన్నారు. సంఘటన జరిగిన రోజు సాయంత్రం వీరంతా ఆఫీసులో ఉన్నారని మందల లక్ష్మయ్య చెప్పారు. దీనిపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రామ్ చందర్ ను పలుమార్లు సంప్రదించిన ఆయన స్పందించలేదని పోలీసులు తెలిపారు.

పోలీసులు నిందితులపై ఐపీసీ (IPC) ప్రొవిజన్ కింద సెక్షన్ 409 (క్రిమినల్ ట్రస్ట్ ఆఫ్ ట్రస్ట్), సెక్షన్ 427 (నష్టం కలిగించే అల్లర్లు), సెక్షన్ 448 (ఇంటికి అక్రమంగా ప్రవేశించడం), సెక్షన్ 477 (మోసపూరిత రద్దు, విలువైన భద్రత ధ్వంసం) కింద కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభం అయింది. మధ్య మండల డీసీపీ పశుసంవర్థక శాఖ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి కూడా కీలక ఫైళ్ల చోరికి యత్నం జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో అబిడ్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ ఆటోలో కార్యాలయం బయట చాలాసేపు వేచి ఉన్నారని కొంతమంది వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే సరికి అతను పరారయినట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా కార్యాలయంలో ఫైళ్లు మాయం కావడంపై పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ స్పందించారు. కార్యాలయాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పరచాలని పోలీసులను కోరారు. 

Tags:    

Similar News