తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై మోదీ బదులేది? జైరాం రమేష్ సూటి ప్రశ్నలు

తెలంగాణకు ఏం చేశారని ఓట్లు అడిగేందుకు మోదీ వచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ జైరాం రమేష్ ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఆయన ప్రశ్నించారు.

Update: 2024-05-08 13:01 GMT
ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్

- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని బీజేపీ 2014 తెలంగాణ అసెంబ్లీ మ్యానిఫెస్టోలో చెప్పి పదేళ్లు గడిచినా ఇప్పటివరకు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదు.

- ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామని తెలంగాణ విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ పదేళ్లు గడిచినా ఎందుకు నిర్మించలేదు.
- హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటిఐఆర్) ఏర్పాటు చేసి, తెలంగాణను అభివృద్ధి చేస్తామని కేంద్రప్రభుత్వం విభజన హామీ కింద ఇచ్చిన ప్రణాళిక పక్కదారి పట్టింది.
- మాదిగ సామాజిక వ‌ర్గానికి స‌బ్-కోటా కావాల‌ని చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వారి డిమాండ్‌పై ప్ర‌ధాన మంత్రి ఇటీవ‌లే హామి ఇచ్చినా, దాన్ని అమలు చేయలేదు.
గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరాం రమేష్ ప్రశ్నించారు. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై మోదీ బదులేది? దీనిపై ప్రధాని ఎందుకు పెదవి విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామి ఏమైంది.
బీజేపీ ప్రభుత్వంలో నరేంద్రమోదీ గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్నా కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని స్థాపించడంలో విఫలమయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 40 కోట్లు విడుదల చేయగా, తెలంగాణ ప్రభుత్వం 60 ఎకరాల భూమిని కూడా కేటాయించింది.

మహారాష్ట్రకు తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ
కాజీపేటలో ఏర్పాటు చేస్తామన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీని బీజేపీ సర్కారు మహారాష్ట్రకు తరలించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. 2016లో అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సింగ్‌ దేశంలో ఎక్కడా రైల్ కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే అవకాశం లేదని హఠాత్తుగా ప్రకటించారు. అలా ప్రకటించిన కొన్నేళ్ల తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు.

గుజరాత్ లో రైల్వే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్‌
2022వ సంవత్సరంలో తన సొంత రాష్ట్ర మైన గుజరాత్‌లో మరో రూ. 20,000 కోట్ల రైల్వే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. 2022 డిసెంబర్ నెలలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని నిర్మించబోమని కేంద్రం మళ్లీ స్పష్టం చేసింది. అయితే ఓ నెల తర్వాత అసోంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది.

కార్యరూపం దాల్చని రైల్వే వ్యాగన్ ఓవర్‌హాలింగ్ కేంద్రం
గత ఏడాది తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మరోసారి మార్చుకుంది. కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఓవర్‌హాలింగ్ కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దాదాపు ఏడాది తర్వాత కూడా రైల్వే వ్యాగన్ ఓవర్‌హాలింగ్ కేంద్రం ఏర్పాటు ప్రణాళిక కూడా కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ప్రజలను ప్రధాని, బీజేపీ పదే పదే ఎందుకు మోసం చేశారు? కాజీపేటలో ఎప్పుడైనా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తారా? అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ జైరాం రమేష్ ప్రశ్నించారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం ఏమైంది?
ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన హామిగా ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. బీజేపీ పదేళ్ల పాలనలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు అటకెక్కింది.

నాటి విభజన హామీలు ఏమయ్యాయి?
హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటు ప్రణాళికలు రోడ్డున పడ్డాయి. యూపీఏ ప్రభుత్వం 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్ హామీలిచ్చింది. తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ఐటీఐఆర్ ప్రాజెక్టు రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని, 15 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు.

తెలంగాణపై మోదీ సవతి తల్లి ప్రేమ
హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన బీజేపీ సర్కారు అదే సమయంలోనే బుల్లెట్ రైలు, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులను ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఇచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలను మోదీ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేసింది? ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ సవతి తల్లిగా వ్యవహరిస్తున్న తీరుకు అంతం లేదా? అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు.

ఎస్సీల విభజన హామి అమలులో జాప్యమెందుకు?
మాదిగ సామాజిక వ‌ర్గానికి స‌బ్-కోటా కావాల‌ని చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వారి డిమాండ్‌పై ప్ర‌ధాన మంత్రి మోదీ ఇటీవ‌లే పెదవి విప్పారు. ఎస్సీలను విభజిస్తామని మోదీ హామి ఇచ్చి ఐదు నెలలు గడచినా అది కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో సాంఘిక ఆర్థిక కుల గణనను ఆమోదించడానికి ప్రధానమంత్రి మోదీ నిరాకరించారు. జాతీయ స్థాయిలో ఇటువంటి జనాభా గణనకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాష్ట్ర స్థాయి జనాభా గణనను నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. కుల గణన ప్రతిపాదనపై ప్రధాని తన వైఖరిని స్పష్టం చేయగలరా? లేని పక్షంలో మాదిగ సామాజికవర్గానికి ఉప కోటాలను ఎలా ప్రారంభించాలని మోదీ యోచిస్తున్నారు?అని జైరాం రమేష్ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు మోదీ బదులేది?
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి బుధవారం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సూటి ప్రశ్నలు సంధించారు. ఈ మేర ఎక్స్ లో జైరాం రమేష్ మోదీని ప్రశ్నించినా ఆయన నుంచి మాత్రం సమాధానం లేకుండా పోయింది.
1. కాజీపేటలో రైలు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
2. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఎందుకు చేయలేదు?
3. హైదరాబాద్ ఐటీఐఆర్ అమలు చేయడంలో ప్రధానమంత్రి ఎందుకు విఫలమయ్యారు?
4. జనాభా గణన లేదా కుల గణన లేనప్పుడు, మాదిగ ఉప-కోటా కోసం ప్రధానమంత్రి వాగ్దానం ఎలా ఇచ్చారు?

ఓరుగల్లుకు మోదీ మోసం

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా కేంద్రంలోని మోదీ సర్కారు ఓరుగల్లు వాసులను మోసం చేసిందని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి అధ్యక్షుడు, రైల్వే మజ్దూర్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కర్రా యాదవరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణకు రిక్తహస్తం చూపించి ఇక్కడి ప్రాజెక్టులను తన సొంత రాష్ట్ర మైన గుజరాత్ కు తరలించుకువెళ్లిన మోదీకి మేం ఎందుకు ఓటేయాలని యాదవరెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను వరంగల్ ఎంపీగా గెలిపిస్తే తాను కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ప్రకటించారు.


Tags:    

Similar News