తెలంగాణలో ఫాంహౌస్‌ల చుట్టూ తిరుగుతున్న రాజకీయ రగడ
తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్‌ల మధ్య రాజకీయ రగడ రోజుకో రకంగా సాగుతోంది. నిన్న రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహం, ఈ రోజు ఫాంహౌస్‌ల చుట్టూ రాజకీయ రగడ సాగుతోంది.
By : Saleem Shaik
Update: 2024-08-21 11:45 GMT
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ రచ్చ రోజుకో అంశంపై సాగుతోంది. మొన్న రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ సాగింది. నిన్న సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుపై నేతల మధ్య రగడ సాగింది. బుధవారం కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడలోని విలాసవంతమైన ఫాంహౌస్, సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ అనుముల తిరుపతి ఫాంహౌస్ ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రోజుకో అంశంపై విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.
హైకోర్టుకు చేరిన జన్వాడ కేటీఆర్ లీజు ఫాంహౌస్ వివాదం
కేటీఆర్ లీజుకు తీసుకున్నానని చెబుతున్న జన్వాడ వీఐపీ ఫాం హౌస్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. చెరువుల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన ఫాంహౌస్ లను వరుసగా హైడ్రా కూలగొడుతుండటంతో జన్వాడ ఫాం హౌస్ యజమాని బద్వేలు ప్రదీప్ రెడ్డి తన ఫాంహౌస్ కూలగొట్ట వద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.311జీఓకు విరుద్ధంగా జన్వాడలో నిర్మించిన ఫాం హౌస్ ను బీఆర్ఎస్ నాయకుడైన కేటీఆర్ ఎలా లీజుకు తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. రంగారెడ్డి శంకర్‌పల్లిలో జన్‌వాడలో ఫామ్‌హౌస్ ను లీజుకు తీసుకున్నందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం మండిపడ్డారు. అక్రమ నిర్మాణం అని తెలిసినా ఎలా లీజుకు తీసుకున్నారని వారు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ట్వీట్
జన్వాడ ఫామ్‌హౌస్‌ను తాను లీజుకు తీసుకున్నట్లు బుధవారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్, కేటీఆర్ అక్రమ భవనాన్ని ఎలా లీజుకు తీసుకున్నారో చెప్పాలని కోరింది.“గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటానికి సిగ్గు లేదా? అక్రమ నిర్మాణానికి అనుమతి ఇచ్చారా? లీజుకు ఎంత చెల్లించారు? మీకు దమ్ము ఉంటే దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను వెల్లడించండి?’’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌లో ప్రశ్నించింది.
కేటీఆర్ ఏం చెప్పారంటే...
‘‘మిత్రుడికి ఫాంహౌస్ ఉంటే నేను లీజుకు తీసుకున్న మాట వాస్తవమే, నాకంటూ ఏ ఫాం హౌస్ లేదని స్పష్టంగా చెబుతున్నా’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘ఒకవేళ ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఫాంహౌస్ ఉంటే నేను లీజుకు ఉన్న కాబట్టి, నేనే పోయి దగ్గరుండి కూలగొట్టిస్తా’’ అని కేటీఆర్ ప్రకటించారు.
కేటీఆర్ సవాలు
హైడ్రా చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న మంత్రుల ఫాంహౌస్‌ల కూల్చివేతలతో ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ లోనే రెవెన్యూమంత్రి పొంగులేటికి ఫామ్ హౌస్ నిర్మించారని ఆయన ఫాం హౌస్ తోనే కూల్చివేతలు ప్రారంభించాలని ఆయన కోరారు. కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, మధుయాష్కీ, గుత్తాకి ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చూపిస్తా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ కూడా నీళ్లల్లోనే కట్టారని ఆయన పేర్కొన్నారు.కాగా తన ఫాం హౌస్ నిబంధనల ప్రకారమే నిర్మించుకున్నామని వివేక్ వెంకటస్వామి వివరణ ఇచ్చారు.
సీఎం సోదరుడి ఫాంహౌస్ పై బీఆర్ఎస్ ఆరోపణలు
సీఎం సోదరుడి ఫాంహౌస్ పై బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ బుధవారం ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి ఎఫ్‌టిఎల్‌లో ఇల్లు నిర్మించారని, హైడ్రా దీంతో కూల్చివేతలు ప్రారంభించాలని క్రిశాంక్ కోరారు.మిడిల్ క్లాస్ ప్రజల ఇళ్లను మాత్రమే ఎందుకు కూల్చారని, కానీ,ఈ రియల్ ఎస్టేట్ టైకూన్ ఎందుకు కూల్చలేదని క్రిశాంక్ ప్రశ్నించారు. తిరుపతి ఏ పేరిట ఉన్న ఫాం హౌస్, కాంగ్రెస్ బ్యానర్ ఫోటోను ట్వీట్ లో పోస్టు చేశారు.