తిరుమల : జగన్ రాకపై ఉత్కంఠ.. ఏం చేసినా బీజేపీకి అస్త్రమే

రాష్ట్ర రాజకీయాలు తిరుమల కొండ లడ్డూ చుట్టూ తిరుగుతున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారం ముదిరి పాకానపడింది. ఇది మత రాజకీయంగా మారి, జగన్ పర్యటనపై ఉత్కంఠ రాజ్యమేలుతోంది

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-09-27 05:11 GMT

ఇంకొన్ని గంటల్లో తిరుపతికి మాజీ సీఎం వైఎస్. జగన్ చేరుకుంటారు. తాడేపల్లి నుంచి ఆయన విమానంలో 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శుక్రవారం రాత్రి ఏడు గంటలకు తిరుమలకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. ఈ సమయం, పర్యటనే ఉత్కంఠకు తెరతీసింది.

అలిపిరి వద్ద డిక్లరేషనా?
"అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలి" అని కొందరు విడ్డూరమైన డిమాండ్ తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు టీటీడీ అధికారులు డిక్లరేషన్ కోరే అవకాశం ఉంది. ఇదే ప్రస్తుతం వైసీపీకి ప్రధానంగా వైఎస్. జగన్ ముందు ఉన్న సవాల్. గతంలో ఎన్నోసార్లు ప్రతిపక్ష నేతగా, సీఎం హోదాలో తిరుమలకు వచ్చిన వైఎస్. జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు. ఇవ్వడానికి సుముఖత కూడా చూపలేదు.
ఎవరైనా సరే ఓ చిన్న విషయం ఆలోచన చేయాలి. రాజకీయాల్లో ఉన్న ప్రముఖులే కాదు. సామాన్యులు కూడా దేశంలోని అనేక మత సంస్థలకు వెళుతుంటారు. సందర్శించి వస్తుంటారు. వారంతా అక్కడ ప్రమాణం చేస్తున్నారా? చేస్తారా? ఒక మనిషిగా మనం కొన్ని విభిన్న మతాల ప్రార్ధనాలయాలకు వెళుతున్నాం. అంటే ఆ ఆలయాలు, ప్రార్ధనా మందిరాలపై విశ్వాసం, గౌరవం ఉండబట్టే కదా? వెళ్లేది. ఈ విషయంలో మాత్రం రాజకీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ తిరుమలను హిందూమతానికి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ పరిస్థితుల్లో
ఎలా చేసినా వారికి అస్త్రమే
రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తిన్న వైఎస్. జగన్ సున్నితమైన ఈ వ్యవహారంలో కూడా తనపై వస్తున్న ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పాలనే లక్ష్యంతోనే తిరుమల పర్యటన ఖరారు చేసుకున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలావుంటే.. హిందూ ధర్మాన్ని పాటిస్తానని, శ్రీవెంకటేశ్వర స్వామిపై భక్తి విశ్వాసాలు ఉన్నాయని, డిక్లరేషన్ పై పెట్టాలనే డిమాండ్ తీవ్ర స్థాయిలో ఉంది. దీనిపై సంతకం పెట్టి వెళ్లినా.. లేక తాను ఆ విధంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మొండిగా వాదించి తిరుమలకు వెళ్లాలని ప్రయత్నించినా వివాదం చెలరేగే అవకాశం ఉన్నట్లు వాతావరణం చెబుతోంది. వైఎస్. జగన్ ఎలా వ్యవహరించినా సరే టీడీపీ జనసేన, బీజేపీ రాజకీయంగా వైఎస్. జగన్ పై ఎదురుదాడి చేయడానికే సంసిద్దం అయ్యారు.
రాజకీయ క్షేత్రంగా తిరుమల?
అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర రాజకీయాలు మొత్తం తిరుపతిలో కేంద్రీకృతమయ్యాయి. తిరుమలలో బీజేపీ ఫైర్ బ్రాండ్ నేతలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో టీడీపీ కూటమి నేతలు తిరుమల కొండను రాజకీయ వేదికగా మార్చుకున్నారు.

మరో వారంలో తిరుమల కొండపై ఆధ్యాత్మిక అమృతవాహిని శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. భక్తులను ఆధ్యాత్మిక డోలికల్లో ఉంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఇప్పుడు ఆ బాధ్యతలను పక్కనపెట్టి దండయాత్రకు వస్తున్న వారిపై దృష్టి సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.‌ బ్రహ్మోత్సవాల కోసం వస్తున్న భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించి, వివాదాలు చుట్టుముడుతున్న వేళ...తిరుమలలో భక్తుల మనోభావాలను కాపాడి, దేవుడి భక్తి, లడ్డూ పవిత్రత, సంస్థ ప్రతిష్ట కాపాడాల్సిన బాధ్యత టీటీడీ కార్యనిర్వహణాధికారి, అదనపు కార్యనిర్వహణాధికారి, ఉన్నతాధికారుల బృందంపై ఉంది. రాజకీయాలకు అతీతంగా వారిలో ఉన్న సమర్థవంతమైన పనితీరును ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది.
శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే ఆవు నెయ్యిలో "గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, వెజిటేబుల్స్ ఆయిల్"తో కల్తీ చేశారని సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో వివాదం చెలరేగింది. మాజీ సీఎం వైఎస్. జగన్, టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, టీటీడీ మాజీ ఈఓ ఏవీ. ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంస్థలతో సహా ప్రధానంగా టీడీపీ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ జీఓ కూడా విడుదల చేసింది.
"మాజీ సీఎం వైఎస్. జగన్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను మంట గలిపారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
దీటైన సమాధానం చెప్పాలనే...
"తనపై జరుగుతున్న రాజకీయ దాడిని ఎదుర్కొనేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా 28వ తేదీ తిరుమల శ్రీవారి దర్శనానికి కార్యక్రమం ఖరారైంది. ఇటీవల టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లి ఆలయం ఎదుట తన హయాంలో ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశారు. కాగా,
వైఎస్. జగన్ పర్యటన ను అడ్డుకునేందుకు స్వామీజీలు శుక్రవారం అలిపిరి నుంచి తిరుమల వరకు వందలాది మందితో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.‌
ప్రముఖుల తాకిడి..
బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ నాల్గవ తేదీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు రానున్నారు.
అంతకుముందే అక్టోబర్ ఒకటిన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తిరుమలకు రానున్నారు. ఇలా.. ప్రముఖుల రాకతో తిరుపతిలో ఏం జరుగుతుందో అనే ఆందోళన ఇటు శ్రీవారి భక్తుల్లో వ్యక్తం అవుతోంది. ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు.


Tags:    

Similar News