బిజెపి తెలంగాణ విజయ సంకల్పం నెరవేరేనా?

మళ్లీ మోదీ గెలవాలి..ప్రధాని కావాలి నినాదంతో కమలనాథులు తెలంగాణలో విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు.5 క్లస్టర్ల నుంచి ప్రారంభమైన ఈ యాత్రపై ప్రత్యేక స్టోరీ.

Update: 2024-02-20 04:10 GMT
vijaya sankalpa yatra (Photo Credit : BJP)

కలిసి కదులుదాం, మరోసారి మోదీని గెలిపిద్దాం అంటూ తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం , రాజరాజేశ్వర, కాకతీయ భద్రకాళి, కృష్ణమ్మ, భాగ్యలక్ష్మీ క్లస్టర్ల నుంచి మంగళవారం ఏకకాలంలో కమలనాథులు విజయసంకల్ప యాత్రను ప్రారంభించారు. బీజేపీ విజయమే లక్ష్యంగా ఐదు క్లస్టర్లుగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మంగళవారం నుంచి మార్చి నెల 2వతేదీ వరకు 12 రోజులపాటు 4,238 కిలోమీటర్ల దూరం విజయసంకల్ప యాత్ర చేపట్టారు.రామ మందిరంలో రాజకీయ మైలేజీని దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ యాత్రలో ఐదు దశాబ్దాల అయోధ్య రామమందిరం కలను సాకారం చేసిన మోదీ సందేశంతో పాటు గత పదేళ్లలో కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం బాసరకు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, యాదాద్రికి గోవా సీఎం ప్రమోద్ సావంత్, తాండూరుకు కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, మక్తల్‌కు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలను అసోం, గోవా సీఎంలు జెండా ఊపి ప్రారంభించారు.పది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో పార్టీ సీనియర్ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, వివిధ ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు.

బీజేపీ ఐదు కీలక యాత్రలు...

తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలువడమే లక్ష్యంగా మంగళవారం నాలుగు కీలక ప్రాంతాల నుంచి బీజేపీ సంకల్ప యాత్రలను అట్టహాసంగా ప్రారంభించింది. కొమరంభీం విజయ సంకల్ప యాత్ర ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని భైంసా నుంచి ప్రారంభమైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గాల్లో కొమరంభీం విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. 1,056 కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్ర 12 రోజుల పాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో 1,217 కిలోమీటర్ల దూరం కొనసాగుతోంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతోంది. భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులతో ప్రారంభమైన యాత్ర భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర సమ్మక్క సారక్క జాతర కారణంగా రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల శంకర్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో తాము చేపట్టిన యాత్రలు తమ పార్టీకి ఓట్లు సాధించి పెడతాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ధీమా వ్యక్తం చేశారు. అయోధ్యలో శ్రీరామాలయం నిర్మాణం, మోదీ పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను గడపగడపకు యాత్రల ద్వారా తీసుకువెళుతున్నామని పాయల శంకర్ వివరించారు. భద్రాచలంలోని రాముల వారి సన్నిధి నుంచి ప్రారంభయ్యే సమ్మక్క సారక్క యాత్ర వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 1,015 కిలోమీటర్ల దూరం 7 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు.

పది ఎంపీ సీట్లలో పాగాకు కమలనాథుల వ్యూహం

తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లను గెల్చుకుంది. నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సీట్లలో కాషాయ జెండా ఎగిరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లను కైవసం చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం రెట్టింపు అయింది. 2018వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 6.98 శాతం ఓట్లే వచ్చాయి. కమలం పార్టీ ఓట్ల శాతాన్ని 13.90 శాతానికి పెంచుకోవడంతోపాటు సీట్ల సంఖ్యను ఒకటి నుంచి ఎనిమిదికి పెంచుకుంది. గతంలో 17 లోక్‌సభ స్థానాలకు గాను నాలుగు స్థానాలను గెలుచుకున్న బీజేపీ, త్వరలో జరగను పార్లమెంటు ఎన్నికల్లో 10 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాము ప్రజల మద్ధతుతో తెలంగాణలో ఈ సారి 10 పార్లమెంటు సీట్లలో తప్పకుండా విజయం సాధిస్తామని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చెప్పారు.

జేపీ నడ్డా వ్యాఖ్యలు...తెలంగాణ నేతలకు టానిక్

ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తామని నడ్డా ధీమాగా చెప్పారు. నడ్డా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కమలనాథులకు టానిక్ లా పనిచేశాయి.దీంతో నడ్డా ఆదేశంతో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవాలని వ్యూహం పన్నారు. ఈ వ్యూహ రచనలో భాగంగానే బీజేపీ ఐదు విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. గతంలో తెలంగాణలో బీజేపీకి ఒక శాసనసభ్యుడే ఉన్నాడని.. అప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 7.1 ఉందన్నారు. అయితే, ఇప్పుడు అది రెట్టింపై 14 శాతానికి పెరిగి 8 మంది బీజేపీ శాసనసభ్యులు గెలుపొందారని జేపీ నడ్డా పేర్కొన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, దీనికోసం తాము సన్నద్ధమవుతున్నట్లు జేపీ నడ్డా ప్రకటించారు.

నరేంద్రమోదీని మరోసారి గెలిపిద్దాం అంటూ కిషన్ రెడ్డి ఎక్స్ పోస్టు

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మద్ధతు పొందడం కోసమే తాము విజయ సంకల్ప యాత్రలు చేపట్టామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ యాత్రలో భాగంగా కేంద్ర పథకాల లబ్దిదారులను కలుస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కలిసి కదులుదాం... మరోసారి ప్రధానిగా నరేంద్రమోదీని గెలిపిద్దాం అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి బీజేపీ శ్రేణులకు ఎక్స్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఈ సారి హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఎంఐఎం నుంచి బీజేపీ లాక్కుంటుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వానికి తెలంగాణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన ప్రచార రథాలు గోడ పత్రికలు, కరపత్రాలను హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి ఆవిష్కరించి, కమలనాథులకు జోష్ ఇచ్చారు.తెలంగాణ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా కిషన్ రెడ్డి బషీరాబాగ్ లోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేసి 10రోజుల యాత్రను ప్రారంభించారు.

తెలంగాణలో పది సీట్లు టార్గెట్

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పది సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని లక్ష్మణ్ ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది గాలివాటం గెలుపని, కానీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ గట్టి పోటీ ఇస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు. భారతదేశాన్ని నిజమైన ఆత్మనిర్భర్‌గా మార్చి, విశ్వగురువుగా దాని ప్రాచీన వైభవాన్ని తిరిగి పొందేలా చేయడానికి ప్రధానమంత్రి మోదీకి ప్రజలు మద్ధతు ఇవ్వాలని డాక్టర్ కె.లక్ష్మణ్ కోరారు.

కోలాహలంగా కమలనాథుల యాత్రలు

తెలంగాణలో నాలుగు పుణ్యక్షేత్రాల నుంచి మంగళవారం ప్రారంభమైన విజయ సంకల్ప యాత్రలు కోలాహలంగా సాగుతున్నాయి. కాషాయ వస్త్రాలు ధరించి, కమలం జెండాలను చేతబట్టుకొని వేలాది మంది కార్యకర్తలు ఈ యాత్రల్లో పాల్గొన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, పార్టీ నాయకులు ఈటెల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఈ యాత్రల్లో పాల్గొన్నారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలు, మోదీ సర్కారు పదేళ్ల విజయాలు, అయోధ్య రామజన్మభూమి అంశాలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశాలుగా నిలుస్తాయని, దీనివల్ల బీజేపీకి సీట్లు పెరగవచ్చని తెలంగాణాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గోనే రాజేంద్రప్రసాద్ చెప్పారు.

ఇంటింటికి రామమందిరం ఫొటోల పంపిణీ

ఈ సారి ఎన్నికల్లో అయోధ్య సెంటిమెంట్ ను రగిల్చేందుకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యక్రమాలు చేపట్టారు. రామభక్తులను అయోధ్యకు తీసుకెళ్లడంతోపాటు రామ మందిరం, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో కూడిన కార్డులను ఇంటింటికి పంపిణీ చేశారు.ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత అభ్యుదయ భావాలు కలిగిన ముస్లిం యువత, మహిళలు కూడా మోదీని సోదరుడిలా చూస్తున్నారని బండి సంజయ్‌కుమార్‌ చెప్పారు. కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ తన నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా హిందూ కుటుంబాలకు కార్డులు పంపిణీ చేశారు.

తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉన్నతాశయంతో కమలనాథులు మంగళవారం నుంచి చేపట్టిన విజయ సంకల్ప యాత్ర బీజేపీని విజయ తీరాలకు చేరుస్తుందా? లేదా అనేది పార్లమెంటు ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News