రైతుల భూమి గుంజుకోవడంలో కెసిఆర్ కూ, మీకూ తేడా ఏమిటి, రేవంత్ ?
కోర్టు ఆదేశాల బే ఖాతరు! చట్టాల ఉల్లంఘన! ఇతరులకు మాత్రం నీతుల బోధన! ఇది రేవంత్ ప్రభుత్వం తీరు!;
ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, రద్దు చేస్తామన్న ఫార్మా సిటీని, రద్దు చేస్తామన్న భూసేకరణను రద్దు చెయ్యక పోగా, గౌరవ హైకోర్టు (Telangana High Court) స్టే ఇచ్చిన భూముల చుట్టు కంచె వేయిస్తూ, మీరు కోర్టు ధిక్కరణ చేస్తున్నారని అడ్డుబోయి ప్రశ్నించిన రైతులను, గ్రామస్తులను పోలీసు బలగంతో బెదిరించి, అక్రమంగా నిర్భంధించి, చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తోంది తెలంగాణ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కారు. దీనిపై కంటెంప్ట్ పిటిషన్ వేస్తే ఇప్పుడు రాత్రికి రాత్రి హిటాచీలను ఊర్లోకి దింపుతున్నారు.”
ఫార్మా సిటీ (Pharma city) ఏరియాలో నివసిస్తూ, వ్యవసాయం చేస్తూ, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీకి నేతృత్వం వహిస్తున్న సామాజిక కార్యకర్త సరస్వతి కవుల, ఏప్రిల్ 10 న రాత్రి సామాజిక కార్యకర్తలకు ఆవేదనతో, ఆందోళనతో పంపిన ఒక మెసేజ్ ఇది. ఎందుకంత అన్యాయంగా , తొందరపాటుతో వ్యవహరిస్తోంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.
2014 నుండీ 2023 వరకూ పదేళ్ళ పాటు KCR నేతృత్వంలోని BRS పార్టీ ప్రజల పట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రజల పట్ల ఇలాగే వ్యవహరించి, చివరికి ప్రజల ఆగ్రహానికి గురై తన ప్రభుత్వాన్ని కోల్పోయింది. వివిధ రాష్ట్రాలలో ఏదో ఒక వంకతో ముస్లింల ఇళ్ల పైకి , బుల్డోజర్ లు పంపిస్తూ, ఇళ్లను కూలగొడుతూ, నరేంద్ర మోడీ నేతృత్వం లోని బీజేపీ పార్టీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధి నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ, గొంతు విప్పి మాట్లాడుతున్నాడు. ఈ తప్పుడు విధానాలకు భిన్నంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం, భూ సేకరణ విషయంలో అదే తప్పుడు మార్గాలను అనుసరించడం అన్యాయం.
హైదరాబాద్ (Hyderabad) కు అత్యంత సమీపంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మా సిటీ నిర్మాణం పేరుతో గత BRS ప్రభుత్వం రైతుల నుండీ వేలాది ఎకరాల భూములను గుంజుకున్నది. రైతులకు సరైన నష్ట పరిహారం కూడా చెల్లించకుండా అన్యాయం చేసింది. ఫార్మా సిటీ కోసం సేకరించాలనుకున్న రెండు వేల ఎకరాలకు పైగా సాగు భూములను ధరణి పోర్టల్ లో నిషేధిత భూముల జాబితాలో పెట్టింది. ఫలితంగా ఆ భూముల యజమానులకు రైతు బంధు, రైతు బీమా పథకాలు అందకుండా అడ్డుకుంది. BRS ప్రభుత్వ అన్యాయ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ లు తెచ్చుకున్నారు. కోర్టులో కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ (Congress) పార్టీ నాయకులందరూ ఈ ఫార్మా సిటీ ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు. ఆయా గ్రామాలలో పాద యాత్రలు చేశారు. రైతుల ఉద్యమాలకు అండగా నిలబడ్డారు. గత ప్రభుత్వ దుర్నీతిని ప్రశ్నించారు.
మానవ హక్కుల వేదిక నాయకులు, పర్యావరణ వేత్త డాక్టర్ కె. బాబూరావు గారి లాంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ నిర్మాణం ప్రమాదకరమని, అక్కడ నిర్మిస్తున్న ఫార్మా సిటీ అత్యంత కాలుష్య కారకమని,అది హైదరాబాద్ కు కూడా చేటు చేస్తుందని ప్రకటించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఫార్మా సిటీ కి వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించాయి.
వీటన్నిటికీ మించి , తాము అధికారంలోకి వస్తే, “ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీ లను రద్ధు చేస్తామని” కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టో లో చెప్పింది. తమ పార్టీ నిర్వహించిన సభలలో మాత్రం స్పష్టంగా ఫార్మా సిటీని రద్ధు చేస్తామని ప్రకటించింది. “నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో తొలగిస్తాం “ అని హామీ ఇచ్చింది.
కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా , నిషేధిత జాబితాలో నుండీ పట్టా భూములను తొలగించలేదు. హామీ ఇచ్చినట్లుగా ఫార్మా సిటీ రద్ధు చేయక పోగా, ఫార్మా సిటీ కొనసాగుతుందని రాష్ట్ర హై కోర్టుకు తెలిపింది. పైగా HMDA పరిధిని విస్తరించి ఫార్మా సిటీ కోసం భూములను సేకరించిన గ్రామాలను కూడా అందులో భాగం చేసింది. ఫ్యూచర్ సిటీ లో భాగంగా ఈ గ్రామాలు ఉంటాయని, ఈ ఫ్యూచర్ సిటీ కోసం కూడా మరిన్ని భూములను సేకరిస్తామని ప్రకటించి, ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నది. ఆయా గ్రామాల పరిధిలో భూముల కోసం నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్నది. ఇక్కడ దళితుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి అసైన్డ్ భూములను కూడా పూర్తిగా వెనక్కు తీసుకునే ఆలోచనలు చేస్తున్నది.
పైగా తాను ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా, 2023 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ KCR తెచ్చిన 2017 చట్టం ప్రకారం నోటిఫికేషన్ లు జారీ చేస్తున్నది. తాజాగా ఫార్మా సిటీ హద్దులను గుర్తించే పేరుతో కోర్టులో స్టే తెచ్చుకున్న రైతుల పట్టా భూములలో కూడా సరిహద్దులను గుర్తించి, జండాలు పాతుతున్నది. ఈ అన్యాయ భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామాలలో ప్రచార సభలు నిర్వహించాలనుకున్న పోరాట కమిటీకి అనుమతులు మంజూరు చేయకుండా అడ్డుకుంటున్నది. పోరాట కమిటీ రాష్ట్ర హైకోర్టు నుండీ అనుమతి తెచ్చుకుని ఒక సభను నిర్వహించింది. మరిన్ని గ్రామాలలో సభలు నిర్వహించాలనుకున్నా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నది ? 2013 చట్టం కాకుండా 2017 చట్టాన్ని ఎందుకు భూసేకరణ కోసం వాడుకుంటున్నది? దీనికి రాష్ట్ర ప్రభుత్వమే జవాబు చెప్పాలి.
2014-2023 మధ్య అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో రైతుల నుండీ సేకరించిన భూముల వివరాలు - సంవత్సరం, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వారీగా పట్టా మరియు అసైన్డ్ భూముల వివరాలు - ఎక్కడా ప్రజల ముందు పారదర్శకంగా లేవు. గత ప్రభుత్వ తప్పులను ఎన్నికల ప్రచారం సమయంలో ఎండగట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక, భూ సేకరణ విషయంలో అప్పటి ప్రభుత్వం చేసిన తప్పులను క్రోడీకరించి, ఒక శ్వేత పత్రం విడుదల చేస్తే బాగుండేది. కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ అభివృద్ధి నమూనాలో నడవాలని భావిస్తున్నది కాబట్టి, తాను కూడా భూ సేకరణ విషయంలో అన్యాయాలకు పాల్పడుతున్నది కాబట్టి అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు.
వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసిన సమయంలో ప్రకారం గత ప్రభుత్వం రైతులకు చెల్లించిన పరిహారం, ఇతర వివరాలు కూడా ప్రజల ముందు పారదర్శకంగా లేవు. అంతెందుకు, 2013 చట్టానికి సవరణలు చేస్తూ, 2017లో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన చట్టం కూడా తెలుగులో,ఉర్దూ లో ప్రజలకు అందుబాటులో లేదు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాజెక్టు కోసం, ఒక్కో రకంగా వ్యవహరించింది. పరిహారం అందరికీ సమానంగా అందించలేదు. పైగా అసైన్డ్ భూములకు మరింత తక్కువ పరిహారం అందించింది. ప్రజలు సమిష్టిగా ఆందోళనలు చేసిన చోట ఎక్కువ పరిహారం పొందారు. కొన్నిసార్లు కోర్టుకు వెళ్ళి అధిక పరిహారం పొందారు.
కొన్ని చోట్ల పట్టా భూములపై హక్కులు కలిగిన రైతులకు మాత్రమే పరిహారం అందింది. మరి కొన్ని చోట్ల కోర్టుకు వెళ్ళి వ్యవసాయ కూలీలు కూడా పరిహారం సాధించుకున్నారు. కొన్ని ప్రాంతాలలో మొదటి దశలో జీవో 123 ప్రకారం ప్రభుత్వం భూములను గుంజుకుంది. ఈ జీవో ను రాష్ట్ర హి కోర్టు కొట్టేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ఒక కొత్త చట్టాన్ని ఆమోదించింది. 2013 చట్టానికి భిన్నమైన ఈ కొత్త చట్టానికి బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ( రాష్ట్రపతి ద్వారా ) ఆమోదం తెలిపింది . రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుండీ కొత్త చట్టం ప్రకారం భూములను సేకరించింది.
2014-2025 మధ్య తెలంగాణ ప్రభుత్వం సేకరించిన భూములు :
2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అభివృద్ధి ప్రాజెక్టులు ( సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, రైల్వే లైన్లు, ఫార్మా సిటీ , NIMZ వంటివి) కోసం విస్తృతంగా భూసేకరణ జరిగింది. అధికారిక డేటా అందుబాటులో లేకపోయినా, వివిధ వార్తా నివేదికలు ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా 2014-2023 మధ్య తెలంగాణ ప్రభుత్వం సుమారు 1,00,000 నుండీ 1,50,000 ఎకరాలు సేకరించినట్లు అంచనా వేయవచ్చు.
1. మల్లన్నసాగర్ ప్రాజెక్టు : సుమారు 22,000 ఎకరాలు (ఉమ్మడి మెదక్ జిల్లా).
2. NIMZ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్,జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా): సుమారు 25,000 ఎకరాలు
3. హైదరాబాద్ ఫార్మా సిటీ: సుమారు 20,000 ఎకరాలు (రంగారెడ్డి జిల్లా).
4. ఇతర సాగునీటి ప్రాజెక్టులు : 45,000 ఎకరాలకు పైగా (2017 లో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఒక నివేదిక ప్రకారం).
5. ఈ భూములలో పట్టా ( ప్రైవేట్ యాజమాన్యం ) మరియు అసైన్డ్ (ప్రభుత్వం రైతులకు కేటాయించిన ) భూములు రెండూ ఉన్నాయి.
2013 భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం చెల్లించాలి. జీవనోపాధి కోల్పోయిన వారికి రీసెటిల్మెంట్ మరియు రిహాబిలిటేషన్ (R&R) ప్రయోజనాలు అందించాలి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ చట్టం అమలు సక్రమంగా జరగలేదు. ఉదాహరణకు
1. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలో 2013 చట్టం ప్రకారం ఎకరానికి 24 లక్షలు (మార్కెట్ విలువ 6 లక్షలు x 4) చెల్లించాల్సి ఉండగా, GO 123 ద్వారా కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు.
2. ఫార్మా సిటీ ప్రాజెక్టు పరిధిలో పట్టా భూమికి సుమారు 12.5 లక్షలు, అసైన్డ్ భూమికి సుమారు 5 నుండీ 7. 7 లక్షలు ( అది కూడా అందరికీ కాదు) చెల్లించారు. ఇది 2013 చట్టం సూచించిన మొత్తం కంటే చాలా తక్కువ. ఇలాంటి అన్యాయమే అన్ని ప్రాజెక్టుల పరిధిలో సాగింది.
2013 సేకరణ చట్టం లో ప్రధాన అంశాలు :
1. సామాజిక ప్రభావ అధ్యయనం (SIA): భూసేకరణకు ముందు SIA తప్పనిసరి. ఇది ప్రాజెక్టు ప్రజా ప్రయోజనాన్ని, రైతులపై దాని ప్రభావాన్ని అంచనా వేస్తుంది.
2. సమ్మతి షరతు: ప్రైవేట్ ప్రాజెక్టులకు 80 శాతం , పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) ప్రాజెక్టులకు 70 శాతం భూమి యజమానుల సమ్మతి అవసరం.
3. పరిహారం: గ్రామీణ ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువకు 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు చెల్లించాలి.
4. పునరావాసం మరియు పునరాధారం (R&R): భూమి కోల్పోయిన రైతులకు ఆర్థిక పరిహారంతో పాటు జీవనోపాధి మరియు గృహ సౌకర్యాలు అందించాలి. సేకరించే భూములపై ఆధారపడిన ఇతర ప్రజలకు కూడా పరిహారం అందించాలి.
5. సాగు భూమి రక్షణ: నీటి పారుదల సౌకర్యం ఉన్న బహుళ పంటల భూమిని సేకరించడంపై పరిమితులు ఉన్నాయి.
6. ఈ చట్టం రైతులకు న్యాయమైన పరిహారం, పారదర్శకత, మరియు జీవనోపాధి రక్షణను హామీ ఇచ్చే లక్ష్యంతో రూపొందించబడింది.
2017 తెలంగాణ సవరణ చట్టం Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement (Telangana Amendment) Act, 2016 (Act No. 21 of 2017) ఏమంటోంది ?
తెలంగాణ ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టానికి 2016 లో సవరణలను ఆమోదించింది. 2017లో రాష్ట్రపతి ఆమోదంతో అమలులోకి తెచ్చింది. ఈ చట్టం 01.01.2014 నుండీ రెట్రోస్పెక్టివ్‌గా అమలు లోకి వస్తుంది. .
ముఖ్య సవరణలు :
1. సెక్షన్ 31 A చేర్పు: సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణలో R&R స్థానంలో ఒకేసారి చెల్లింపు చేయవచ్చు. –
2. సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (SIA)మినహాయింపు: సామాజిక ప్రభావ అధ్యయనం నుండి కొన్ని ప్రాజెక్టులను మినహాయించారు (GO 123 ద్వారా)
3. సమ్మతి షరతు తొలగింపు: ప్రైవేట్ మరియు PPP ప్రాజెక్టులకు రైతుల సమ్మతి అవసరాన్ని తొలగించారు, దీనివల్ల ప్రభుత్వం ఏకపక్షంగా భూమిని సేకరించే అవకాశం పెరిగింది.
4. పరిహారంలో సౌలభ్యం: 2013 చట్టం కంటే తక్కువ పరిహారం చెల్లించే విధంగా GO లు (ఉదా., GO 123) జారీ చేశారు.
2017 సవరణ చట్టం అమలు చేస్తూ, ప్రభుత్వాలు రైతులకు తక్కువ పరిహారం చెల్లిస్తున్నాయి. ఇది రైతులకు,ఇతర గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా నష్టం కలిగిస్తుంది.
2013 చట్టం ప్రకారం ఒక ప్రాజెక్టుకు రైతుల, ప్రజల సమ్మతి తప్పనిసరి కాగా, 2017 చట్టంలో దీనిని తొలగించడం వల్ల రైతులు తమ భూమిని బలవంతంగా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉదాహరణకు, ఫార్మా సిటీలో రైతులు వ్యతిరేకించినప్పటికీ భూసేకరణ జరిగింది.
2013 చట్టం నిర్వాసితులకు R&R (పునరావాసం, ఇళ్లు, జీవనోపాధి) హామీ ఇస్తుంది. కానీ 2017 చట్టం లో చేసిన సవరణలు లంప్‌సమ్ చెల్లింపును అనుమతించడం వల్ల రైతులు దీర్ఘకాలిక రక్షణ కోల్పోతున్నారు.
2017 చట్టంలో సామాజిక ప్రభావ అధ్యయనం మినహాయించడం వల్ల ప్రాజెక్టు రైతుల జీవనోపాధిపై ,స్థానిక పర్యావరణం పై చూపే ప్రభావాన్ని అంచనా వేయకుండా భూసేకరణ జరుగుతోంది. ఇది పారదర్శకతను తగ్గిస్తుంది.
పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు కూడా సమాన పరిహారం చెల్లించాలని, 2013 చట్టం, కోర్టు తీర్పులు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వాలు అసైన్డ్ రైతులకు ఇప్పటికీ తక్కువ పరిహారం చెల్లించడం వల్ల దళిత, గిరిజన రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు
ఒక్క మాటలో, 2017 సవరణ చట్టం 2013 చట్టం ప్రజలకు,ముఖ్యంగా నిర్వాసితులకు ఇచ్చిన రక్షణలను (సమ్మతి, SIA, R&R, న్యాయమైన పరిహారం) బలహీన పరిచింది. ఈ సవరణలు ప్రభుత్వానికి భూసేకరణను వేగవంతం చేయడంలో సౌలభ్యం కల్పించినప్పటికీ, రైతుల,ఇతర గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక భద్రతను దెబ్బతీసాయి. అటువంటి అన్యాయ చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చయడం మానుకోవాలి. ఈ చట్టం క్రింద ఇప్పటి వరకూ ఇచ్చిన నోటిఫికేషన్ లను కూడా రద్ధు చేయాలి.
BRS పార్టీని గద్దె దించిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నుండీ న్యాయమైన పాలనను ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా , తన ధోరణి మార్చుకుని తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ముఖ్యంగా ఫార్మా సిటీ రద్ధు, భూ సేకరణ విషయాలలో ఇది తక్షణావసారం. గత ప్రభుత్వం రైతుల నునీ అన్యాయంగా సేకరించిన భూములకు ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా తగిన పరిహారం చెల్లించడమో , లేదా భూములను రైతులకు వెనక్కు ఇవ్వడమో చేయాలి. ఒక ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను , ఆ ప్రాజెక్టు కోసం కాకుండా, ఇతర ప్రాజెక్టులకు మళ్లించడం మానుకోవాలి. ఇది చట్ట విరుద్ధం కూడా. అనుకున్న ప్రాజెక్టులు ముందుకు పోకపోతే,రైతులకు భూములను మళ్ళీ సాగు కోసం వెనక్కు ఇవ్వడమే న్యాయం.
పరిశ్రమలు, లేదా ఇతర వ్యవసాయేతర అవసరాలకు భూమి అవసరమైనప్పుడు , రైతుల యాజమాన్య హక్కులను మార్చకుండా, రైతులకు నచ్చ చెప్పి, అవసరమైన విస్తీర్ణంలో భూములను రైతుల నుండీ లీజుకు తీసుకోవచ్చు. రాతపూర్వక లీజు ఒప్పందాల ద్వారా, రైతులకు ప్రతి నెలా తగిన ఆదాయం వచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఈ ఒప్పందాలు చేయించవచ్చు. లేదా కొత్తగా వస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులలో ఆయా ప్రాంతాల ప్రజలను, ముఖ్యంగా రైతులను కూడా భాగస్వాములను చేయడం మంచిది. అప్పుడు ఆయా ప్రాజెక్టుల ద్వారా కంపనీలు సాధించే లాభాలలో రైతులకు కూడా వాటా అందుతుంది.
ఏదైనా కారణాల వల్ల ఆయా పరిశ్రమల యాజమాన్యాలు , ప్రాజెక్టులు నడపలేని స్థితిలో వాటా దారులుగా ఉన్న రైతులకు భూమిపై యాజమాన్య హక్కులు మిగులుతాయి. వీటన్నిటికీ మించి, గ్రామీణ ప్రాంతాలలో అత్యంత కాలుష్య కారక పరిశ్రమలకు ( ఇథనాల్ , ఫార్మా, ఇతర రసాయన కంపనీలకు) ఇస్తున్న అనుమతులను పునః సమీక్షించి, వాటిని రద్ధు చేయాలి.