రెన్నెళ్లయినా ఫ్లోర్ లీడర్ లేని తెలంగాణ బిజెపి, ఎమయిందీ పార్టీకి?

తెలంగాణ బీజేపీ అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతను నియమించలేక పోయింది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేని పార్టీగా మిగిలింది....

Update: 2024-02-11 01:00 GMT
BJP

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలకు పైగా గడచినా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతను నియమించలేక పోయింది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేని పార్టీగా మిగిలింది. కమలదళంలో ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదరక పోవడంతో బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు తమ ఫ్లోర్ లీడర్లను నియమించినా బీజేపీ మాత్రం శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోవడంలో విఫలమైంది.

ఆ మధ్య  కర్ణాటకలోనూ అంతే...

కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి చాలా రోజులైనా ప్రతిపక్ష నాయకుడి ఎన్నిక ఆరునెలల తర్వాత జరిగింది.  ఓటమి ఆ పార్టీని ఎంతగా క్రుంగ దీసిందంటే, పార్టీని నడిపించే నాధుడే లేకుండా పోయాడు.  కర్ణాటక బీజేపీ నేతలు ప్రతిపక్షనాయకుడి ఎంపిక చేసుకోలేని స్థితిలో పడిపోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలయ్యాక ఆరు నెలలకు ప్రతిపక్ష నేతగా కోట శ్రీనివాస్ పూజారిని ఎట్టకేలకు నియమించారు. బీజేపీ పక్ష డిప్యూటీ లీడరుగా సునీల్ వాల్యాపురిని, చీఫ్ విప్ గా సీనియర్ ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ను నియమించారు. దాదాపు తెలంగాణ ఇదే దారిలో వెళుతున్నట్లుంది.

పెండింగులోనే బీజేఎల్పీ నేత ఎన్నిక

కమలదండు రాష్ట్ర అధినేత, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫ్లోర్ లీడరును ఎన్నుకుంటారని భావించినా ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న విబేధాలతో నేత ఎంపిక పెండింగులోనే ఉంది. డిసెంబరు నెలలో రాష్ట్రానికి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చినపుడు బీజేఎల్పీ నేత ఎన్నిక జరుగుతుందని భావించినా కుదరలేదు. బీజేఎల్పీ నేత ఎన్నిక త్వరలో జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గతంలో రెండు సార్లు ప్రకటించినా ఇంతవరకు ఎన్నిక మాత్రం జరగలేదు. తెలంగాణ అసెంబ్లీలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికి వారు తమకే బీజేఎల్పీ పగ్గాలు ఇవ్వాలని కోరుతుండటంతో నేత ఎన్నిక వ్యవహారం సంక్లిష్టంగా మారింది.

బీజేఎల్పీ పగ్గాల కోసం పోటాపోటీ

గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ బీజేఎల్పీ పగ్గాలు సీనియర్ అయిన తనకే అప్పగించాలని కోరుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్ ను గతంలో బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తివేసి గోషామహల్ బీజేపీ టికెట్టు ఇచ్చారు. రాజాసింగ్ కు తెలుగు భాషపై పట్టు లేదని కొందరు కమలనాథులు అంటున్నారు. మరో వైపు రెండోసారి విజయం సాధించిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తనకే బీజేఎల్పీ నేతగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

సీఎం, మాజీ సీఎంను ఓడించిన తనకే ఇవ్వాలంటున్న వెంకటరమణారెడ్డి

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్థుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లను ఓడించి సంచలన విజయం సాధించిన తనకే బీజేఎల్పీ నాయకుడిగా అవకాశం ఇవ్వాలని కే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీలకే సీఎం సీటు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో బీసీవర్గానికి చెందిన తనకే బీజేఎల్పీ పగ్గాలు ఇవ్వాలని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ కోరుతున్నారు. సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు, ముథోల్ నుంచి రామారావు పటేల్, ఆర్మూర్ నుంచి రాకేశ్ రెడ్డి విజయం సాధించారు. బీసీ కార్డును బీజేపీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటే తనకే బీజేఎల్పీ నేతగా అవకాశం వస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’తో చెప్పారు.

పార్లమెంటు ఎన్నికల దాకా పెండింగేనా?

త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేఎల్పీ నేతగా ఒకరికి అవకాశం కల్పిస్తే మిగిలిన వారు అసంతృప్తి చెందుతారనే భావనతోనే ఫ్లోర్ లీడర్ ఎన్నిక వ్యవహారాన్ని బీజేపీ అధిష్ఠానం పెండింగులో ఉంచిందని కమలనాథులు చెబుతున్నారు. తమ పార్టీకి ఫ్లోర్ లీడర్ లేకపోయినా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై తానే మాట్లాడానని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ చెప్పారు. తాను టీవీ డిబేట్లు, అసెంబ్లీలో, లాబీల్లో సమర్ధంగా బీజేపీ పార్టీ వాణిని వినిపిస్తున్నానని, తన పనితీరును చూసి బీసీ అయిన తనకే బీజేఎల్పీ నాయకుడిగా అవకాశం కల్పించాలని పాయల శంకర్ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ అంశాలపై అవగాహన ఉన్న వారికే బీజేఎల్పీ పగ్గాలు అప్పగించాలని కమలనాథులు కోరుకుంటున్నారు. మొత్తం మీద బీజేపీలో నేతల విబేధాలతో పార్లమెంటు ఎన్నికల తర్వాతే బీజేఎల్పీ నేత ఎంపిక చేయవచ్చని సీనియర్ బీజేపీ నాయకుడొకరు చెప్పారు.


Tags:    

Similar News