'పని చేయని కాడికి చేతులెందుకు!?'

ప్రముఖ రచయిత ఆలూరు రాఘవ శర్మ ‘అమ్మ జ్ఞాపకాలు’ కొత్త శీర్షిక ప్రారంభం.

Update: 2023-12-31 19:20 GMT
ఆలూరు విమలాదేవి

అమ్మ జ్ఞాపకాలు-1

-రాఘవశర్మ

"పని చేయనికాడికి ఈ చేతులెందుకు!?” అనేది మా అమ్మ.

ఆ మాట నన్నెప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.

ఎనభై రెండేళ్ళు వచ్చే వరకు వంట చేస్తూనే ఉంది.

తొంభై ఏళ్ళు వచ్చేవరకు చిన్నా చితకు పనులు చేయడం మానుకోలేదు.

పదేళ్ళ క్రితం పత్రికల నుంచి నేను రిటైరయ్యాను.

అప్పుడే మా అమ్మ కూడా వంటింటి నుంచి రిటైరయ్యింది.

పత్రికల నుంచి రిటైరైనా నేను రాయడం మానుకోనట్టుగానే, వంటింటి నుంచి రిటైరైనా, మా అమ్మ కూరగాయలు ఏరిపెట్టడం, బట్టలు మడత పెట్టడం వంటి పనులు చేయడం మానుకోలేదు.

పనులు చేయద్దంటే వినేది కాదు.

గత రెండేళ్ళ నుంచి పనిచేస్తుంటే శక్తి లేక చేతులు నొప్పి పుట్టేవి. తాత్కాలిక ఉపశమనమే అయినా, 'మోనోసిన్ బామ్' రాసుకుని మరీ పనిచేసేది.

"పనిచేయకుండా కూర్చుని తింటున్నా”నని తెగ బాధపడిపోయేది.

మా అమ్మ పని చేయడమే జీవితమనుకునేది.

పని చేస్తున్నంత కాలమే జీవిస్తున్నాననుకునేది.

పనిసంస్కృతికి మా అమ్మ ప్రతీ క.

చివరి శ్వాస విడవడానికి నెల రోజుల ముందు వరకు తన పనులు తానే చేసుకునేది.

పనులు చేయలేనప్పుడు ‘పరాధీనం వృథా జన్మ’ అనేది.

తొంభై ఒక్క సంవత్సరాలు బతికింది.

పని చేస్తూ ఉండడమే దీర్ఘాయుష్షుకి కారణమేమో !?

"పని చేయనికాడికి ఈ చేతులెందుకురా!?” అన్న మా అమ్మ మాటకు, పని చేయనప్పుడు పరాన్న జీవిగా బతుకుతున్నానన్న బాధ ఆమె గొంతులో ధ్వనించేది.

మా అమ్మ ఎలా ఉండేది..?

లావు కాదు, మరీ సన్నమూ కాదు.

తెల్లగా, కాస్త పొట్టిగా ఉండేది.

తలంతా అల్లుకుపోయిన వెండి తీగల్లాంటి జుట్టు.

కళగల గుండ్రటి ముఖం.

ముఖం నిండా చిరునవ్వు.

పొడవాటి ముక్కు.

తెల్లని రాళ్ళున్న ముక్కు పుడక.

చెవులకు మామిడి పిందెల్లాంటి దిద్దులు.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ వాటిని చూస్తూనే ఉన్నాను.

చాలా శుభ్రత పాటించేది.

మా అమ్మ ఎప్పుడూ తన పక్కలో ఒక అద్దం పెట్టుకుని, తరుచూ అద్దంలో ముఖం చూసుకునేది.

“ఈ వయసులో ఈమెకు ఈ సోకులేంటి!?” అని నవ్వుకునే వారు.

డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే “ఏదీ నీ నాలుక చాచమ్మా” అనేవారు.

“ఏదీ నీ కళ్ళు చూపించమ్మా" అని అడిగేవారు.

అవి ఆమెకు బాగా గుర్తు.

నిద్ర లేవగానే అద్దంలో ముఖం, నాలుక, కళ్ళు చూసుకునేది.

కళ్ళు, నాలుక ఎలా ఉన్నాయని మమ్మల్ని అడిగేది. బాగున్నాయంటే చాలు, ఆనందపడిపోయేది.

అద్దం ఎప్పుడూ మా అమ్మకు పక్కలోనే ఉండేది.

మా అమ్మకు పాటలంటే ప్రాణం.

చివరి వరకు పాటలు పాడుతూనే ఉంది.

చివరి రోజుల్లో ఆస్పత్రి బెడ్ పైన పడుకుని కూడా అయిదు పాటలు పాడింది.

వాటన్నిటినీ సెల్ఫోన్లో రికార్డు చేశాను.

మా అమ్మ ఎలా మాట్లాడేది? ఎలా పాడేది?

తన చుట్టూ ఉన్న మనుషులతో ఎలా వ్యవహరించేది?

నిన్న మొన్నటి వరకు కళ్ళముందు మెదలాడినవన్నీ నిదానంగా ఇప్పుడు జ్ఞాపకాల్లోకి జారుకున్నాయి.

ఆ జ్ఞాపకాలు మనసులో నిక్షిప్తమైపోయి నెలలు గడిచిపోతున్నా, అడుగడుగునా అవి పలకరిస్తూనే ఉన్నాయి,

పలవరిస్తూ నే ఉన్నాయి

పరిమళిస్తూనే ఉన్నాయి, కలవరపెడుతూనే ఉన్నాయి.

మా అమ్మ పుట్టినప్పుడు నిర్మలాదేవి అని పేరు పెట్టారు.

ఏ కారణం చేతనో, ఆ పేరు కాస్తా విమలాదేవిగా మారిపోయింది.

ఏడుగురు పిల్లల్ని కని, పెంచి పెద్ద చేసింది.

ఇద్దరు తమ్ముళ్ళను, ఒక చెల్లెలినే కాదు, మరిదిని, మా పెదనాన్నకొడుకుని కూడా తీసుకొచ్చి చదివించింది.

అందరికీ వండి పెట్టింది.

మనవల్ని పెంచింది.

హైదరాబాదులో ఉండే మా అక్క చిన్న కూతురు ఉషా ‘అమ్ముమ్మ దగ్గరే ఉంటా’ అంటూ కట్టుబట్టలతో మా తమ్ముడితో పడి తిరుపతి వచ్చేసింది.

వాళ్ళ అమ్మ, నాన్న ఎంత ఏడ్చారో!

మూడేళ్ళు అమ్మమ్మ దగ్గరే ఉండి చదువుకుంది.

పదవరగతిలోకి వచ్చేసరికి వాళ్ళఅమ్మనాన్న బలవంతంగా తీసుకెళ్ళిపోయారు.

ఇంటికి ఎవరు వచ్చినా తినడానికి ఏముంటే అది పెట్టేది.

‘కనీసం కాఫీ ఇవ్వండిరా.’ అనేది.

పిల్లలంటే ఎంత ప్రేమో.

“మన ఇంటికి వచ్చిన పిల్లలకి ఏమీ పెట్టకుండా ఎలా పంపుతాం!" అనేది.

మా అమ్మ జీవితం కష్టసుఖాల కలబోత.

తొంభై ఒక్క సంవత్సరాల ఆ జీవితం చీకటి వెలుగుల దోబూచులాట.

ఒక్క అయిదేళ్ళే నేను మా అమ్మకు దూరంగా ఉన్నది.

మిగతా కాలమంతా ఆమె చేతి వంటే తిన్నాను.

చివరి శ్వాస విడిచే వరకు మా అమ్మనా దగ్గరే ఉన్నది.

కాదు కాదు, నేనే మా అమ్మ దగ్గర ఉన్నాను.

ఎనభై ఒక్క సంవత్సరాలు నిండే వరకు వంట చేస్తూనే ఉంది. నేను ఆఫీసు కెళుతుంటే తానే స్వయంగా క్యారేజి పెట్టిచ్చేది.

ఎవరినీ పెట్టనిచ్చేది కాదు.

తన బాల్యం నుంచి ఉన్న జ్ఞాపకాలను అప్పుడప్పుడూ నాతో పంచుకునేది.

అవ్వన్నీ ఆమె మాటల్లోనే రాస్తే ఎంత బాగుణ్ణనుకునే వాణ్ణి.

ఆమె బతికుండగానే రాస్తే విని సంతోషించేది.

ఆ పని చేయలేకపోయాను.

అసలీ జ్ఞాపకాలు ఎందుకు రాయాలి!?

మా అమ్మ తెలుగింటి సగటు ఇల్లాలు.

మధ్యతరగతి తెలుగింటి సగటు అమ్మ.

మా అమ్మ జ్ఞాపకాలంటే, తెలుగింటి సగటు తల్లుల జ్ఞాపకాలే.

మా అమ్మగురించిన నా జ్ఞాపకాలతో ఆమె చెప్పిన జ్ఞాపకాలను కలబోసి ఇలా మొదలు పెడుతున్నాను.

ఇవ్వైనా ఎప్పుడో మొదలు పెట్టి ఉండాలి.

మా అమ్మ మరణం నాకు పెను విషాదం.

అలాంటి విషాదం గతంలో ఎప్పుడూ లేదు.

అంతకు మించిన విషాదం భవిష్యత్తులో ఉండదు.

ఇన్ని నెలలూ మొదలు పెట్టలేకపోయానని బాధగానూ ఉంది.

వెలుగులో ఉన్నంత కాలం చీకటి గుర్తుకే రాదు.

చీకటిని ఊహించలేం కూడా.

చీకట్లోకొచ్చాక వెలుగే గుర్తుకొస్తుంది.

ఎంత వెలుగును పొందామో గుర్తుకొచ్చి సంతోషమూ కలుగుతుంది, బాధకలుగుతుంది.

అమ్మ జ్ఞాపకాలు అంతులేని ఆనందాలు.

ఆ జ్ఞాపకాల్లోనే తప్పని కొన్ని విషాదాలు.

అమ్మ వెంటాడే జ్ఞాపకం.

ఒక మరిచిపోలేని మందహాసం.

(ఇంకా ఉంది)


(రాఘవ శర్మ,  జర్నలిస్టు,  రచయిత, సాహితీ సౌ గంధం ( ఉమ్మడి చిత్తూరు జిల్లా సాహితీ వేత్తల గురించి)  ఓ కొత్త బంగారు లోకం ( చైనా పర్యటన అనుభవాలు) తిరుమల దృశ్య కావ్యం ( శేషాచలం కొండల లో ట్రెక్ అనుభవాలు) అచ్చయ్యాయి. త్వరలో  ‘వనపర్తి ఒడి లో’ విడుదల కానుంది.)

Tags:    

Similar News