కార్పొరేట్ల కోసమే అటవీ పరిరక్షణ చట్టానికి సవరణలు చేశారు: జైరాం రమేష్

అటవీ సంరక్షణ చట్టానికి మోదీ ప్రభుత్వం సవరణ చేసి పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్ అన్నారు.

Update: 2024-03-30 11:36 GMT

అటవీ పరిరక్షణ చట్టానికి కేంద్రం ప్రభుత్వం సవరణలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జైరాం రమేష్ తప్పుబట్టారు. పర్యావరణ సమస్యలపై నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ శనివారం జాబితా విడుదల చేసింది. తాము అధికారంలోకి రాగానే ప్రస్తుత ప్రభుత్వ హానికర విధానాలను రద్దు చేస్తామని చెప్పుకొచ్చారు.

గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి, దానిపై ఆధారపడిన వారికి వినాశనకారిగా తయారయ్యిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జైరాం రమేష్ ఆరోపించారు.

'వాతావరణం మారడం లేదు, మనం మారుతున్నాం' అని గొప్పగా చెప్పిన ప్రధాని, భారతదేశంలో పర్యావరణాన్నిఒక క్రమపద్ధతిలో నాశనం చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులకు అటవీ భూములపై అధికారాన్ని లేకుండా చేసి వాటిని తన కార్పొరేట్ మిత్రులకు అప్పగిస్తున్నారని ధ్వజమెత్తారు. పర్యావరణ పరిరక్షణలో మోదీ ప్రభుత్వ 10 "వైఫల్యాలను" రమేష్ బయటపెట్టారు.

"అటవీ (సంరక్షణ) సవరణ చట్టం, ఆదివాసీ వ్యతిరేక అటవీ సంరక్షణ నిబంధనలు, జీవ వైవిధ్యం (సవరణ), పర్యావరణ పరిరక్షణ చట్టానికి రహస్య సవరణలు, అటవీ అనుమతుల ఉల్లంఘన ,ప్రాజెక్టుల చట్టబద్ధత, పర్యావరణ ప్రభావ అంచనాను బలహీనపరచడం. స్వతంత్ర పర్యావరణ సంస్థల విధ్వంసం, పెరుగుతున్న వాయుకాలుష్యం, వన్యప్రాణుల రక్షణ చట్టం నిర్వీర్యం, కార్పొరేట్లకు బొగ్గు గనులను అప్పగించడం".. ఇవన్నీ మోదీ వైఫల్యాలేనని ఆరోపించారు.

చట్టానికి సవరణలు చేసి..

అడవుల ఆక్రమణలను అడ్డుకోడానికి 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం కీలకమైనదని రమేష్ చెప్పారు. అయితే దానికి 2023లో మోడీ ప్రభుత్వం సవరణ చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఈ సవరణ 1996 TN గోదావర్మన్ సుప్రీం కోర్ట్ ఆదేశాన్ని ఉల్లంఘిస్తోందని ఫలితంగా దాదాపు 2 లక్షల చదరపు కి.మీ. లేదా 25% అటవీ విస్తీర్ణానికి రక్షణ లేకుండా పోతుందన్నారు. అటవీ పరిరక్షణ చట్టానికి మోదీ ప్రభుత్వం చేసిన సవరణ కారణంగా ఆదివాసీలు, అటవీ-నివాస వర్గాల అటవీ హక్కులకు భంగం కలిగించిందని పేర్కొన్నారు. ఆదివాసీల అటవీ భూములు, వనరులను కార్పొరేట్లు స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ 'పాంచ్ న్యాయ్ పచీస్ గ్యారెంటీ'లో భాగంగా నిర్ణీత గడువులోగా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న అన్ని క్లెయిమ్‌లు ఒక సంవత్సరంలో పరిష్కరిస్తామన్నారు. తిరస్కరణకు గురయిన క్లెయిమ్‌లు ఆరు నెలల్లోపు తిరిగి పరిశీలిస్తామన్నారు.

బయోలాజికల్ డైవర్సిటీ (సవరణ) చట్టాన్ని నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.

కమ్యూనిటీలతో ప్రయోజనాలను పంచుకోకుండా ప్రైవేట్ కంపెనీలు బయోడైవర్సిటీ ఉత్పత్తులను పొందడాన్ని మోడీ ప్రభుత్వం సులభతరం చేసిందని రమేష్ ఆరోపించారు. గతంలో బీజేపీకి మద్దతు తెలిపిన ప్రముఖ వ్యాపారవేత్త, యోగా గురువు ప్రోద్బలంతో ఇది జరిగిందని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం కోవిడ్ మహమ్మారితో అల్లాడుతున్నపుడు, మోడీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టం కింద నిబంధనలకు 39 సవరణలను చేసిందని జైరాం రమేష్ ఆరోపించారు.

పర్యావరణ ప్రభావాలను అంచనా వేసే నియమాలు 2020 నుండి బలహీనపడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు. 2023లో ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది మైనర్లు చిక్కుకుపోయారని, భద్రతా నిబంధనలను సరిగ్గా పాటించనప్పుడు ఏమి జరుగుతుందో ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. 2014 నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) బలహీనపడిందని రమేష్ తెలిపారు.

“సంవత్సరాలుగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2018 నాటికి 70 శాతానికి చేరుకుని చెన్నై NGT బెంచ్ మూసివేతకు గురైందని చెప్పారు.

కేవలం ఎన్జీటీనే కాదు. సుప్రీంకోర్టులోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కూడా ఇప్పుడు మోదీ ప్రభుత్వం మింగేసింది’’ అని రమేష్ ఆరోపించారు.

మోదీ ప్రభుత్వ హయాంలో వాయు కాలుష్యం తీవ్ర ప్రజారోగ్య సంక్షోభంగా మారిందని దన్నారు. ఢిల్లీ ఏటా గ్యాస్‌ ఛాంబర్‌గా మారడం వెనుక కేంద్రం వైఫల్యమే కారణమన్నారు.

2022 డిసెంబర్‌లో వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేసి, కార్పోరేట్ లాబీయింగ్‌తో బొగ్గు గనులు ఇచ్చారని ఆరోపించారు.

మోడీ నాయకత్వంలో అదానీ గ్రూప్ సున్నిత ప్రాంతాల్లో బొగ్గు బ్లాకులను అప్పగించడం వల్ల లాభపడుతోంది, ఇది పెద్ద పర్యావరణ నేరంగా పరిగణించబడుతుంది. "ఇది ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న మోదానీ కుంభకోణంలో కొత్త భాగం’’ అని అన్నారు రమేష్.

అటవీ సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ, ఆదివాసీల అటవీ హక్కులు, ఎన్‌జీటీ..అన్నీ మోదీ ‘అన్యాయ్‌కాల్‌’కు గురయ్యాయని రమేష్ అన్నారు.

ప్రధాని తన తప్పుడు నిర్ణయాలు, నిజాయితీ లేని కారణంగా గత దశాబ్ద కాలంగా భారతదేశం, విదేశాలలో పర్యావరణ సమస్యలకు కారణమయ్యారని కాంగ్రెస్ నాయకుడు విమర్శించారు. "జూన్ 2024లో భారత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, పర్యావరణానికి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రమేష్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News