కర్నాటక, ఒడిషాలో బీజేపీదే హవా? ఫెడరల్ సర్వేలో ఏం తేలింది?
లోక్ సభ ఎన్నికల ముందు ఫెడరల్- పుతియతలైమురై దేశవ్యాప్తంగా ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. అందులో భాగంగా కర్నాటక, ఒడిషా కు సంబంధించిన అంచనాలు ప్రచురించింది.
ఫెడరల్-పుతియతలైమురై-ఆప్ట్ 2024 ప్రీ-పోల్ సర్వే తాజా అంచనాలను విడుదల చేసింది. ఈ రౌండ్ లో దక్షిణాది రాష్ట్రమైన కర్నాటక, తూర్పు రాష్ట్రమైన ఒడిషాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, బిజూ జనతాదళ్ కు తీవ్ర నిరాశ తప్పదని సర్వే తేల్చింది.దక్షిణాదిలో పెద్ద రాష్ట్రమైన కర్నాటకలో కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
అయినప్పటికీ కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో తీవ్ర భంగపాటు తప్పదని సర్వే తేల్చింది. ఇక్కడ ఉన్న మొత్తం 28 స్థానాలకు గాను, బీజేపీ 26 గెలుస్తుందని, కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అలాగే ఒడిషాలో కూడా మొత్తం 21 స్థానాలకు 20 సీట్లు కాషాయదళం గెలుచుకుంటుందని, కేవలం ఒక్క స్థానం మాత్రమే బిజూ జనతాదళ్ వశమవుతుందని వివరించింది.
అసెంబ్లీ మ్యాజిక్ పునరావృతం కాలేదు..
కర్నాటక అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతంలో తేడాలు ఉన్నాయని ఫెడరల్ గుర్తించింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 2019 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అంచనా వేసింది. గతంలో 25 ఎంపీ సీట్లను గెలిచిన కమలం పార్టీ.. ఈసారీ 26 సీట్లను తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 51.67 ఓట్ల శాతాన్ని గెలుచుకోగా, తాజాగా అది ఏకంగా 57.27కి పెరుగుతుందని సర్వే ఫలితాల్లో తేలింది. నిజానికి 2009 తరువాత జరిగిన అన్ని లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కన్నడ నాట తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వస్తోంది.
మొన్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ 32.11 ఓట్ల శాతంతో 135 సీట్లను గెలుచుకుంది. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తన ఓటింగ్ శాతం 28.45 శాతానికి పడిపోతుందని అంచనావేసింది. ఆ పార్టీకి కేవలం 1 నుంచి 2 స్థానాలు దక్కవచ్చని తేల్చింది. కర్నాటక ప్రజలలో 68 శాతం ప్రజలు మోదీ ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారని, రాహూల్ గాంధీకి 35 శాతం మద్ధతు ఉందని సర్వే వివరించింది.
ఎంపీ ఎన్నికల్లో జనతాదళ్(ఎస్) పూర్తిగా నష్టపోతుందని, ఆ పార్టీకి ఓట్ల శాతం 9.74 శాతం నుంచి ఒక శాతానికి పడిపోతుందని, ఒక్క సీటు కూడా గెలుచుకోదని తేల్చిచెప్పింది.
ఒడిశాలో పరిస్థితి ఏంటీ?
ఒడిషాలో బీజేపీ గెలిచినా, బీజేడీ గెలిచిన మొత్తం సీట్లు బీజేపీ వే. ఎందుకంటే నవీన్ పట్నాయక్ కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. అలాగే ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభ సీటు గెలుచుకోవడంలో బీజేడీ.. బీజేపీకి సహకరించింది. అందువల్ల పోటీ ఎలా ఉన్నా.. ఒడిషా మొత్తం కమలదళం చేతిలో ఉన్నట్లే.
అయితే బీజేపీ, బీజేడీ రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా పోటీపడుతున్నారు. దీనిలో ఎటువంటి సందేహం అక్కరలేదు. ఫెడరల్ సర్వే ప్రకారం బీజేపీ మొత్తం 21 స్థానాలకు గాను 20 స్థానాలను గెలుచుకుంటుంది. బీజేడీ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
ఓటు షేరు కూడా తగ్గినట్లు సర్వేలో తేలింది. రాష్ట్రంలో కమలదళం బలపడినట్లు సంకేతాలు తేలింది. బీజేపీ కనీసం 16 శాతం ఓట్లను పెంచుకుంటుంది. బీజేడీ 19.35 శాతం ఓట్లను పొందుతుంది. ఇంతకుముందు ఇది 42.80 ఉండేది. లోక్ సభ ఎన్నికల్లో ఇది ఏకంగా 23 శాతం ఓట్లను కోల్పోనుందని ఫెడరల్ సర్వేలో తేలింది.
కాంగ్రెస్ ఒడిషాలో ఈ రెండు పార్టీలకు చాలా దూరంలో నిలిచిపోయింది. దానికి కేవలం 10 శాతం ఓట్లు దక్కనున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఒక్క ఎంపీ సీట్ ను కూడా అది నిలబెట్టుకోలేదని సర్వే అంచనా వేసింది.