‘‘ఎప్పటికీ అలా చేయం.. చేయడానికి అనుమతించం’’

కేంద్ర హోం మంత్రి అమిత్ షా విపక్షాలకు టార్గెట్ చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

Update: 2024-04-28 14:24 GMT

‘‘ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్‌లను బిజెపి తొలగించదు. అలా చేయడానికి ఎవరినీ అనుమతించం’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎటా-కస్‌గంజ్‌లో బిజెపి అభ్యర్థి రాజ్‌వీర్ సింగ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. 'బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. అది అబద్ధం. రెండు పర్యాయాలు మేం పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నాం. కానీ ఎప్పుడూ అలా చేయలేదు. నరేంద్ర మోడీ రిజర్వేషన్లకు పూర్తి మద్దతునిచ్చే నాయకుడు’ అని చెప్పారు.

‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తొలగించబోం. అలా చేయడానికి ఎవరినీ అనుమతించం. ఇది మోదీ హామీ’’ అని షా భరోసా ఇచ్చారు.

మీ ముందు రెండు గ్రూపులున్నాయి. కరసేవకులపై కాల్పులు జరిపిన వారు కావాలో లేక రామ మందిరాన్ని నిర్మించిన వారు కావాలో? తేల్చుకోవాలని ఓటర్లను కోరారు.

"కాంగ్రెస్, రాహుల్ 'బాబా' అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) చాలా సంవత్సరాలుగా రామాలయ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. మోదీ రెండోసారి ప్రధాని కాగానే ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జనవరి 22న వైభవంగా ప్రారంభోత్సవం కూడా చేశారు.’’ అని గుర్తు చేశారు.

మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌పై బిజెపి అభ్యర్థి జైవీర్ సింగ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. ఠాకూర్ తరుపున ప్రచారానికి వెళ్లిన హోంమంత్రి మాట్లాడుతూ..“అఖిలేష్ (యాదవ్) జీ, డింపుల్ (యాదవ్) జీ, ఎవరికి భయపడి మీరు ప్రజలను రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లనివ్వలేదు? తమ ఓటు బ్యాంకు పోతుందనే భయంతోనే సమాజ్‌వాదీ పార్టీ నేతలు సైతం వేడుకలకు హాజరుకాలేదు’’ అని షా ఆరోపించారు.

తాము మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడే వాళ్లం కాదని, శ్రీరాముడు జన్మించిన చోట ఆలయాన్ని నిర్మించామని పేర్కొన్నారు.

2029 వరకు ఉచిత రేషన్ బియ్యం..

ఇప్పటికే పేదలకు ఉచిత రేషన్ పంపిణీ, ఇళ్లు మంజూరు చేస్తున్నామని..తిరిగి అధికారంలోకి వస్తే ఉచిత రేషన్ పథకాన్ని 2029 వరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత యాదవ్‌ ఎన్నికలలో తన కుటుంబ సభ్యులను మాత్రమే నిలబెట్టాడంపై షా మండిపడ్డారు.

సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలు వలస వెళ్లేవారని, బీజేపీ పాలనలో గూండాలు వలస వెళ్తున్నారని చెప్పారు. ఒకప్పుడు బాంబులు పేలిన ఉత్తరప్రదేశ్‌లో, నేడు మోదీ నాయకత్వంలో బాంబులు తయారు చేసి ఎగుమతి అవుతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని, మోదీ నాయకత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) 400 సీట్లు సాధిస్తామని షా ధీమా వ్యక్తం చేశారు.

విపక్ష కూటమి మెజారిటీ సాధిస్తే ప్రధాని ఎవరని ఇండియా కూటమి నాయకులను షా అడిగారు. మోదీ తప్ప ఎవరైనా దేశాన్ని సమర్థంగా నడపగలరా? అని సభనుద్దేశించి ప్రశ్నించారు.

ఎవరు కావాలో నిర్ణయించుకోండి..

ఇటావాలో రామ్ శంకర్ కతేరియాకు ప్రచారం చేస్తూ.. ‘‘ఒక వైపు అవినీతి కూటమి ఉంది. మరోవైపు ఎటువంటి ఆరోపణలు లేని నరేంద్ర మోడీ ఉన్నారు. ఎవరు కావాలో నిర్ణయించుకోండి’’

‘‘ఒకవైపు వేసవిలో థాయ్‌లాండ్‌లో విహారయాత్రలకు వెళ్లే రాహుల్ గాంధీ ఉన్నారు. మరోవైపు 23 ఏళ్లుగా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న నరేంద్ర మోదీ ఉన్నారు. ఎవరు కావాలో నిర్ణయించుకోండి’’ అని ఓటర్లను ప్రశ్నించారు.

ఎటా-కస్గంజ్, మెయిన్‌పురిలలో మే 7న మూడో దశ పోలింగ్ జరుగుతుంది. ఇటావాలో మే 13న నాల్గవ దశ పోలింగ్ జరుగుతుంది. 

Tags:    

Similar News