‘‘బీజేపీ ఎప్పటికీ అలా చెప్పదు.. చేయదు కూడా ’’

కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఏం మాట్లాడారు. మ్యానిపులేటెడ్ వీడియోలో ఏముంది? ఇప్పుడు షా ఎవరిని నిందిస్తున్నారు?

Update: 2024-04-30 07:52 GMT

కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.

షా డీప్‌ఫేక్ వీడియో ఒకటి ఇటీవల వైరలైంది. రిజర్వేషన్లను తొలగిస్తామని షా చెప్పినట్లుగా సృష్టించిన ఈ వీడియోను అసోంలోని గౌహతికి చెందిన రీతం సింగ్ అనే కాంగ్రెస్ కార్యకర్త తయారుచేసి, షేర్ చేయడంతో ఆయనను అరెస్టు చేశారు.

ఏ పార్టీ అలా చేయకూడదు..

‘‘వారి (కాంగ్రెస్) నిరాశ తారాస్థాయికి చేరింది. వారు నాతో పాటు మరికొంత మంది బీజేపీ నేతలకు సంబంధించిన ఫేక్ వీడియోలను ప్రచారం చేశారు. ముఖ్యమంత్రులు, రాష్ట్ర అధ్యక్షుడు ఇతరులు కూడా ఈ నకిలీ వీడియోను ఫార్వార్డ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు నేరారోపణ ఎదుర్కొంటున్నాడు. రాహుల్ గాంధీ రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. నకిలీ వీడియోలను సర్క్యులేట్ చేసి ప్రజల మద్దతు కూడగట్టాలనుకోవడం ఖండించదగినది. భారత రాజకీయాల్లో ఏ ప్రధాన పార్టీ అలా చేయకూడదు. ” అని షా గౌహతిలో విలేకరుల సమావేశంలో అన్నారు.

400 సీట్లే లక్ష్యంగా..

ప్రజల ఆశీస్సులు, మద్దతుతో 400కు పైగా లోక్‌సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ దూసుకుపోతోందని షా చెప్పారు.“కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను తొలగిస్తుందని కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. మేము ఓటర్లను మైనారిటీ లేదా మెజారిటీగా చూడం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లపై బీజేపీకి నమ్మకం లేదు’’ అని షా పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయబోతున్నాం అని చెబుతూనే అస్సాంలోని మొత్తం 14 స్థానాల్లో 12 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వాస్తవ వీడియో vs మానిప్యులేటెడ్ వీడియో

అసలు వీడియోలో తెలంగాణలో మత ప్రాతిపదికన ముస్లింలకు మాత్రమే కోటాను తొలగించడం గురించి తాను మాట్లాడుతున్నానని షా వివరణ ఇచ్చుకున్నారు.తర్వాత వాస్తవ వీడియో, మార్ఫింగ్ వీడియో ప్లే చేసి చూయించారు.

“మత ప్రాతిపదికన కోటా ఇవ్వడం అన్యాయం. అనుమతించం. దాన్ని కర్ణాటకలో ఇప్పటికే తొలగించాం. ఇదే నేను వీడియోలో చెప్పానని విలేకరులతో అన్నారు.

Tags:    

Similar News