చిట్టచివరి బుర్రవీణ మాంత్రికుడు దాసరి కొండప్పకి పద్మశ్రీ
మరుగునపడుతోన్న సంగీత వాయిద్యాలలో బుర్రవీణ ఒకటి. మూడు తరాలు వాయించిన ఈ బుర్రవీణ ఇక మూగబోతుంది.
పద్మ పురస్కారాలను భారత ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు (జనవరి 25న) ప్రకటిస్తుంది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ సారి మొత్తం 132 మందిని పద్మ అవార్డులను కేంద్రం ఎంపిక చేసింది. 5 పద్మవిభూషన్ , 17 పద్మభూషణ్ , 110 పద్మశ్రీ పురస్కారాలను అందజేయనున్నారు. భారతరత్న తర్వాత రెండో అత్యున్నత పౌర పురస్కారం - పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్న ఐదుగురిలో ఇద్దరు తెలుగువారే. ఒకరు చిరంజీవి కాగా.. మరొకరు మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు.
ముగ్గురు తెలుగు వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన బుర్ర వీణ వాయిద్య కారుడు దాసరి కొండప్ప, (Dasari Kondappa ) యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య (Gaddam Sammaiah), ఆంధ్ర ప్రదేశ్ నుంచి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిని( Uma Maheshwari ) పద్మశ్రీ అవార్డు వరించింది. రాష్ర్టపతి ద్రౌపది ముర్ము గణతంత్ర్య దినోత్సవం (జనవరి 26న) రోజున ఈ అవార్డులను అందజేయనున్నారు.
బుర్రవీణకు ప్రాణం పోసిన కొండప్ప..
బుర్ర వీణ-తెలంగాణకు చెందిన సంగీత వాయిద్యం. తంతి వాయిద్యాల సమ్మేళనం. నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్ప దీన్ని చక్కగా వాయించగలరు. తత్విక బోధనలు, జానపదాలు పాడుతూ కనుమరుగవుతున్న బుర్రవీణకు ప్రాణం పోస్తున్నారు. బుర్ర వీణపై 24 రకాల శబ్దాలను వినిపించగల నైపుణ్యం వంశపారంపర్యంగా వచ్చిందంటారు కొండప్ప.
మూడు తరాల నుంచి..
‘‘చిన్నప్పుడు నాన్న దగ్గర బుర్రవీణ వాయించడం నేర్చుకున్నా. అన్న దగ్గర పాటలు పాడడం నేర్చుకున్నా. బుర్రవీణ వాయించడం మా కులవత్తి. జీవనాధారం. మూడు తరాల నుంచి బుర్రవీణ వాయిస్తున్నాం. మా పిల్లలు దీన్ని నేర్పుకోడానికి ఆస్తకి చూపడం లేదు. ఇక నాతోనే ఈ కళ అంతరించిపోయేలా ఉంది.’’ అని దాసరి కొండప్ప అన్నారు.
కొండప్ప తన వాయిద్యాన్ని సొంతంగా తయారు చేసుకుంటాడు. ఒక సందర్భంలో బుర్రవీణ తయారీ గురించి చెప్పారు. "మంచి పొట్లకాయను తీసుకుని ఎండబెడతా. దానిలోపల గింజలను తీసివేసి కర్రను అమరుస్తా. పొట్లకాయ మీదుగా మూడు తీగలను కర్ర ఒకవైపు నుంచి మరోవైపునకు లాగి బిగిస్తా. దీన్ని తయారీకి ఏడాది పడుతుంది’’ అని చెప్పాడు.
యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య..
తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి కు చెందిన సమ్మయ్య ఆరో తరగతి వరకు చదువుకున్నారు. 16 ఏళ్ళ వయసులో తన తండ్రి చిందుల రామస్వామి ప్రోత్సాహంతో చిన్ని కృష్ణుడి వేషధారణతో కళారంగంలోకి అడుగుపెట్టాడు. 1985లో జనగామ పురపాలక సంఘం కార్యాలయంలో కీచకవధ ప్రదర్శనలో కీచకుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత 1988లో నెహ్రూ యువకేంద్రం ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించి, అనేక ప్రదర్శనల్లో లోహితాన్యుడు, సిరియాళుడు, బాలవద్ధి, సత్య హరిశ్చంద్రుడు, కీచకుడు, కంసుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రలు పోషించాడు.
యువజన సాంస్కృతిక పర్యాటల శాఖల ఆధ్వర్యంలో దాదాపు నాలుగువేల ప్రదర్శనలు ఇచ్చాడు. 1991లో కళాకారుల సంఘం ప్రారంభించారు. ప్రభుత్వం తరపున అనేక సామాజిక కార్యక్రమాలు, అవగాహన అంశాలపై వేల ప్రదర్శనలు ఇచ్చారు సమ్మయ్య.
మారుతున్న కాలానికి అనుగుణంగా తనదైన శైలీలో ప్రదర్శనలిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో కళారత్న అవార్డును అందుకున్న సమ్మయ్య జీవిత విశేషాలతో గడ్డం మోహన్‌రావు 2013లో ‘చిందుల హంస’ అనే పుస్తకాన్ని రాశారు.
‘సంస్కృతం’లో హరికథ చెప్పగలిగే ఏకైక మహిళ ఉమా మహేశ్వరి..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథ కళాకారిణి డి ఉమా మహేశ్వరి 14వ ఏటనే హరికథ కోసం జీవితాన్ని అంకితం చేశారు. ఉజ్జయినిలో సంస్కృత పండితుల ఎదుట ‘అభిజ్ఞాన శాకుంతలం’ ప్రదర్శించి సంస్కృతంలో హరికథ చెప్పే ఏకైక మహిళా భాగవతారిణిగా గుర్తింపు పొందారు.
అనంతరం కుమార సంభవం, రఘువంశం, ఆది శంకరాచార్య, గీత గోవిందం, భక్త జయదేవ వంటి వాటిని హరికథలను ప్రదర్శించి జనం మెప్పు పొందారు. విదేశాల్లోనూ అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన ఉమా మహేశ్వరి 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్‌లో సంస్కృతంలో హరికథ చెప్పి ప్రశంసలు పొందారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఉమా మహేశ్వరి తండ్రి లాలాజీ రావు. నాదస్వర విద్వాంసుడు.
సీఎం రేవంత్ రెడ్డి హర్షం..
పద్మ అవార్డుకు ఎంపికయిన తెలుగు వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి ఎంపికయిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప ఏపీ నుంచి ఎంపికయిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావ్ ..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్, కూరేళ్ల విఠలాచార్య పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో అందించిన విశిష్ట సేవలకు తగిన గుర్తింపు లభించిందని, అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.