నానీ, ఇక చాలు.. అన్నదమ్ముల సవాల్!
రక్తకన్నీరు నాటకంలో అలనాటి నటుడు నాగభూషణం ఓ మాట చెబుతారు.. పదవి ముందు రక్త సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలెంత? అంటారు. ఈ అన్నదమ్ముల సవాల్ అలాగే ఉందంటున్నారు..
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా తయారయ్యాయి. సీట్ల కోసం సవాళ్లు విసురుకున్న అన్నదమ్ములు ఇప్పుడు వీధిన పడ్డారు. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబే ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అన్నదమ్ముల సవాళ్లకు పుల్‌స్టాప్ పెట్టాల్సివచ్చింది. ఎవరే నియోజకవర్గంలో పని చేయాలో క్లారిటీ ఇచ్చారు.
కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం..
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈనెల 7న తలపెట్టిన చంద్రబాబు సభకు సంబంధించి కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మొదలైంది. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన నాయకులుండగానే.. ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్ మీరాతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి వచ్చినపుడు ఈ గొడవ జరిగింది. పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. అలా మొదలైన వివాదం పరస్పరం సవాళ్లదాకా వెళ్లింది. ఇందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి వచ్చారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించింది. ఇలోగా పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడ్డారు. గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో పార్టీ కార్యాలయం మార్మోగింది.
చంద్రబాబు ఎలా పుల్‌స్టాప్ పెట్టారంటే...
ఆలా మొదలైన వివాదానికి అధిష్టానం ఫుల్‌స్టాప్ పెట్టింది. నానికి చంద్రబాబు గట్టి షాకిచ్చాడు. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్ నియమించింది. నానిని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. తిరువూరు సభ బాధ్యతలను కేశినేని నానికి కాకుండా కేశినేని చిన్నీకి అప్పగించింది. దీంతో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిపై టీడీపీ క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై కేశినేని నాని తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఆదేశాల మేరకు తిరువూరు సభకు వేరే వారిని ఇంచార్జ్‌గా నియమించినట్లు చెప్పారన్నారు కేశినేని నాని. సభ విషయంలో తనను కలగ చేసుకోవద్దని చెప్పారంటూ ట్వీట్ చేశారు.
అధిష్టానం చెప్పింది చేస్తా...
కేశినేని నాని ట్వీట్‌పై కేశినేని చిన్ని స్పందించారు. అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించిన చేస్తానన్నారు. అయితే విజయవాడ ఎంపీ సీటు ఇస్తారనే విషయం తన వరకు రాలేదన్నారు. టీడీపీలో ఒక కార్యకర్తగానే కొనసాగుతానని.. కేశినేని నానితో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చిన్ని అన్నారు.