రూ. 70 వేల కోట్లతో వాటి నిర్మాణానికి ఆమోదముద్ర వేయనున్న డీఏసీ

విమాన వాహక నౌక( ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్) ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం ఫ్రెంచి తయారీ రాఫెల్ మెరైన్ రకం యుద్ధ విమానాల కొనుగోలుకు ఈ రోజు జరగబోయే డీఏసీ సమావేశం ఆమోదముద్ర

Update: 2024-09-03 06:47 GMT

సైన్యానికి అవసరమైన కీలకమైన ఆయుధాల కొనుగోళ్లను పర్యవేక్షించే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) మంగళవారం సమావేశం కాబోతోంది. ఇందులో ప్రధానంగా విమాన వాహాక నౌక( ఎయిర్ క్రాప్ట్ క్యారియన్) ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం 26 రాఫెల్ మెరైన్ రకం విమానాలను కొనుగోలు చేయాలని, అందుకు అవసరమైన తుది అనుమతులు జారీ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తుది సవరణను ఆమోదించిన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కౌన్సిల్, వ్యయ చర్చల కమిటీని సమావేశపరుస్తుంది.

నౌకాదళానికి రాఫెల్-ఎం యుద్ధవిమానాలను వీలైనంత త్వరగా మోహరించాల్సిన అవసరం ఉంది. అయితే డీఆర్డీఓ తయారు చేసిన AESA రాడార్‌లను రాఫెల్ మెరైన్ రకం వాటికి బిగించాల్సిన విషయంలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో దీనిపై డీఏసీలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ రాడార్‌లను ఏకీకృతం చేయడానికి అయ్యే ఖర్చు తో ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది.
మరో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో మిగ్-29కె యుద్ధవిమానాలు ఎక్కువ సంఖ్యలో లేవని, వాటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నందున తమకు తక్షణమే రాఫెల్-ఎమ్ ఫైటర్లు అవసరమని నౌకాదళం ప్రభుత్వాన్ని కోరింది. భారత నావికా దళం ఇంతకుముందే వివిధ దేశాలకు చెందిన యుద్ధ విమానాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద పరీక్షించి, రాఫెల్ మెరైన్ రకం తమ అవసరాలకు సరిపోతుందని ప్రభుత్వానికి నివేదించాయి.
ఇదే సమావేశంలో భారత నావికా దళానికి అవసరమైన ఏడు స్టెల్త్ ఫ్రిగేట్ ల నిర్మాణానికి కూడా ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ 17బీ కింద వీటిని నిర్మించడానికి ఒప్పందాలు జరుగుతున్నాయి. వీటికి దాదాపు రూ. 70 వేల కోట్లు కేటాయించనున్నారు. ఇవి దాదాపు 8 వేల టన్నులు బరువుతో మెరుగైన స్ట్రైక్ సామర్థ్యం కలిగి ఉంటాయి.
భారత నావికాదళ సామర్థ్యాలను మెరుగుపరచాలి
రాఫెల్-ఎమ్ యుద్ధ విమానాలతో పాటు, US తయారీదారు జనరల్ అటామిక్స్ నుంచి 41 MQ 9B ప్రిడేటర్ సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేయనుంది. మరో మూడు కల్వరి-క్లాస్ జలాంతర్గాములు నిర్మాణం జరుపుకోబోతున్నాయి. స్వదేశీ నిర్మాణాలతో భారత నావికాదళం రాబోయే కొద్ది నెలల్లో బలోపేతం అవుతుంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇవి అన్నింటికి ఆమోదం లభిస్తాయనే అంచనాలు ఉన్నాయి.
హిందూ మహా సముద్రం, ఫసిఫిక్ లో చైనా దుందుడుకుగా వ్యవహరించడం, జపాన్, ఫిలిప్పిన్స్ లపై పీఎల్ఏ దౌర్జన్యానికి దిగడంతో న్యూఢిల్లీ కూడా అప్రమత్తమైంది. భారత్ చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక పాకిస్తాన్, జిబౌటీ, కంబోడియా లాంటి దేశాలలో చైనా తన నావికా స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. తరుచూ హిందూ మహాసముద్రాల్లో చైనా సబ్ మెరైన్ లు , పరిశోధన నౌకలు రావడంతో భారత్ కూడా తప్పనిసరిగా తన బలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి.
ప్రస్తుతం భారత్ వద్ద కేవలం 18 సబ్ మెరైన్లు మాత్రమే ఉన్నాయి. ఈ మధ్య మరో 24 సబ్ మెరైన్లు నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఇవి కూడా నావికాదళానికి హాజరైతే పీ5 దేశాల తరువాత అత్యధిక సబ్ మెరెన్లు కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇందులో మరో రెండు అణు శక్తితో నడిచే సబ్ మెరైన్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత్ వద్ద ఐఎన్ఎస్ అరిహాంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ అణు శక్తితో నడిచే సబ్ మెరైన్లు ఉన్నాయి.
భారతదేశానికి రక్షణ కోసం అవసరమైన ఏదైనా సైనిక సామగ్రిని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా హామీ ఇచ్చింది. యుద్ధ విమానాలు, దీర్ఘ-శ్రేణి క్షిపణి వ్యవస్థలు మరియు నీటి అడుగున డ్రోన్‌ల తయారీకి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రెంచ్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
ఫ్రెంచ్ నుంచి ఇప్పటికే భారత వైమానిక దళం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఇంతకుముందు మన వాయుసేన దగ్గర ఇదే ఫ్రెంచి తయారీ మిరాజ్ 2000, జాగ్వార్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. మిరాజ్ లను మన వైమానిక దళంలో ‘వజ్ర‘ అన్న పేరుతో పిలుస్తాం. ఇవి బాలాకోట్ పై వైమానిక దాడి జరిగిన సందర్భంగా తమ శక్తిని ప్రదర్శించాయి.


Tags:    

Similar News