DIAMOND CRISIS | మసకబారుతున్న గుజరాత్ ‘వజ్రం’
ఏడాది కాలంలో 45 మంది కళాకారులు బలవన్మరణం, లక్షలాది మంది ఉద్యోగులు కోల్పోయే ప్రమాదం. కారమేమిటంటే...
By : The Federal
Update: 2024-12-11 06:45 GMT
మిలమిలా మెరిసే వజ్రాల వెనుక ఇంతటి విషాదం ఉందా? విలువైన రత్నాల వేటలో తిండి తిప్పలకు ఇబ్బంది పడుతూ ప్రాణాలు తీసుకుంటున్నారా? అంటే అవుననే ఆ పరిశ్రమలో పని చేస్తున్న వర్గాలు వాపోతున్నాయి. శాశ్వత సంపదను సృష్టించే రత్నాల పరిశ్రమలు ప్రస్తుతం గణనీయమైన సవాళ్లను (DIAMOND CRISIS) ఎదుర్కొంటున్నాయి. గుజరాత్ డైమండ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రకారం వజ్రాల పరిశ్రమ తీవ్ర మాంద్యంలో చిక్కుకుంది.
మాంద్యం ప్రభావం కారణంగా గత రెండేళ్లలో 2 వేలకు పైగా పరిశ్రమల్లో సగం మూత పడ్డాయి. లక్షలాది మంది కార్మికులు బజారున పడ్డారు. ఏడాది కాలంలో 45 మంది కళాకారులు తమ ప్రాణాలు తీసుకున్నారు. ఫలితంగా వజ్రాల వ్యాపారం బాగా కుంటుపడింది. పెరుగుతున్న నిరుద్యోగం, పూట గడవని పరిస్థితి దాపురించింది. రాజ్యసభలో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం గత మూడేళ్లుగా వజ్రాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. రష్యా తయారు చేసే వజ్రాలపై G-7 దేశాల ఆంక్షలు గుజరాత్ లోని వజ్రాల పరిశ్రమను కుదేలయ్యేలా చేశాయి. “గుజరాత్‌లోని సూరత్.. వజ్రాలకు కేంద్రం. సూరత్‌లో 40% ఫ్యాక్టరీలు దీపావళి తర్వాత మూతపడ్డాయి” అని గుజరాత్ డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ జిలారియా అన్నారు. "దీపావళి తర్వాత అహ్మదాబాద్ లో 30% పరిశ్రమలు మూతపడ్డాయి. రాజ్‌కోట్, అమ్రేలి, బొటాడ్ వంటి నగరాల్లోనూ 50, 60 శాతం పరిశ్రమలు మూసివేత పడ్డాయి' అని రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు అధికారులు ఇచ్చిన సమాధానం. "దీపావళి తర్వాత సుమారు 2,000 వజ్రాల పరిశ్రమలు మూతపడ్డట్టు అంచనా. మరి కొన్ని మూసివేత దిశలో ఉన్నాయి" అని రమేష్ అన్నారు.
వెలుగు తగ్గుతోంది...
రాజ్యసభ లెక్కల ప్రకారం ఎగుమతులు బాగా మందగించాయి. ఏటికేడాది ఎగుమతులు తగ్గుతున్నాయి. 2022 నుంచి 2024 వరకు సగటున 25.8% శాతం పరిశ్రమలు మూతపడ్డాయి. ఎగుమతులు సుమారు 15.8 శాతం తగ్గాయి. దేశీయ డిమాండ్ తగ్గింది. నగదు లావాదేవీలలో ఒడిదుడుకుల కారణంగా వ్యాపారం మందగించింది. మొత్తంగా వ్యాపారం బాగా తగ్గిపోయింది. రెండేళ్లలో 12.98 బిలియన్ డాలర్ల వ్యాపారం తగ్గింది. ఆర్థిక మందగమనంతో పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. వ్యాపారం తగ్గడంతో అంతర్జాతీయ వ్యాపారులు వేరే వ్యాపారాలకు మళ్లుతున్నారు. వ్యాపార సమతూకం దెబ్బతింది. ట్రేడ్ గ్యాప్ పెరిగింది. "కొన్ని యూనిట్లు పని చేస్తున్నా వజ్రాల కళాకారులలో 50% నుంచి 60% మంది మాత్రమే తిరిగి పనిలోకి వస్తున్నారు. వ్యాపారం తగ్గడంతో యాజమాన్యాలు కార్మికుల వేతనాలు 50 శాతం మేర తగ్గించాయి. సుమారు 200,000 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పేయే పరిస్థితి ఏర్పడినట్టు అంచనా వేస్తున్నాం" అన్నారు ఆయన. దీపావళి తర్వాత 2,000 కర్మాగారాలు ఇంతవరకు తెరుచుకోలేదు. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 45 మందికి పైగా వజ్రాల కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
వజ్రాల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి జిలారియా చెప్పిన మాటల్నే రాజ్యసభలో ప్రభుత్వం చేసిన ప్రకటన ధృవీకరిస్తోంది. 2024 డిసెంబర్ 6న వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఓ ప్రకటన చేస్తూ "వజ్రాల ఎగుమతి తగ్గింది. ఉక్రేయిన్ తో యుద్ధం కారణంగా రష్యాపై G-7 ఆంక్షల వల్ల వజ్రాల రంగం మూడేళ్లుగా సవాళ్లను ఎదుర్కొంటోంది" అని చెప్పారు.
2021-22లో 25.48 బిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఎగుమతులు ఉంటే 2023-24లో అవి 18.37 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు 28% తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. పర్యవసానంగా, మొత్తం వాణిజ్య పరిమాణం కూడా తగ్గింది. 2021-22లో 54.35 బిలియన్ డాలర్ల వ్యాపారం 2023-24లో 41.37 బిలియన్లకు తగ్గింది. దాదాపు 24% వ్యాపారం తగ్గింది.
2020లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) ప్రకారం వజ్రాల పరిశ్రమలో 8,19,926 మందికి ఉపాధి కల్పిస్తోంది. దాదాపు 18,036 కంపెనీలు ఉన్నాయి. "ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా గుజరాత్ వజ్రాల పరిశ్రమ బాగా దెబ్బతింది" అని గుజరాత్ డైమండ్ అసోసియేషన్ అధికారి భావేష్ తెలిపారు. దీన్ని బట్టి మెరిసేదంతా బంగారం కాదని, తళుకుబెళుకు రాళ్ల వెనుక విషాదం అలుముకుందని అర్థమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఈ పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమోనని ఎదురు చూస్తున్నారు వ్యాపారులు.