మత్తుగొలిపే గజల్స్ మిగిలించి పంకజ్ ఉదాస్ వెళ్లిపోయాడు...

ప్రముఖ గజల్ గాయకులు పంకజ్ ఉదాస్ ఈ రోజు మరణించారు.ఆయనని స్మరిస్తూ !

Update: 2024-02-26 14:03 GMT
ఫోటో ఫేస్ బుక్ నుంచి

గజల్ గంధర్వుడు పంకజ్ ఉదాస్ ఫిబ్రవరి 26న  చనిపోయాడు. గజల్ ప్రియులందరికి పూరించ లేని లోటు కలిగిస్తూ వెళ్లిపోయారు.   ఆయన వయసు 72. కొంత అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారు. ఈ ఉదయం పదకొండుగంటలకు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులు కిందట ఆయన క్యాన్సర్ జబ్బు వచ్చిందని తేలింది. అప్పటి నుంచి ఆయన ఎవరినీ కలవడం లేదు. రేపు అంత్యక్రియలు జరుగుతాయి.



అతని గొంతులో ప్రేయసిని తలపోసే వియోగ దుఃఖం..తాగుబోతు లెక్కలేని తనం,మనిషి చేసే నమ్మక ద్రోహపు దిగ్భ్రాంతి... నిస్సహాయత..దూరాన ఉన్న బంధువుల పలకరింపుల పలవరింతలు అద్భుతంగా పలుకుతాయి... అతనే పద్మశ్రీ పంకజ్ ఉదాస్.

ఆప్ జిన్ కె కరీబ్ హోతే హై..ఓ బడే కుష్ నసీబ్ హోతే హై,దీవారో సే మిల్కర్ రోనా అచ్చా లగ్తా హై,చిట్టీ ఆయీ హై,చాంద్ జైసా రంగ్ హై తే రా...తోడీ తోడీ పియా కరో..లాంటి అద్భుతమైన గజల్స్ ఆయన హృదయలోంచి పొంగి పొర్లాయి.ఆయన గజల్ గాయకుడే కాదు సినిమాలకి చాలా పాటలు పాడారు.. మంచి కవి కూడా.గజల్ ప్రేమికులను తన గాత్ర మాధుర్యం లో ముంచెత్తారు.
ఆయన గాత్రం ఎడారి దాహంలో గొంతెండి పోయే బాటసారికి ..మధువో..చల్లని నీరో గొంతులో పోసినట్లు ఉంటుంది.భారతీయ పాప్ సంగీతంలో..తన రచనలకు పంకజ్ మంచి పేరు తెచ్చుకున్నారు. 1951-మే17 న గుజరాత్ లో జన్మించారు పంకజ్ ఉదాస్.1980 లో ఆహాత్ అనే తన గజల్ ఆల్బమ్ తో తన కెరీర్ ను ప్రారంభించారు.తరువాత ముకరర్, తరన్నం, మెహఫిల్,పంకజ్ ఉదాస్ లైవ్ ఎట్ రాయల్ ఆల్బర్ట్ హాల్,నయాబ్ వంటి అనేకమైన ఆల్బమ్ లను తీసుకు వచ్చారు.
2006 లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డు ను ఇచ్చి సత్కరించింది.ఆయన ఈ రోజు మన మధ్య లేకపోయినా..ఆయన పాటలు, గజల్స్ అభిమానులు ఎప్పటికీ మరవలేరు.ఆయనకి 'ఫెడరల్ తెలంగాణ' వినమ్రంగా నివాళి అందిస్తున్నది .
ఈ సందర్భంగా ' గీతాంజలి' అనువదించిన పంకజ్ ఉదాస్ గజల్ ఒకటి...


ఈ గోడలతో కలిసి దుఃఖంచడమే బాగుంది ! (గజల్)


(దీవారో సే మిల్ కర్ రోనా అచ్చా లగ్తా హై)

కవి-ఖైసర్ -ఉల్-జాఫ్రీ.

తెలుగు అనుసృజన : గీతాంజలి



అవును ..గోడలని పట్టుకుని...గోడలతో కలిసి...గోడలని కౌగలించుకుని ఏడవడమే బాగుంది !

కానీ నేను పిచ్చివాణ్ణి అయిపోతానేమో అనే భయం కూడా వేధిస్తుంది !

ఈ భూగోళమంతటి అంతేలేని జ్ఞాపకాలు నన్ను పలకరించడానికి నా ఇంటికి వస్తాయా...

సంధ్య వాలితే చాలు.. శూన్యం నిండిన నా ఇల్లంతా నీ స్మృతుల జాతరతో నిండిపోతుంది.!

ఎన్నాళ్ల నుంచీ దాహంతో అలమటిస్తున్నానో...నీకేం తెలుస్తుందిలే .. దోస్త్ కొంచెం ఆలోచించు !

గడ్డి పరక మీది మంచు బిందువు కూడా నా దాహం తీరడానికి సరి పోతుందనిపిస్తుందంటే ఆశ్చర్యం ఏముంది చెప్పు?

ఇక నేను ఎవరిని రాళ్లతో కొట్టాలో అది కూడా నువ్వే చెప్పు దోస్త్ ! ఇక్కడ పరాయివాళ్లంటూ ఎవరున్నారని ?

ఈ అధ్దాల మేడలో కనిపించే ఒక్కో మొఖం నా వాళ్లవే

ఏం చేయను మరి ?

అందుకే.. ఒంటరిగా నిలబడే ఈ గోడలని కావలించుకుని వెక్కి ..వెక్కి ఏడవడమే బాగుంటుంది నాకు !

మీరే చెప్పండి..ఏం చేయాలో ?






Tags:    

Similar News