ఒడిశా పూరీ జగన్నాథ్ "పహండి"లో అపశృతి

ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా రథం నుంచి బలభద్ర స్వామిని ఆలయానికి తీసుకెళ్తుండగా..

Update: 2024-07-10 06:32 GMT

ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా రథం నుంచి బలభద్ర స్వామిని ఆలయానికి తీసుకెళ్తుండగా..స్వామి విగ్రహం జారిపోయి 9 మంది సేవకులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చామని, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ మీడియాకు తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగింది?

బరువైన బలభద్ర స్వామి చెక్క విగ్రహాన్ని బలభద్రుడి రథంపై దించి ఆలయంలోకి తీసుకెళ్తారు. ఈ ఆచారాన్ని "పహండి"గా పిలుస్తారు. నిన్న రాత్రి 9 గంటల తర్వాత ఈ ఆచారం కొనసాగిస్తుండగా.. విగ్రహానికి కట్టిన తాడు జారిపోవడంతో ఈ ఘటన జరిగింది.

సేవకులను పరామర్శించిన న్యాయశాఖ మంత్రి..

ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన సేవకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెంటనే పూరీని వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ మంత్రి పృథివీరాజ్ హరిచందన్‌ను సీఎం ఆదేశించారు. న్యాయ శాఖ మంత్రి వెంట ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిదా కూడా వెళ్లారు. వీరిద్దరూ ఆసుపత్రికి చేరుకుని గాయపడిన సేవకులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.."జగన్నాథ స్వామి ఆశీస్సులతో గాయపడిన వారంతా క్షేమంగా ఉన్నారు. పూజ కార్యక్రమాలు యథావిధిగా తిరిగి కొనసాగుతున్నాయి" అని చెప్పారు.

ప్రమాదం జరిగిన కాసేపటి తర్వాత ఉత్సవాలు యథావిధిగా కొనసాగాయి. జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్ర విగ్రహాలను గుండిచా ఆలయంలోకి తీసుకెళ్లారు. బహుదా జాతర ముగిసే వరకు ఈ విగ్రహాలు అక్కడే ఉంటాయి.  

Tags:    

Similar News