ఇండియాలోకి బ్యాన్‌డ్ చైనా యాప్స్ రీఎంట్రీ
చిన్న చిన్న మార్పులతో భారత్‌లోకి మళ్ళీ అందుబాటులోకొచ్చిన 36 చైనా యాప్స్.;
దేశ భద్రత, ప్రజల సమాచార గోప్యతపై భారతదేశ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే దేశ ప్రజల గోప్యతకు విఘాతం సృష్టిస్తున్న పలు యాప్‌లపై కొరడా ఝులిపించింది. సదరు యాప్‌లపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో అధిక శాతం యాప్‌లు చైనాకు చెందినవే. 2020లో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. ప్రపంచమంతా ఒక ఊపుఊపేసింది. అయితే భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన చైనా యాప్‌లా కొన్ని భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చాయి. పేర్లు, వెర్షన్లు, చిన్నచిన్న లోగో మార్పులు చేసుకుని మళ్ళీ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టేశాయి. ఇండియాలోకి తిరిగి రావడం కోసం ఈ యాప్‌లు అనేక మార్గాలు ఎంచుకుంటున్నాయి. అయితే భద్రతా సమస్యల వల్ల 2020లో 267 చైనా యాప్‌లపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయ వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న క్రమంలో దేశంలో చైనా తీరుపై పలు అనుమానాలు వ్యక్తమైన క్రమంలో భారత్.. ఈ నిర్ణయం తీసుకుంది. భారత ప్రజల డేటా దొంగలించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందన్న విమర్శలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇలాంటి విమర్శలు మరెన్నో వచ్చాయి. కాగా ఇప్పుడు భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన 36 యాప్‌లు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం ఆందోళన కరంగా మారింది. వాటిలో కొన్ని బ్రాండింగ్, లోగోల్లో మార్పులు చేసుకుని ఇండియా మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో ఫైర్ షేరింగ్ సర్వీస్ గ్జెండర్, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ మ్యాంగో టీవీ, షాపింగ్ యాప్ టావోబావో, డేటింగ్ యాప్ టాన్‌టాన్, షాపింగ్, ఎంటర్‌టైన్మెంట్, ఫైల్ షేరింగ్, కంటెంట్ క్రియేషన్‌కు చెందిన యాప్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి యాప్‌లు అనేక మార్గాలు ఎంచుకుంటున్నాయి. ఇక్కడ సంస్థలతో ఉన్న సంబంధాలను కూడా వినియోగించుకుంటున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ రిటైలర్ షీన్ కూడా వీటిలో ఒకటి. ఇది రిలయన్స్ లైసెన్సింగ్ ఒప్పందం ద్వారా భారత్‌కు తిరిగొచ్చింది. కాగా షీన్‌కు చెందిన భారత వినియోగదారుల సమాచారం అంతా కూడా ఇండియాలోనే ఉంటుందని, చైనాలోని మాతృసంస్థకు ఎటువంటి యాక్సెస్ ఉండదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా భారత ప్రభుత్వం నిషేధించి అనేక యాప్‌లు క్లోన్ వెర్షన్స్ ద్వారా ఇండియాలోకి రీఎంట్రీ ఇస్తున్నాయి. దీంతో వీటిని పూర్తిగా బ్యాన్ చేయడం చాలా కష్టంగా మారుతోంది. 2020లో భారత ప్రభుత్వం.. పబ్‌జీని బ్యాన్ చేసింది. కానీ ఏడాది తర్వాత అంటే 2021లో దక్షిణ కొరియాకు చెందిన క్రాప్టన్ ఆధ్వర్యంలో బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా తిరిగి అందుబాటులోకి వచ్చింది. అది కూడా 2022లో నిషేధాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత 2023లో భారత భద్రత, ప్రమాణాలను అనుసరించి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.