‘హర్యానా నెం.1 ఎవరు చేశారు’.. ప్రధాని మోదీకి జైరాం రమేష్ ప్రశ్న

హర్యానాలో నిరుద్యోగం వంటి సమస్యలపై ఓడిపోయే ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నలు సంధించారు.

Update: 2024-05-23 13:32 GMT

హర్యానాలో యువతకు సరైన ఉద్యోగావకాశాలు అందించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. బీజేపీ చేతకానితనం వల్లే దేశంలో నిరుద్యోగంలో హర్యానా నెంబర్ వన్‌గా నిలిచిందని విమర్శించారు. ఎన్నోసార్లు హామీలు ఇస్తున్నప్పటికీ రాష్ట్రంలోని యువతకు సరైన ఉద్యోగావకాశాలు అందించడం బీజేపీకి చేతకాలేదని, వారికి పర్మినెంట్ జాబ్స్ ఇప్పించలేకపోయిందే కాకుండా ఇప్పుడు స్కిల్ ఎంప్లాయ్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా తాత్కాలికమైన నిర్మాణ రంగంలోని ఉద్యోగాలను ప్రోత్సహించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. త్వరలో ప్రధాని మోదీ.. హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రధాని మోదీకి జైరాం రమేష్ పలు ప్రశ్నలు సంధించారు.

‘‘ఓడిపోనున్న ప్రధాని దృష్టి ఇప్పుడు మనపైన ఉంది. ఆయనకు మహేంద్రగడ్‌ నుంచి నేను వేస్తున్న ప్రశ్నలు ఇవే.. హర్యానాను నిరుద్యోగంలో నెంబర్ వన్‌గా ఎవరు మార్చారు? హర్యానాలో ప్రైవేట్ పెట్టుబడులను బీజేపీ ఎందుకు స్లో చేసింది? భివానీ నివాసులు తాగునీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ కోసం నిరసనలు చేసేలా ఎవరు మార్చారు?’’ అని రమేష్ తన ప్రశ్నలు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అనంతరం 37.4 శాతం నిరుద్యోగంతో దేశ సగటు నిరుద్యోగాన్ని అధిగమిస్తూ అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రంగా హర్యానా నిలిచిందని, ఈ విషయం తాను చెప్పట్లేదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడిస్తుందని వివరించారు.

‘‘ఉద్యోగాల భర్తీ విషయంలో బీజేపీ ప్రభుత్వం చూపుతున్న ఈ నిర్లక్ష ధోరణి వల్లే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. హిసార్ దూరదర్శన్‌ను మూసివేయాలని తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ నిరుద్యోగాన్ని మరింత పెంచుతోంది. ఈ ఒక్క నిర్ణయం పదుల సంఖ్యలో ప్రజలను నిరుద్యోగులను చేస్తుంది. దాంతో పాటుగా ఎంతో విలువైన భవనాన్ని వృధాగా పోయేలా చేస్తుంది. బీజేపీ పనితీరు, డొల్ల హామీలు, సరైన యాక్షన్ తీసుకోలేకపోవడం రాష్ట్ర యువతను ఫెయిల్ చేసింది. హర్యానా యువతకు మంచి అవకాశాలు కల్పించేలా బీజేపీ లేదా త్వరలో తప్పుకోనున్న ప్రధాని ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసిందా?’’ అని ప్రశ్నించారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రైవేట్ బ్యాంకుల ప్రోత్సహాక ప్రాజెక్ట్‌లలో ఒకే ఒక్కశాతం అందుకోవడం వల్లే ఆ ఏడాది మెట్రిక్‌లో అట్టడుగు స్థానంలో ఉందని గుర్తు చేశారు. ‘‘బ్యాంక్ ప్రోత్సాహక ప్రాజెక్ట్‌లు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చాలా ముఖ్యం. అంతేకాకుండా హర్యానాలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు వెనకడుగు వేయడానికి రాష్ట్రంలో ఉన్న దుర్బరమైన లా అండ్ ఆర్డర్ పరిస్థితి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. దీనిపై బీజేపీ ఏమైనా దృష్టి పెట్టిందా? పెడితే దానిని మార్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంది?’’ అని ప్రశ్నలు గుప్పించారు.

‘‘హర్యానాలో ఉన్న దుర్బరమైన లా అండ్ ఆర్డర్‌ను గుర్తించడంలో ఓడిపోనున్న ప్రధాని, ఆయన సర్కార్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? భవాని ప్రాంత ప్రజలు నీటి కొరత, కాలుష్యమైన నీరు, డ్రైనేజీ లీకులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కాలుష్యం, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలపై ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో అనేక నిరసనలు జరిగాయి. బీజేపీ పదేళ్ల పాలన తర్వాత కూడా భవాని ప్రజలు మౌలిక వసతుల కోసం ఎందుకు అన్ని ఇబ్బందులు పడుతున్నారు. అందుకు ప్రధాని సమాధానం చెప్పగలరా? నెలల తరబడి నిరసనలు జరుగుతున్నా వారి సమస్యలను బీజేపీ ఎందుకు పరిష్కరించలేకపోయింది? ఈ సమస్యపై ప్రధాని తన మౌనాన్ని వీడాలి’’ అని రమేష్ కోరారు.

Tags:    

Similar News