కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు పొడిగించింది.
By : The Federal
Update: 2024-04-01 11:38 GMT
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఆయనకు 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కోర్టులో హాజరుపరిచారు. మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ అప్పటి నుంచి ఈడీ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
‘‘విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదు. ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. ఆయన తన డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లను చెప్పడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆయనను మళ్లీ కస్టడీలోకి తీసుకుంటాం. అప్పటిదాకా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలి’’ అని ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ SV రాజు కోర్టుకు తెలిపారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి కేజ్రీవాల్‌కు జ్యుడిషియల్ కస్టరీకి ఉత్తర్వులిచ్చారు. దీంతో అధికారులు ఆయనను తిహార్ జైలుకు తరలించనున్నారు.
కోర్టు లోపలికి వెళ్లే ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచిది కాదు’’ అని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కోర్టులో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీశ్ సిసోదియా, సంజయ్ సింగ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టై తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.