స్టాలిన్ గురించి ‘కరుణశ్రీ’ రాసిన పద్యం ఎపుడైనా చదివారా?

సరిగా 70 ఏళ్ల క్రితం స్టాలిన్ మరణించినప్పుడు ‘కరుణ శీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన కవిత ఇది. ఆ నాటి ప్రపంచంలో స్టాలిన్ కున్న స్థానాన్ని వెల్లడిస్తుంది.

Update: 2024-03-05 13:24 GMT


ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు, సోవియట్ యూనియన్ అధినేత మార్షల్ జోసెఫ్  స్టాలిన్ 1953 మార్చి 5న మరణించాడు.

ఒకవైపు పెట్టుబడిదారి ప్రపంచం  విష ప్రచారం,మరొక ప్రశంసలు ఆయన జీవితవిశేషం. 
ఆ నాటి కమ్యూనిస్టులే కాదు, ప్రగతి కాముకులైన కమ్యూనిస్టేతరులు కూడా అతన్ని ఒక మహా నాయకుడిగా అభిమానించారు, కీర్తించారు.

రెండవ ప్రపంచ యుద్ధ చరిత్రను ఎరిగిన వారెవరూ స్టాలిన్ గొప్పతనాన్ని హర్షించకుండా ఉండలేరు..
5-3-1953 అంటే సరిగా 70 ఏళ్ల క్రితం ఆయన మరణించినప్పుడు ‘కరుణ శీ’ , జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన ఈ కవిత, ఆ నాటి ప్రపంచంలో స్టాలిన్ కున్న స్థానాన్ని వెల్లడిస్తుంది.
18-12-1887  స్టాలిన్ పుట్టినరోజు.



విశ్వవైతాళికుడు!


స్తంభించింది అకస్మాత్తుగా
జగత్తంతా ఒక క్షణం,
జారింది లోకం చెక్కిళ్ళపై
గోరువెచ్చని అశ్రుకణం.

నిలబడింది నిమేషకాలం
నిర్నిమేషంగా ఓల్గానది,
కరగినీరై గట్టుల తెంచుకొని
పొరలి పోయింది జనతాహృది.

తల వంచింది దీనంగా
మౌనంగా అరుణ పతాకం!
సమర్పించింది శ్రద్ధాంజలి
సమస్త ప్రజానీకం!!

కలాన్ని చుట్టుకుని ముందుకు
కదలలేకున్నది కవిత,
జాలిగా నిట్టూర్చింది
శాంతి వొడిలో మానవత!

రైతుకు పట్టంగట్టిన
రష్యా భాగ్య విధాత అతడు,
కూలీకి కిరీటం పెట్టిన
స్టాలిన్ మహానేత అతడు!

పదే పదే కదలనే
కదలదా పెదవుల జంట
పదే పదే మ్రోగనే
మ్రోగదా గుడిలో గంట

కదలక కదలక కదిలిందో!
ప్రపంచమంతా నిశ్శబ్దం!!
మ్రోగక మ్రోగక మ్రోగిందో!
ముందుకు సాగుతుంది శతాబ్దం!!

ఆయన వెలిగించిన ఆశాజ్యోతి
అడ్డగిస్తుంది అశాంతిని,
ఆయన ఆలపించిన క్రాంతిగీతి
ప్రసరిస్తుంది ప్రశాంతిని!

- కరుణ శ్రీ

(సేకరణ: దివి కుమార్, జనసాహితి)


Tags:    

Similar News