పశ్చిమ బెంగాల్‌లో సీఏఏను అమలు చేయం: మమత

స్పష్టత లేని పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) మోదీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోంది, దాన్నిమా రాష్ట్రంలో అమలు చేసేది లేదు : మమత బెనర్జీ

Update: 2024-03-12 16:53 GMT

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. స్పష్టత లేని పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) మోదీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోందని, కేంద్రం చర్యను "లూడో మూవ్"గా అభివర్ణించారు. బెంగాల్‌లోని హబ్రాలో జరిగిన సమావేశంలో మమతా మాట్లాడుతూ.. పౌరసత్వ హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సీఏఏ చట్టబద్ధతపై తనకు అనుమానం ఉందని, ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు.

పౌరసత్వం పొందని వారి ఆస్తులు ఏమవుతాయని ప్రశ్నించిన మమతా బెనర్జీ.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్‌సీ)తో సీఏఏ ముడిపడి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. బెంగాల్‌లో ఇది జరగడానికి తాను అనుమతించనని తెగేసి చెప్పారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా? అని ఆమె ప్రశ్నించారు. బెంగాల్‌ను విభజించేందుకు బీజేపీ కొత్త గేమ్ మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతపర హింసకు గురై.. అక్కడి నుంచి భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. 2019లోనే ఈ చట్టం పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదాన్ని పొందినా.. ఇన్నేళ్ల తర్వాత అమల్లోకి వచ్చింది. 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు ఆ మూడు దేశాల నుంచి భారత్‌లో అడుగుపెట్టిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ లేదా క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు.. ఈ చట్టం ప్రకారం పౌరసత్వం పొందవచ్చు.

Tags:    

Similar News