ఆ రోజున ఇంట్లో దీపాలు వెలిగించండి: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ సారి దేని గురించి మాట్లాడారు. ఎందుకు ఇంట్లో దీపాలు వెలిగించాలన్నారు..
ఆయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. సమయం సమీపిస్తుండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ విషయం అటుంచితే.. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా అయోధ్య రామ మందిరంపై మాట్లాడారు.
‘‘అయోధ్యలో రామమందిరానికి సంబంధించి దేశం మొత్తంలో ఉత్కంఠ, ఉత్సాహం వాతావరణం నెలకొంది. ప్రజలు అనేక రకాలుగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా, అనేక కొత్త పాటలను మీరు గమనించి ఉంటారు. శ్రీరాముడు, అయోధ్యపై కొత్త భజనలను రూపొందించారు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన రోజున ఇంట్లో దీపాలు వెలిగించండి’’అని మోదీ అన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో కళాప్రపంచం తనదైన ప్రత్యేక శైలిలో భాగస్వామ్యమవుతోందన్నారు.
సోషల్ మీడియాలో పంచుకోండి..
సోషల్ మీడియాలో ‘శ్రీరామ భజన్’ పేరుతో తయారైన పాటలను హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. ఈ సంవత్సరం తన చివరి రేడియో ప్రసారమైన మన్ కీ బాత్‌లో హృదయాన్ని కదిలించే భజనలను కంపోజ్ చేసిన వారిలో అనేక మంది అనుభవజ్ఞులు, కొత్త యువ కళాకారులు ఉన్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..
ఉత్తరప్రదేశ్‌లోని అనేక ఇతర ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఆధునీకరించిన రైల్వే స్టేషన్, కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం అయోధ్యలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడారు. జనవరి 22న జరిగే చారిత్రాత్మక రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు తమ ఇళ్లలో ప్రత్యేక దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేశారు.
మన్ కీ బాత్ రేడియో ప్రసారం 108వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని గురించి నొక్కి చెప్పారు. ‘ఫిట్ ఇండియా’ను హైలైట్ చేస్తూ.. భారత్ ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని, ‘వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం)’ స్వావలంబన స్ఫూర్తితో ముందుకెళ్తుందన్నారు.‘‘2024లో కూడా ఇదే స్ఫూర్తి వేగాన్ని కొనసాగించాలి.’’ అని చెప్పాడు.
మోదీ ప్రశంశలు..
రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇందులోని చంద్రబోస్ రాసిన నాటు..నాటు..పాటకు కీరవాణి సంగీతం సమకూర్చారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ చిత్రంతో పాటు ఆస్కార్‌కు ఎంపికయిన డ్యాకుమెంటరీ చిత్రం‘‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’’ను తన ప్రసంగంలో ప్రధాని హైలైట్ చేశారు. భారతదేశం సృజనాత్మకతను ప్రపంచానికి చాటిందని, పర్యావరణంతో దేశానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిందన్నారు.