లోక్ సభ ఎన్నికలు: ఈ ఐదు స్థానాల్లో పోరు హోరాహోరీ..

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో బలమైన అభ్యర్థులు పోటీపడుతుండడంతో..

Update: 2024-03-12 06:56 GMT

దేశంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ తొలి విడత జాబితా ప్రకటించి సమరానికి సై అంటున్నాయి. ఎప్పటిలాగే కొన్ని స్థానాల్లో పోరు పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. పైగా కొన్ని స్థానాలు ఆయా పార్టీలకు కంచుకోటలుగా ప్రసిద్ది చెందాయి. వాటిపైనే ప్రత్యర్థులు తొడగొడుతుండడంతో పెనాల్టీ షూటౌట్ కు దారి తీసేలా కనిపిస్తున్నాయి.. అవేంటంటే..

కేరళ: త్రిసూర్‌లో కె మురళీధరన్ (కాంగ్రెస్) vs విఎస్ సునీల్ కుమార్ (సిపిఐ), సురేష్ గోపి (బిజెపి)
కేరళలోని త్రిసూర్ లో ఈ సారి త్రిముఖ పోటీ ఉండబోతోంది. కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ అభ్యర్థులంతా హేమాహేమీలేకావడంతో పోటీ రసవత్తరం కాబోతోంది. రాజకీయాల్లోకి వచ్చిన నటుడు సురేష్ గోపి, కాంగ్రెస్ తరఫున ఇక్కడ సిట్టింగ్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ స్థానంలో వచ్చిన కే మురళీధరన్ తో ఢీ కొట్టబోతున్నారు.
ప్రస్తుత వటకర నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన మురళీధరన్‌కు త్రిసూర్‌లో అనుబంధం ఉంది. ఆయన తండ్రి మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి కె. కరుణాకరన్ కు సొంతగడ్డ. దీంతో ఈ ఎన్నిక మురళీధరన్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈయన నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అలాగే ప్రముఖ సీపీఐ నేత, మాజీ మంత్రి వీఎస్ సునీల్ కుమార్ సైతం ఇక్కడి నుంచే ఎంపీగా బరిలోకి దిగడంతో త్రిసూర్ లో పోటీ రసవత్తరంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన సురేష్ గోపి, రెండు సందర్భాలలో బిజెపి ఓట్ల శాతం పెంచడంలో ఉపయోగపడ్డారు.
ఛత్తీస్‌గఢ్: రాజ్‌నంద్‌గావ్‌లో భూపేష్ బఘేల్ (కాంగ్రెస్) వర్సెస్ సంతోష్ పాండే (బీజేపీ)


మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాజ్‌నంద్‌గావ్‌లో ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ బీజేపీకి మంచి పట్టుంది. 2009 నుంచి ఈ స్థానం బీజేపీదే. అయితే ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులను మారుస్తూ వస్తోంది కానీ.. ఇప్పుడు మాత్రం తిరిగి సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండేకి టికెట్ ఇచ్చింది. మాజీ సీఎం బాఘేల్ మాత్రం దుర్గ్ ఎంపీ స్థానంలో భాగమైన పటాన్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈసారి రాజ్ నందగావ్ లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. ఇది కచ్చితంగా ఆసక్తికరపోటీ అవుతుంది.
మహారాష్ట్ర: బారామతిలో సుప్రియా సూలే (NCP శరద్ పవార్) vs సునేత్ర పవార్ (NCP అజిత్ పవార్)



 


మహరాష్ట్రలోని బారామతిలో ఈ సారి పవర్ కోసం ఇరు ‘పవార్’ కుటుంబాలు బరిలోకి దిగాయి. మూడు సార్లు ఎంపీ(సిట్టింగ్), మహా మాజీ సీఎం శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేతో, అజిత్ పవార్ వర్గం నుంచి సునేత్ర బరిలో నిలిచింది. సునేత్ర అజిత్ పవార్ భార్య.  బిజెపి కూటమిలో చేరడానికి అజిత్ పెదనాన్న పార్టీ నుంచి తన వర్గం నాయకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు వర్గాల మధ్య వైరాలు ముదిరాయి. దాంతో ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.
ఢిల్లీ: న్యూఢిల్లీలో బన్సూరి స్వరాజ్ (బీజేపీ) వర్సెస్ సోమనాథ్ భారతి (ఆప్)



 


న్యూఢిల్లీ కేంద్రంగా మరో ఇంట్రెస్టింగ్ పోటీ ఉండనుంది. ఇక్కడ బీజేపీ, ఆప్ ప్రధాన ప్రత్యర్థులు. బీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ టికెట్ దక్కించుకున్నారు. ఈమె మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కూతురు. బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్. ఈ సీటు నుంచి రెండు పర్యాయాలు బీజేపీ ఎంపీగా ఎన్నికైన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో బన్సూరి పోటీ చేయబోతున్నారు.బన్సురి ప్రధాన అభ్యర్థి ఆప్ కు చెందిన సోమనాథ్ భారతి. ఈయన కూడా ఒక లాయర్. ఐఐటీయన్. 2013 నుంచి ఢిల్లీలోని మాల్వియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు.
త్రిపుర: త్రిపుర వెస్ట్‌లో ఆశిష్ కుమార్ సాహా (కాంగ్రెస్) వర్సెస్ బిప్లప్ దేబ్ (బీజేపీ)



 


త్రిపుర వెస్ట్ సీటు కోసం ఈశాన్య ప్రాంతంలో మరో పెద్ద పోరు జరుగుతోంది, ఇక్కడ త్రిపుర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆశిష్ కుమార్ సాహా బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌తో తలపడనున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన సాహాకు ఆసక్తికరమైన రాజకీయ చరిత్ర ఉంది. అతను గత పది సంవత్సరాలలోపే కాంగ్రెస్ నుంచి TMC కి, అక్కడి నుంచి BJPకి మళ్లీ తిరిగి కాంగ్రెస్‌లోకి మారారు. అతను 2013 అసెంబ్లీ ఎన్నికలలో బర్దోవాలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి, 2016లో TMCలో చేరాడు. 2018లో తదుపరి రాష్ట్ర ఎన్నికలలో, అతను మళ్లీ బర్దోవాలిలో గెలిచాడు, ఈసారి BJP అభ్యర్థిగా. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు, 2023 అసెంబ్లీ ఎన్నికలలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చేతిలో ఓడిపోయారు.
2018 నుంచి 2022 వరకు త్రిపుర సిఎంగా పనిచేసిన దేబ్, తరువాత వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మహాభారత కాలంలో ఇంటర్ నెట్ ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఇరుకున పడింది. అతను 2018 రాష్ట్ర ఎన్నికలలో త్రిపుర పశ్చిమ లోక్‌సభ స్థానంలో భాగమైన బనమాలిపూర్ నుంచి గెలిచాడు.
Tags:    

Similar News