వాళ్లిద్దరూ విద్యావంతులే, జీవితం పట్ల అపారమైన అవగాహన ఉన్న వాళ్లే. సుదీర్ఘకాలం కలిసి కాపురం చేసిన వారే. ఓ దేశానికి ప్రధానిగా పని చేసిన అనుభవమూ ఉంది వారిలో ఒకరికి. అయినా సరే అనారోగ్యం వెంటాడింది. వయసు పైబడింది. కారుణ్య మరణాన్ని ఆహ్వానించారు. ప్రభుత్వం అంగీకరించింది. స్వచ్ఛంద మరణానికి అనుమతించింది. అన్యోన్య దంపతులైన వారిద్దరూ ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకుని అంతులేని లోకాలకు ఏగారు. వాళ్లే నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అగ్డ్. ఆయన భార్య యూజినీ. విచిత్రమేమీ కాకపోయినా వీరిద్దరి వయసు కూడా 93 ఏళ్లే. కారణ్య మరణంతో లోకాన్ని విడిచారు.
ఎందుకు చనిపోయారు?
దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5న వారు ప్రాణాలు విడిచినట్లు డ్రైస్ స్థాపించిన మానవ హక్కుల సంస్థ ‘ది రైట్స్ ఫోరమ్’ తాజాగా వెల్లడించింది.
బ్రెయిన్ హెమరేజ్‌తో అనారోగ్యం...
డ్రైస్ వాన్ 2019లో బ్రెయిన్ హేమరేజ్ బారినపడ్డారు. చికిత్స తీసుకున్నా.. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. యూజినీ కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. 70 ఏళ్ల పాటు దాంపత్య జీవితం కొనసాగించిన వీరు.. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని, కళ్లలోకి చూసుకుంటూ ప్రాణాలు విడిచారు.
1977 నుంచి 1982 వరకు ప్రధానిగా డ్రైస్..
1977 నుంచి 1982 వరకు డ్రైస్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. క్రిస్టియన్ డెమోక్రటిక్ అప్పీల్ పార్టీ నుంచి వచ్చిన తొలి ప్రధాని ఆయన. ఇదిలా ఉండగా.. నెదర్లాండ్‌లో కారుణ్య మరణం 2002లో చట్టబద్ధమైంది. ఆరు షరతులతో దీన్ని అమలు చేశారు. కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది. భరించలేని బాధలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవడం వంటివి ఇందులో ఉంటాయి. అనుమతి పొందిన వారికి వైద్యులు విషపూరిత ఇంజెక్షన్‌ను ఇస్తారు.
నెదర్లాండ్స్‌లో ఆ వెసులుబాటు ఉంది...
చట్టమైన తర్వాత నుంచి నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణాల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 2021లో 16 జంటలు ఇలాగే ప్రాణాలు కోల్పోగా.. 2022లో ఆ సంఖ్య 29కి చేరింది.