బీజేపీలోకి సినీనటి నవనీత్ కౌర్‌..మహారాష్ట్ర అమరావతి నుంచి బరిలో..

బీజేపీ అధిష్టానం సినీనటి నవనీత్ కౌర్‌కు అవకాశం కల్పించింది. అమరావతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆమెను అదే స్థానం నుంచి పోటీ చేయిస్తోంది.

Update: 2024-03-28 08:58 GMT
బీజేపీ అధిష్టానం సినీనటి నవనీత్ కౌర్‌కు అవకాశం కల్పించింది. అమరావతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆమెను అదే స్థానం నుంచి పోటీ చేయిస్తోంది. ఈ మేరకు ఆమె పేరును ఖరారు చేస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా బుధవారం అర్థరాత్రి నవనీత్ కౌర్‌ నాగ్‌పూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులేతో సమావేశమయ్యారు. భర్త రవి రాణ, మద్దతుదారులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లి పార్టీలో చేరారు. ఏప్రిల్ 4న నవనీత్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
బీజేపీలో చేరడంపై నవనీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపొందే 400 సీట్లలో అమరావతి కూడా ఉంటుందని చెప్పారు. ప్రధాని మోదీ ’వికసిత్ భారత్ విజన్‌‘కు మద్దతు ఇచ్చేందుకే నవనీత్ బీజేపీలో చేరారని బవాన్‌కులే పేర్కొన్నారు.
ఇండిపెండెంట్‌గా గెలిచి..
2014లో అమరావతి నుంచి ఎన్సీపీ టికెట్‌పై పోటీ చేసి శివసేనకు చెందిన ఆనందరావు అద్సుల్ చేతిలో ఓడిపోయారు నవనీత్. కాగా 2019లో ఆమె ఎన్‌సిపి మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అద్సుల్‌ను ఓడించారు. అదే ఏడాది నుంచే నవనీత్ బీజేపీకి మద్దతివ్వడం మొదలుపెట్టారు.
’హనుమాన్ చాలీసా‘ వివాదంతో వెలుగులోకి..
గత సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి విజయం సాధించిన నవనీత్.. అప్పటి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. హనుమాన్ జయంతి రోజున ఆయన హనుమాన్ చాలీసా పఠించకపోతే, తామే ఆయన నివాసం వద్దకు వెళ్లి పఠిస్తామని కౌర్ దంపతులు హెచ్చరించారు. దీంతో నవనీత్ కౌర్ నివాసం వద్ద శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నవనీత్, ఆమె భర్తకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తామని చేసిన ప్రకటనపై నవనీత్ దంపతులు వెనక్కు తగ్గారు. ప్రధాని నరేంద్ర మోదీ ముంబయి పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదే ఉద్దేశంతో తమ ఆందోళనను విరమించుకున్నామని చెప్పారు. కాగా తమ ఆందోళనతోనే నవనీత్ కౌర్, రవి రాణా దిగొచ్చారని శివసేన కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. బీజేపీకి మద్దతు పలకడం వల్ల ఎంపీ నవనీత్ కౌర్ కు కేంద్రం వీఐపీ భద్రత కల్పించింది. ఆమె భద్రతకు ముప్పు ఉందని హోం శాఖకు కేంద్ర నిఘా సంస్థ పంపిన నివేదిక ఆధారంగా 'వై' కేటగిరీ భద్రత కల్పించారు.
Tags:    

Similar News