ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశభక్తి కాదా: ప్రొ. వకుళాభరణం సూటి ప్రశ్న

ఈ రోజు సర్వత్రా వినిపించే మాట దేశభక్తి. అసలు దేశ భక్తి అంటే ఏమిటి? ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశభక్తి లేనట్టా? ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ ఏమంటున్నారో చూడండి.;

Update: 2024-03-14 16:53 GMT
తెలుగు సమాజం ఆధునిక త అన్న అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడుతున్న ప్రముఖ చరిత్ర కారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ.

-రాఘవ శర్మ


"ఈ రోజు ప్రతి వాడు ‘దేశ భక్తి’ గురించి మాట్లాడుతున్నాడు. అసలు దేశ భక్తి అంటే ఏమిటి? ప్రభుత్వాన్ని విమర్శస్తే దేశభక్తి కాదా !? " అని ప్రముఖ చరిత్ర కారులు వకుళాభరణం రామకృష్ణ ప్రశ్నించారు.

‘తెలుగు సమాజం-ఆధునికత’ అన్న అంశంపై తిరుపతి జల్లా పౌరచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఎస్వీయూనివర్సీటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన సదస్సులో ముఖ్యవక్తగా వకుళాభరణం రామకృష్ణ ప్రసంగించారు.

పంతొమ్మిదవ శతాబ్దం మధ్య నుంచి ఆంగ్లేయుల పాలన కొత్త యుగాన్ని ప్రారంభించిందని, అది భూస్వామ్య వ్యవస్థను దెబ్బతీసినప్పటికీ, దాని అవశేషాలు మాత్రం కొనసాగాయని అన్నారు. ఆంగ్లేయుల పాలన మన దేశానికి ఎంత నష్టం చేసిందో, అంత మేలు కూడా చేసిందని వివరించారు.

పాత వ్యవస్థ పోయి కొత్త వ్యవస్థ వస్తున్న సంధి దశలో పాత వాటి ఆనవాళ్ళు, అవశేషాలు ఉంటాయని ఆయన వివరించారు. ఆయన ప్రసంగ ఇలా సాగింది.

‘‘బ్రిటిష్ వారు నూతన భూస్వామ్య పద్ధతులు ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే కోస్తా జిల్లాల్లో జమిందారీ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ఈ జమిందార్లు బ్రిటిష్ వారికి తాబేదార్లుగా వ్యవహరించారు. రాయలసీమలో పాలేగార్ వ్యవస్థను దెబ్బతీసి, రైత్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వీటి పునాదిగానే తెలుగు నాట ఆధునిక యుగం మొదలైంది.

మధ్యయుగం, ఆధునిక యుగం సంఘర్షిస్తున్న కాలంలో ఒక సంకర సంస్కృతి పుట్టుకొచ్చింది. ఇది అసలైన సంస్కృతి కాదు.


 బ్రిటిష్ వారు భూస్వామ్య వ్యవస్థను పూర్తిగా అంతరింప చేసి ఆధునిక వ్యవస్థను తీసుకొచ్చినట్టయితే, సమాజం ఇలా ఉండేది కాదు. భూస్వామ్య వ్యవస్థలో భాగంగా కుల వ్యవస్థ ఇప్పటికీ సమాజాన్ని శాసిస్తున్నది. మన ఆధునికతలో ఉన్న పెద్ద లోపం ఇదే. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం వల్ల తెలుగు సమాజంలో పెద్ద మార్పు సంభవించింది. గ్రామ సీమల్లో ' రేట్' పాఠశాలలు పెట్టారు. దీనిపైన జోళెపాలెం మంగమ్మ రాశారు.

ఆంగ్ల చదువుల వల్ల వాణిజ్యం, పట్టణాల్లో వృత్తి పరమైన ఉద్యోగాలు పెరిగి, సమాజాన్ని శాసించే మధ్యతరగతి వర్గం ఒకటి పుట్టుకొచ్చింది. పంతొమ్మిదవ శతాబ్దంలో సామాజిక మార్పుకోసం మధ్యతరగతి వర్గం ఉద్యమాలు చేపట్టింది.

విద్య, పట్టణీకరణ, నాయవ్యవస్థ, వృత్తి పరమైన వర్గాల వల్ల సామాజిక మార్పు జరిగింది. ఆ కాలంలో సాహిత్యంలో కూడా మార్పులు వచ్చాయి. కానీ ఈ మార్పంతా పైపైన వచ్చింది కానీ, పునాదిలో రాలేదు.

విద్యావంతులైన మధ్యతరగతి వర్గం ఈ రోజు కూడా సమాజానికి దారి చూపిస్తూ, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, సమాజాన్ని శాసిస్తోంది. ఈ మధ్యతరగతి వర్గానికి పూర్తి స్వేచ్ఛ కావాలి, భావ స్వాతంత్ర్యం కావాలి, మత అధికారాన్ని ఒప్పుకోరు. కానీ ఈ మధ్యతరగతి వర్గానికి మతం అవసరం లేకపోయినా, కులం మాత్రం కావాలి. కులం మతంలో భాగమన్న విషయం వీరికి తెలయడం లేదు.

కులం ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదని అంబేద్కర్ అన్నాడు. అంబేద్కర్ ఒక గొప్ప స్వాప్నికుడు. అంబేద్కర్ కేవలం దళితుల కోసం పాటుపడలేదు. దళితులు సమాజంలో భాగం కనుక అంబేద్కర్ మొత్తం సమాజం కోసం పాటు పడ్డాడు.

పంతొమ్మిదవ శతాబ్దంలో మధ్యతరగతి వర్గం సంస్కరణ ఉద్యమాలను తీసుకొచ్చింది. తరువాత జాతీయోద్యమంలో పాల్గొంది. విప్లవోద్యమాల్లో కీలక భూమికి పోషించింది. ఆధునికత గురించి తెలుసుకోవాలంటే పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన మేలు గురించి మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

సమాజంలో మార్పులు తీసుకు రావలసిన మధ్యతరగతి వర్గం ఇవాళ ఆపని చేయడం లేదు. ఇవ్వాళ్ళ మధ్య తరగతిలో మధ్యతరగతి లక్షణాలు చాలా మటుకు కనుమరుగయ్యాయి. సమాజానికి నాయకత్వం వహించి నడిపించాల్సిన మధ్యతరగతి వర్గం చాలా మటుకు కరప్ట్ అయిపోయింది.

స్వేచ్చను, భావ స్వాతంత్ర్యాన్ని కోరుకున్న మధ్యతరగతి వర్గం మతాధికారాన్ని ఎదుర్కొంటోంది. కానీ సమతూకం దెబ్బతింటోంది.’’ అంటూ వకుళాభరణం రామకృష్ణ తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ సదస్సులో మన్నవ గంగాధర ప్రసాద్, చంద్రబాబు, డాక్టర్ రమణం, రమేష్, డాక్టర్ మస్తానమ్మ, కిరణ్ కుమారి తదితరులు వేసిన ప్రశ్నలకు వకుళాభరణం సమాధానం చెప్పారు. సోషలిస్ట్ యూనిటి సెంటర్ ఆఫ్ ఇండియా కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రవాష్ ఘోష్ రాసిన ‘శరత్ సాహిత్యం నేటికీ అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఏమిటి?’ అన్న పుస్తకాన్ని పౌరచైతన్య వేదిక కార్యవర్గం వకుళాభరణం రామకృష్ణ కు అందచేసింది.

ఈ సదస్సు ప్రారంభానికి ముందు ప్రముఖ సామాజిక పరిశోధకురాలు వకుళాభరణం లలిత, కారల్ మార్క్స్, స్టీఫెన్ హాకింగ్ వర్దంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. పౌరచైతన్య వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు రాఘవ శర్మ, ప్రధాన కార్యదర్శి కుమార్ రెడ్డి, కోశాధికారి హరీష్ పాల్గొన్న ఈ సభకు విశ్వవిద్యాలయ అధ్యాపకులతో పాటు విద్యార్థులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
* ఫోటో క్యాప్షన్ : తెలుగు సమాజం - ఆధునికత అన్న అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడుతున్న ప్రముఖ చరిత్ర కారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, వేదికపై పౌర చైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు రాఘవ శర్మ, ప్రధాన కార్యదర్శి కుమార్ రెడ్డి , అధ్యక్షులు వాకా ప్రసాద్ , కోశాధికారి హరీష్.



Similar News