ప్రజ్వల్ కోసం రెండో లుక్‌అవుట్ నోటీసు..
అత్యాచార లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విచారించేందుకు పోలీసులు రెండో లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు.
అత్యాచార లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విచారించేందుకు కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం (మే 4) పోలీసులు రెండో లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు.
రెండో నోటీసుపై బెంగళూరులో హోంమంత్రి గంగాధరయ్య పరమేశ్వర మీడియాతో మాట్లాడారు. హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణ ఇద్దరిపైనా లుకౌట్ నోటీసులు జారీ చేశాం. హెచ్‌డీ రేవణ్ణ విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నందున లుకౌట్ నోటీసులు జారీ చేశాం. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి వారికి ఈ సాయంత్రం వరకు సమయం ఉంది.’’ అని తెలిపారు.
మరికొంత సమయం కావాలని..
తమపై మొదటి లుక్‌అవుట్ నోటీసు జారీ అయిన తర్వాత దర్యాప్తు బృందం ముందు హాజరు కావడానికి మరికొంత సమయం ఇవ్వాలని తండ్రీకొడుకులు పోలీసులను అభ్యర్థించడంతో రెండో లుక్‌అవుట్ నోటీసు జారీ అయ్యింది. అయితే మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సెక్స్ స్కాండిల్ కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణకు సిట్‌ను ఆదేశించింది.