ఇదండీ ఎన్.టి.ఆర్. 9999 కథ..

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 26వ వర్ధంతి ఈవేళ. ప్రతి మనిషికీ ఏదో ఒక ఆసక్తి ఉన్నట్టే ఎన్టీఆర్ కి ఫ్యాన్సీ నెంబర్లు, కార్ల మోజుండేది. అలా వచ్చిందే ఆ నెంబరు..

Update: 2024-01-18 06:22 GMT
ఈ కారు నెంబరే ఎన్.టి.ఆర్. 9999.

2024 జనవరి 18... ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 26వ వర్ధంతి ఈవేళ. అష్టకష్టాలు పడి పైకి వచ్చిన ఎన్టీరామారావు చిత్రపరిశ్రమలో స్థిరపడి ఓ రేంజ్ కి ఎదిగారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. టీడీపీని పెట్టారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. అనేక రికార్డులను అధిగమించారు. ఎంత ఎత్తుకెదిగినా ప్రతి మనిషికీ ఓ మోజో, ప్రత్యేక ఆసక్తో ఉంటుంది. అటువంటి వాటిలో ఒకటి కార్లమోజు. ఫ్యాన్సీ నెంబర్ల మోజు.

ఆ నెంబరు ఎక్కడ దొరుకుద్దబ్బా...


నటుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కి కార్ల కార్లంటే మహామోజు. ఏదైనా కొత్త కారు మార్కెట్లోకి వచ్చిందంటే కొనడం ఆయన అలవాటు. అప్పట్లో ఇప్పట్లా రకరకాల బ్రాండ్ల కార్లు ఉండేవి కావు. ఇండియాలో భాగా ఫేమస్ అంబాసిడర్. అయితే మార్కెట్లోకి ఏదైనా కొత్త రకం కారు వచ్చినప్పుడు మోజుపడి కొంటుంటారు. నెంబర్లు కూడా ఫ్యాన్సీగా ఉంటాయి. ఎన్టీఆర్ రామారావు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన కొనుకున్న కొత్త కారుకు తన పేరు గుర్తుకువచ్చేలా “N.T.R” అనే నెంబరు ప్లేటుండే రిజిస్ట్రేషన్ ఉంటే బాగుండనుకున్నారు. ఏయే రాష్ట్రాలలో ఆ పేరిట కొత్త కార్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా అని వెతికించారు. నాగాలాండ్ లో అటువంటి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలుసుకుని అక్కడ కారును కొనుక్కోవాలని ముచ్చట పడ్డారు. నాగాలాండ్ లో రోడ్ ట్రాన్స్ పోర్టు అథారిటీ ఎన్.టి.ఆర్. అనే సీరిలో కార్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నందున ఆ విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అక్కడే ఓ కారును కొన్నారు. దానికి 9999 నెంబరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత ఆ కారును రాష్ట్రానికి తెప్పించారు. అలా ఆయన తెప్పించుకున్న నాగాలాండ్ కారుకు ఎన్.టి.ఆర్. 9999 అని ఉండేది. అప్పటికే ఆయనకు చాలా కార్లున్నా, ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్లున్నా ఈ కారు మాత్రం ప్రత్యేకంగా కనిపించేది.

ఎన్టీఆర్ స్టాండర్ట్ కారు నెంబరు 2000

ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి అయిన తరువాత మొదట స్టాండర్డ్ 2000 కారును, ప్రీమియర్ పద్మిని కారును కొన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి విదేశాల నుంచి పెద్దకారును కొన్నారు. ఆ తర్వాత బుల్లెట్ ఫ్రూప్ అంబాసిడర్ కారును కూడా కొనుక్కున్నారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఆయనకు కార్లంటే ఎంతమోజుండేదో. అటువంటి వ్యక్తి 26 ఏళ్ల కిందట ఇదే రోజున హైదరాబాద్ లో చనిపోయారు. అప్పటికే ఆయనపై సొంతపార్టీ టీడీపీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేయడం, ముఖ్యమంత్రి పదవి పోవడం, ఆనాటి వైశ్రాయ్ హోటల్ ముందు లక్ష్మీపార్వతితో కలిసి చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది. అది వేరే కథ.

సీనియర్ బాటలో జూనియర్ ఎన్టీఆర్... 


సీనియర్ ఎన్టీఆర్ మాదిరే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఫ్యాన్సీ నెంబర్ల మోజుంది. తాత వారసత్వం పోకుండా ఆయన కూడా 9999 నెంబర్ ను వాడతారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు ప్రముఖులు శ్రీకాంత్, చిరంజీవి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి కార్ల పట్ల మక్కువ ఎక్కువ అంటుంటారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ప్రఖ్యాత బ్రాండ్ ఫారెన్ లంబోర్ఘినిని 5 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కార్లన్నీ ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉంటుంటాయి. ఆయన రేంజ్ రోవర్, BMW కార్లు రెండూ కూడా ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉంటాయి. చాలా మంది నటీనటులు తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల విషయానికి వస్తే సెంటిమెంట్లకు కట్టుబడి ఉండేవారు. వారిలో సీనియర్ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు ఒకరు. తన కారు నంబర్ 9999తో ఆయన సెంటిమెంట్‌ ముడిపడి ఉండేదన్న నానుడి ఉంది. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా 9999 నంబర్ ఉన్న కార్లనే ఉపయోగించేవారు. చిత్రమేటంటే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ఖాతా నెంబర్ కూడా 9999 కావడం గమనార్హం.

(ఆనాటి పేపర్ కటింగ్ పంపిన జి.ప్రభాకరరావుకి ధన్యవాదాలు)

Tags:    

Similar News