ఇదొక మాంచి మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌!

సీనియర్‌ సిటిజన్లు, ఉద్యోగ విరమణ చేసిన వారు ఎలాంటి రిస్క్ వద్దనుకునే వారికోసం పోస్టాఫీసు తీసుకువచ్చిన మంచి మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ ఇది వివరాలు;

Update: 2024-03-14 12:46 GMT
పోస్టాఫీసు స్కీం పోస్టర్

కుటుంబరావు (పేరు మార్చాం)కి 60 ఏళ్లు దాటాయి. మరే ఉద్యోగం చేయాలన్న ఆలోచన లేదు. జీవితపు మలిదశలో ఎటువంటి రిస్క్ లేకుండా నెలకో పది వేలు సంపాయించి సొంతూళ్లో ఇంటిపట్టున ఉండాలనుకుంటున్నారు. చేతిలో ఉన్న డబ్బును ఎవరికో ఇచ్చి వాళ్ల చుట్టూ తిరిగి ఛీ ఛా అనిపించుకోవాలని లేదు. అటువంటి వాళ్ల కోసం ఇండియన్ పోస్టల్ సర్వీసు ఓ మంచి పథకాన్ని ప్రకటించింది. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. దానిపేరే మంత్లీ ఇన్ కమ్ స్కీం- ఎంఐఎస్. ఈ పోస్టాఫీసు పథకం కింద నెలకు 9, 10వేల రూపాయల మధ్య ఆదాయం పొందాలనుకుంటే మీరు ఏమి చేయాలంటే..

మీరు ఏమి చేయాలంటే..

పెట్టుబడికి భద్రత.. స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకొనేవారు ఈ స్కీమ్‌ను పరిశీలించొచ్చు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు, ఉద్యోగ విరమణ చేసిన వారు నెలవారీ ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఈ స్కీంను ఎంచుకోవచ్చు.

పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్‌ చేసిన సొమ్ముకు మార్కెట్‌తో సంబంధం ఉండదు. మీ డిపాజిట్లు భద్రంగా ఉంటాయి. స్థిరమైన ఆదాయమూ వస్తుంది. మంచి ప్రజాదరణ పొందిన పథకాల్లో ఇదొకటి.

ఈ పథకంలో డిపాజిట్‌ గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. వ్యక్తిగతంగా, జాయింటుగానూ ఖాతా తెరవొచ్చు. 10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై కూడా గార్డియన్‌గా మైనర్‌ ఖాతాను తెరవొచ్చు. పథకంలో క‌నీస పెట్టుబడి రూ.1,000. సింగిల్‌ ఖాతాలో గ‌రిష్ఠంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. మెచ్యూరిటీ పూర్తయ్యేవరకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఎంఐఎస్‌ ఖాతా తెరిచిన తర్వాత ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ముందస్తు ఉపసంహరణ చేస్తే నిబంధనల ప్రకారం వడ్డీపై కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. మీకు నెలవారీ రూ.5,550 ఆదాయం రావాలనుకుంటే రూ.9 లక్షలు ఎంఐఎస్ స్కీమ్‌లో డిపాజిట్‌ చేయాలి. జాయింట్‌ ఖాతా తెరిచి రూ.15 లక్షలు డిపాజిట్‌ చేసిన వారికి రూ.9,250 నెలవారీ డబ్బు వస్తుంది. ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే మీకు దగ్గర్లోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్ట్ మాస్టర్ ను కలిస్తే మంచిది.

Tags:    

Similar News