ఉన్నట్లుండి ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా
అనారోగ్యం కారణమంటూ రాష్ట్రపతికి లేఖ;
జూలై 21,2025.
సోమవారం నాడు పార్లమెంటు సమావేశాలు యాథావిధిగా నడుస్తున్నాయి. అటు రాజ్యసభ, ఇటులోక్ సభ సజావుగానే సాగుతున్నాయి. ఎలాంటి అసహజ పరిణామాలు లేవు. ఇలా మధ్యాహ్నం నాలుగు గంటల దాకా సాగింది. ఉపరాష్ట్రపతి , రాజ్యసభ చెయిర్మన్ అయిన జగ్ దీప్ ధన్క్ డ్ కూడా చాలా సాధారణంగా రాజ్యసభకు అధ్యక్షత వహించారు. సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశానికి కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం 3.53కు ఒక ప్రకటన వెలువడింది. బుధవారం నాడు ఆయన రాజస్థాన్ లోని జైపూర్ వెళుతున్నారని. ఇందులో కూడా అనుమానించాల్సిందేమీ లేదు.
అయితే, మరో ఐదుగంటల తర్వాత ధన్కడ్ కార్యాలయం బాంబు పేల్చింది. పదవికి తాను రాజీనామా చేస్తున్నానని, ఇది తక్షణం అమలులోకి వస్తుందని ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖ రాశారు. ఎపుడూ చలాకిగా, తనదైన శైలిలోర రాజ్యసభ చర్చలో పాల్గొంటూ, హెచ్చరికలు జారీచేస్తూ , సలహా ఇస్తూ ఉండే ధన్కడ్ ఇలా రాజీనామా ఉన్నట్టుండి చేస్తారని ఎవరూ వూహించి ఉండరు. ఎందుకంటే ఆయన పదవీకాలం ఇంకా రేండేళ్లు ఉంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ గా ఉన్నపుడు 2022 ఆగస్టు లో ఆయన ఉపరాష్ట్రపతిగా నియమించారు. 2027 దాకా అంటే మరొక రేండేళ్లు ఆయన పదవిలో కొనసాగాల్సి ఉంది.
"ఆరోగ్యానికి ప్రాముఖం ఇస్తూ డాక్టర్ల సలహా మేరకు భారత ఉప రాష్టప్రతిగా రాజ్యాంగంలోని 67 (ఎ) అధికరణం ప్రకారం తక్షణం నేను రాజీనామా చేస్తున్నాను," అని ఆయన రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
దేశంలో రెండో అత్యున్నత పదవికి తక్షణం రాజీనామా చేయాల్సిన అత్యవసరం ఆరోగ్య సమస్యలేమున్నాయబ్బా అనేది దేశరాజధానిలో చర్చనీయాంశం అయింది. ఆయనను కలసిన వాళ్లు గాని, ఆయనతకు సన్నిహితంగా ఉన్నవాళ్లు గాని, లేదా ఇటీవలి కాలంలో ఆయనను గమనిస్తున్నవాళ్లు గాని అత్యవసర ఆరోగ్య సమస్య అనే కారణాన్ని అంగీకరించడం లేదు. మరేదో బలీయమయిన కారణం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు, ఆయన పదవిలో అసంతృప్తిగా ఉన్నట్లు ఎలాంటి సూచనలు వెల్లగడించలేదు.
ఈ ఏడాాది మార్చిలో ఆయన AIIMSలో గుండెకు శస్త్ర చికిత్సచేయించుకున్నమాట నిజమే. మొన్న జూన్ 25న నైనిటాల్ లోని ఒక సభలో ప్రసంగిస్తున్నపుడు ఆయన మూర్ఛపోయిన సంగతి కూడా నిజమే. కాని వాటివల్ల ఆయన తదనంతరం ఇబ్బంది పడిన సమాచారం లేదు. సోమవారం ఉదయం సభలకు హాజరయినపుడు ఆయన చాలా ఆరోగ్యంగా కనిపించారు. రాజీనామా చేసేంతగా నలతగా ఉన్నట్లు లేరు. మరీ ఉన్నట్లుండిరాజీనామా చేసేందుకు కారణమేమై ఉంటుంది?... అదే ప్రశ్న.
ధన్కడ్ పనితీరు వివాదాస్పదం
రాజ్యసభ లో ధన్కడ్ పనితీరు ప్రతిపక్షాలనుంచి బాగా విమర్శలు ఎదుర్కొంది. ఆయన ప్రభుత్వ పక్షపాతం వహిస్తున్నారని తీవ్రవిమర్శ ఎదురైంది. 2024 డిసెంబర్ ఆయన మీద ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చాయి. ఒక ఉప రాష్ట్రపతి మీద సభలో అవిశ్వాసం తీసుకురావడం ఇదే మొదటి సారి. అయితే, ఆ తీర్మానం వీగిపోయింది. అంతకు ముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఉన్నపుడు ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఆయనకు మధ్య తీవ్రమయిన విబేధాలు ఉండేవి. ఆయన సుప్రీంకోర్టు మీద కూడా తీవ్రమయిన విమర్శలు చేసేశారు. ఆ మధ్య రాజ్యాంగంలోని 142 అధికరణాన్ని సుప్రీం కోర్టు ను ఉపయోగించుకోవడడాన్ని రాజ్యాంగం మీద క్షిపణి దాడి గా పేర్కొన్నారు.
రైతు కుటుంబంలో పుట్టి..
1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్ సైనిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జనతాదళ్ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి జగదీప్ ధన్కర్ ఎంపీగా విజయం సాధించారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది.
సుప్రీంకోర్టు లాయర్
జగదీప్ ధన్కడ్ రాజస్థాన్ హైకోర్టు బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో మెంబర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు