భారత్- చైనా మధ్య జరిగేవి చెప్పలేం: రాజ్ నాథ్ సింగ్

భారత్ - చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. చర్చల ప్రక్రియలో ఉన్న సున్నిత సమాచారం ఆధారంగా కొన్నివిషయాలు బయటపెట్టలేమని..

Update: 2024-05-05 10:10 GMT

తూర్పు లద్ధాక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. "చర్చలు బాగా జరుగుతున్నాయి" అని పేర్కొన్నారు. అయితే, సంభాషణ ప్రక్రియ సున్నితమైన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని మరిన్ని వివరాలు ఇవ్వడానికి రక్షణమంత్రి నిరాకరించాడు.

భారతదేశం చైనాతో ఉన్న సరిహద్దులో వేగంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని, దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని నొక్కి చెప్పారు. చర్చలతో తమ మధ్య కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రెండు మిలిటరీల మధ్య దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ముఖాముఖి పోరుకు ముగింపు లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు, సింగ్ ఎదురు ప్రశ్న సంధించారు. "ఆశ లేకపోతే, చర్చలు ఎందుకు జరపాలి." "వారికి (చైనా వైపు) కూడా ఆశ ఉంది, అందుకే మేము చర్చలు జరుపుతున్నాము" అని ఆయన చెప్పాడు.

ప్రతిష్టంభన
మే 2020 నుంచి భారత్- చైనా మిలిటరీలు ఇక్కడ మిర్రర్ డిప్లాయ్ మెంట్ ను అనుసరిస్తున్నాయి. ఇరు సైన్యాలు అనేక వివాదాస్పద పాయింట్ల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ సరిహద్దు సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు. ఈ విషయం పై అనవసర రాద్దాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు.
"భారత సైనికుల ధైర్యాన్ని వారు (కాంగ్రెస్) ప్రశ్నిస్తున్నారు... మీరు ఎవరిని నిలదీస్తున్నారు? మీ ఉద్దేశం ఏమిటి? నేను కూడా 1962 నాటి అంశాలను ప్రశ్నించగలను" అని ఆయన అన్నారు. జూన్ 2020లో గాల్వాన్ లోయలో రెండు పక్షాల మధ్య అత్యంత తీవ్రమైన సైనిక సంఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ చెబుతోంది.
ఉన్నత స్థాయి సైనిక చర్చలు
వివాదాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఇరుపక్షాలు ఫిబ్రవరిలో చివరి రౌండ్ ఉన్నత స్థాయి సైనిక చర్చలు నిర్వహించాయి. 21వ రౌండ్ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించనప్పటికీ, రెండు పక్షాలు సరిహద్దులో "శాంతి, ప్రశాంతతను" కొనసాగించడానికి, అలాగే చర్చలు జరపడానికి అంగీకరించాయి.
మరో విడత చర్చలు..
జనవరిలో, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ, తూర్పు లడఖ్‌లోని LAC వెంబడి పరిస్థితి "స్థిరంగా ఉంది" కానీ "సున్నితంగా" ఉందన్నారు. ఏదైన దుస్సహాసాలు చేస్తే సమర్థవంతంగా ఎదుర్కోవటానికి భారత దళాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 2020 మధ్యలో ఉన్న "యథాతథ స్థితికి" తిరిగి రావాలనే లక్ష్యంతో భారత్- చైనా రెండూ సైనిక దౌత్య స్థాయిలలో చర్చలు కొనసాగిస్తున్నాయని జనరల్ పాండే చెప్పారు.
మే 5, 2020న పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది. సైనిక - దౌత్యపరమైన చర్చల పరంపర ఫలితంగా, పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డున గోగ్రా ప్రాంతంతో సహా పలు ఘర్షణ పాయింట్లలో ఇరుపక్షాలు వెనక్కి తగ్గాయి.
Tags:    

Similar News