రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఎప్పట్నుంచి?
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారా? యాత్ర ఎన్ని రోజుల సాగనుంది? కాంగ్రెస్ అగ్రనేతలు ఏమని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి మణిపూర్ నుంచి ప్రారంభించి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహించనున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణకు చేపట్టే ఈ యాత్రలో ప్రజలు, ప్రజా సంఘాలు పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ ఆదివారం విజ్ఞప్తి చేసింది.
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయ్ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ట్విట్టర్ (ఎక్స్)లో ప్రజలను కోరారు.
‘‘ప్రతి భారతీయుడి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచారమే భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ అని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై పోరాడేందుకు ఎన్నో సంస్థలున్నాయని, అయితే యువతకు ఉద్యోగావకాశాల కోసం, మహిళలకు సాధికారత కోసం, కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారం కోసం, దళితులు, ఆదివాసీల అభ్యున్నతికి రాహుల్ పోరాడుతున్నారని రమేష్ పేర్కొన్నారు.
2024 ఎన్నికలకు ముందు చేపట్టే 66 రోజుల యాత్రలో 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మార్చి 20 లేదా 21న ముంబయిలో ముగిసే ఈ యాత్ర 6,713 కి.మీ మేర సాగనుంది.