కర్నాటకలో సుమలతకు అడ్డొస్తున్న కుమారస్వామి

లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. మాండ్య పార్లమెంట్ సీటుకు ఎంపీ సుమలత, అటు హెచ్ డీ కుమారస్వామి పోటీ పడుపతున్నారు.

Update: 2024-02-26 08:07 GMT

లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం గురింది బాగా చర్చ జరుగుతోంది. ఈ సీటుకు సిట్టింగ్ ఎంపీ సుమలత, అటు హెచ్ డీ కుమారస్వామి పోటీ పడుపతున్నారు. చివరకు ఈ సీటు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

మాండ్య నియోజకవర్గం నుంచి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు సిట్టింగ్ ఎంపీ సుమలత. ఈ సారి కూడా బీజేపీ నుంచి బరిలో ఉండాలని సంవత్సరం నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాండ్యా నుంచి తొలి బీజేపీ ఎంపీ కావాలన్నదే నా పెద్ద కోరిక’’ అని తన మనసులో మాటను బయటపెట్టారు. ఆమె ప్రకటనతో మండ్య టికెట్ ఆశిస్తోన్న బీజేపీ మిత్రపక్షం జేడీ(ఎస్) నేతలకు ఏంచేయాలో అర్థం కావడ లేదు. తర్వాత సుమలత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలతో చర్చలు జరిపారు.

అమిత్ షాతో హెచ్‌డీకే భేటీ..

ఇటు ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన జేడీఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ తర్వాత మాండ్యాతో పాటు మరో మూడు నియోజకవర్గాలను జేడీఎస్‌కు వదిలి, మిగిలిన రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చుకునేందుకు బీజేపీ నేతలు అంగీకరించినట్లు సమాచారం. మాండ్య, హాసన్, కోలార్ లోక్‌సభ నియోజకవర్గాలు జేడీఎస్‌కు వస్తాయని, తుమకూరులో బీజేపీ అభ్యర్థి జేడీఎస్ గుర్తుపై, బెంగళూరు రూరల్‌లో జేడీఎస్ అభ్యర్థి బీజేపీ గుర్తుపై పోటీ చేస్తారని అమిత్ షా ఖరారు చేసినట్లు సమాచారం.

గెలుపే ముఖ్యమన్న కుమారస్వామి..

అమిత్ షాతో కుమారస్వామి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సీట్ల కేటాయింపుపై హెచ్‌డి కుమారస్వామి ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా.. “నియోజకవర్గాల కేటాయింపుపై రెండు పార్టీల నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మాండ్య, హాసన్‌లో ఎవరు పోటీ చేసినా పర్వాలేదు, ఎవరు నిలబడినా 28 నియోజకవర్గాల్లో కూటమి గెలవాలన్నదే మా లక్ష్యం’’ అని అన్నారు కుమారస్వామి.

నాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి.. సుమలత

‘‘మాండ్య నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతా. మండ్య మినహా మరెక్కడా పోటీ చేయను. బీజేపీ నుంచి టికెట్ రాకపోతే నా ముందు చాలా ఆప్షన్‌లు ఉన్నాయి.’’ అని అన్నారు ఎంపీ సుమలత. ఆమె వ్యాఖ్యలు హెచ్‌డీకేను కలవరపాటుకు గురిచేశాయి. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇటు సుమలత సీటు తనకే దక్కుతుందన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. 'నేను మాండ్యా నుంచి పోటీ చేస్తాను. కుమారస్వామి ఏం చెప్పినా బీజేపీ టికెట్ నాకే దక్కుతుందన్న నమ్మకం ఉంది. నా ముందు చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే, నేను మాండ్యా వదిలి వేరే చోటికి వెళ్లే ప్రశ్నే లేదు’’ అని సుమలత పేర్కొన్నారు. మాండ్య లోక్‌సభ సీటు కోసం జేడీఎస్ నేతలకు, తనకు మధ్య ఉన్న తీవ్ర పోటీ గురించి అడిగిన ప్రశ్నకు ‘‘తన ముందు చాలా ఆప్షన్‌లు ఉన్నాయి’’ అని చెప్పారు సుమలత.

మాండ్యాపై హెచ్‌డీకే కన్ను

మండ్య టిక్కెట్‌పై సుమలత గట్టిగా పట్టు బట్టడం, పదే పదే అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెబుతుండడంతో హెచ్‌డి కుమారస్వామి ఢిల్లీ వెళ్లారు. మాండ్య నుంచే తాను కూడా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు బీజేపీ అగ్ర నేతలు చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి కుమారస్వామి గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాండ్యా నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈసారి మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తన పోటీకి సుమలత అడ్డంకి కాకూడదని ముందస్తుగా బీజేపీ నేతలతో కుమార స్వామి భేటీ అయినట్లు సమాచారం.

మాకు ఖాళీ లేదు: కాంగ్రెస్

మండ్య సీటును జేడీఎస్‌కు కేటాయించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఎంపీ సుమలత కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే సుమలతను బయటి నుంచి తీసుకొచ్చి బరిలో దింపాల్సిన అవసరం లేదని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి లక్ష్మణ్ అన్నారు. మాండ్యా సహా 15 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికను మా పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. మాండ్యాకు మా అభ్యర్థి ఎవరో ఇప్పటికే నిర్ణయించారు అని ఆయన స్పష్టం చేశారు.

‘‘సుమలత బీజేపీలో ఉన్నారు. ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలిగా ఉంటూ మా పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మా నేతలను తిట్టిపోస్తున్నారు. ఆమెను పిలిచి టిక్కెట్టు ఇచ్చి గెలిపించుకునే దౌర్భాగ్యం మాకు రాలేదు. మా అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేశాం. అలాంటప్పుడు బయటి వ్యక్తులను, ముఖ్యంగా మమ్మల్ని రాజకీయంగా విమర్శించిన వారిని ఆహ్వానించి, ఎన్నికల బరిలోకి దింపాల్లిన అవసరం కాంగ్రెస్‌కు లేదు.’’ అని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

కాగా, సుమలత బీజేపీతోనే ఉంటారని బీజేపీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం స్పష్టం చేశారు. దీంతో మాండ్య లోక్‌సభ నియోజకవర్గం టిక్కెట్‌పై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Tags:    

Similar News