223 మంది మహిళా కమిషన్ సిబ్బందిని గవర్నర్ ఎందుకు తొలగించారు?
ఢిల్లీ మహిళా కమిషన్ తాత్కాలిక సిబ్బంది నియామకంలో నిబంధనలు పాటించలేదని ఢిల్లీ గవర్నర్ ఏకంగా 223 మంది తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
By : The Federal
Update: 2024-05-02 08:45 GMT
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీబ్ల్యూ)లో 223 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారిని తక్షణమే సర్వీసు నుంచి తొలగించినట్లు మహిళా శిశు అభివృద్ధి శాఖ వెల్లడించింది.
నిబంధనలను అతిక్రమించారు..
నిబంధనల ప్రకారం ఢిల్లీ మహిళా కమిషన్‌లో ఉన్నవి 40 పోస్టులే. కానీ కమిషన్ మాజీ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్, గవర్నర్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే 223 మందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించారు. ఇలా నియామకాలు చేపట్టే అధికారం కమిషన్‌కు లేదు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వంపై అదనపు భారం మోపే నిర్ణయాలను కమిషన్ తీసుకోకూడడని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. సిబ్బంది వేతనాలు, భత్యాల పెంపు విషయంలోనూ నిబంధనలను ఉల్లంఘించారని దర్యాప్తులో తేలడంతో కాంట్రాక్టు సిబ్బంది తొలగింపునకు సంబంధించిన సర్యులర్‌ను గవర్నర్ కార్యాలయం విడుదల చేసింది.
గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన మలివాల్..
సిబ్బంది తొలగింపును డీసీడబ్ల్యూ మాజీ చీఫ్, ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తప్పుబట్టారు. ఆమె ఎక్స్ లో ఇలా అన్నారు.. “ఢిల్లీ మహిళా కమిషన్ కాంట్రాక్ట్ సిబ్బంది అందరినీ తొలగించాలని LG సాహెబ్ 'తుగ్లక్' ఉత్తర్వును జారీ చేశారు. ప్రస్తుతం మహిళా కమిషన్‌లో మొత్తం 90 మంది సిబ్బంది ఉండగా, వీరిలో కేవలం 8 మందికి మాత్రమే ప్రభుత్వం నియమించింది. మిగిలిన వారంతా కాంట్రాక్టు ఉద్యోగులు. కాంట్రాక్టు సిబ్బందిని తొలగిస్తే మహిళా కమిషన్ కార్యాలయానికి తాళం వేసుకోవాల్సిందే. ఢిల్లీ మహిళా కమిషన్ సిబ్బందికి రక్షణగా నిలబడాల్సిందిపోయి.. దాన్ని నాశనం చేస్తున్నారా? నేను బతికి ఉన్నంత వరకు మహిళా కమిషన్‌ను మూసేయను.’’ అని మలివాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా 9 ఏళ్ల పాటు స్వాతి మాలివాల్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆ తర్వాత నుంచి కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది.
కాగా గవర్నర్ తాజా ఉత్తర్వులపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం స్పందించలేదు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్‌కు పాలన విషయంలో విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యవహారాలను గవర్నర్ కార్యాలయం అడ్డుకుంటోందని ఆప్ సర్కారు ఆరోపించింది.