నిర్మలా సీతారామన్‌ కు తలుపులు మూసిన కర్ణాటక బీజేపి

కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌ను పోటీ చేయిస్తే.. ఆ తర్వాతి పరిణామాలను అంచనా వేసిన అధిష్ఠానం తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-03-12 14:17 GMT

నిర్మలా సీతారామన్. రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఈ పేరు సుపరిచితమే. బీజేపీ జాతీయ నాయకత్వం కొంతమంది పార్టీ ప్రముఖులను ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలపాలనుకుంటోంది. ఆ జాబితాలో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు కూడా ఉంది. ఈమెను కర్ణాటక నుంచి పోటీకి దింపాలని యోచిస్తున్నారు. బెంగుళూరు సౌత్ లేదా మంగళూరు నుంచి సీతారామన్‌ను పోటీకి దింపాలనే ఆలోచనతో బిజెపి ఉందని పార్టీ వర్గాలు ది ఫెడరల్‌కి తెలిపాయి. అయితే ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు ఇష్టం లేదు. ఆమె పుట్టిన తమిళనాడు రాష్ట్రం నుంచి ఆమెను పోటీ చేయించాలని రాష్ట్ర బీజేపీ నేతలు సూచించారట. ఇందుకు కారణాలు లేకపోలేదు.

నిష్క్రియాత్మక థోరణి..

గతంలో కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జల వివాదం జరిగింది. ఆ సమయంలో సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. జల వివాదంలో సీతారామన్ నిష్క్రియాత్మక థోరణి కన్నడ వాసులకు నచ్చలేదు. ఇది ఆమె ఓటమికి దారితీస్తుందేమోనని బీజేపీ నాయకుల అభిప్రాయం.

స్థానికురాలు కాకపోవడం..

మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, ఆయన కుమారుడు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బివై విజయేంద్ర, ప్రధాన కార్యదర్శి జివి రాజేష్‌ తదితరులతో బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ గతంలో సమావేశమైంది. నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అయితే సీతారామన్ అభ్యర్థిత్వాన్నికర్ణాటక బీజేపీ వ్యతిరేకించడానికి ఆమె స్థానికతే కారణమని యడియూరప్పకు సన్నిహితంగా ఉండే బిజెపి నాయకుడు తెలిపారు. నిర్మలా సీతారామన్ తమిళనాడుకు చెందిన వారు కావడంతో ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తేనే బాగుంటుందని చెప్పారట.

బడ్జెట్ కేటాయింపులో అన్యాయం..

బడ్జెట్ కేటాయింపులో కర్ణాటకకు నిర్మలా సీతారామన్ తీవ్ర అన్యాయం చేశారని సిద్ధరామయ్య ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేసింది.

సిద్ధరామయ్య మంత్రివర్గం ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహించి ఇటు సీతారామన్‌, అటు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన విషయం కూడా తెలిసిందే. వీటన్నిటిని కర్ణాటక బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

పుట్టి పెరిగింది తమిళనాడులోనే..

నిర్మలా సీతారామన్ ఆగస్టు 1959లో తమిళనాడులోని మధురైలో తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేరే ముందు ఆమె విల్లిపురం, చెన్నై తిరుచిరాపల్లిలో చదువుకున్నారు. సీతారామన్‌ను బెంగుళూరు సౌత్‌ నుంచి పోటీ చేయిస్తే ఆమె తమిళ మూలాల గురించి కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఇది ఇతర నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపుతుందని బిజెపి వర్గాలు తెలిపాయి.

కన్యాకుమారి నుంచి నిర్మలా?

కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌ను పోటీ చేయిస్తే.. ఆ తర్వాతి పరిణామాలను అంచనా వేసిన అధిష్ఠానం తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పోటీకి దింపాలని కేంద్ర నాయకత్వం యోచిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకేతో పొత్తు కుదిరితే సీతారామన్‌ పోటీ చేయించడం సులువవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News