కేంద్రంలో బిజెపికి 400 సీట్లొస్తాయా, అన్ని సీట్లు ఎక్కడున్నాయి?

2019లో బిజెపికి 303 సీట్లు వచ్చాయి. ఇపుడు 400 సీట్లు లక్ష్యం పెట్టుకుంది. పదేళ్ల పాలన తర్వాత 2024లో ఉన్నసీట్లు నిలుపుకోవడం కష్టమవుతుందా లేక 400 వస్తాయా?

Update: 2024-03-28 04:57 GMT


2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ 400 సీట్లు గెల్చుకోవాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇది సాధ్యమా, బీజేపీ అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందా. బిజెపికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం కష్టం. అయితే, రాష్ట్రాల వారిగా బిజెపి పాబల్యాన్ని పరిశీలిస్తే కొంతవరకు లెక్క వేయవచ్చు. 2019లో బిజెపికి 303 సీట్లు వచ్చాయి.


దక్షిణాదిలో పరిస్థితి ఏమిటి?

*దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళనాడు, పుదుచ్ఛేరి, కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలలో మొత్తం 128 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్ని కలలో ఈ రాష్ట్రాలలో బిజెపి గెల్చుకున్నది కేవలం 29 స్థానాలు.

*రాష్ట్రాల వారీగా చూస్తే, కర్నాటకలో బిజెపి మంచి ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 28 లోక్ సభ  స్థానాలుంటే 25 స్థానాలు బిజెపి గెల్చుకుంది. ఇప్పుడు కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. బిజెపి వీక్ అయింది. వోటర్లు కాంగ్రెస్ వైపు మల్లే అవకాశం ఉంది.  ఆ రాష్ట్రంలో మళ్లీకి బీజేపీకి  25 స్థానాలు వస్తాయన్న గ్యారంటీలేదు. సరిగదా తగ్గవచ్చు. బిజెపి బలగం పది పన్నెండు స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉన్నది.

*తెలంగాణలో ఉన్న 17 స్థానాలలో బిజెపి గెలిచిన నాలుగు స్థానాలకు అటు ఇటు గా ఉండొచ్చు. ఇక్కడ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఈ నాలుగయిదు స్థానాలు రావచ్చు.

*తమిళనాడు, కేరళలో బిజెపి మెరగు పడినట్లు సూచనలు కనిపించడం లేదు, తమిళనాడులో ఎన్డీఏ పక్షమైన ఏఐడీఎంకే కూడా ఇప్పుడు దూరమైంది. ఈ ద్రవిడ రాష్ట్రంలో బిజెపి బుట్టలో పడే సీట్లు ఉండకపోవచ్చు.

*ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడేలా లేదు.  అక్కడ బిజెపి ఎక్కడుంది?  అక్కడి బిజెపికి  ఆశాకిరణం టీడీపీతో పొత్తు. బిజెపి,టిడిపి, జనసేన పొత్తు పెట్టుకున్నాయి.  పొత్తు ఫలిస్తే ఒకటో రెండో సీట్లు రావచ్చు.


ఉత్తరాన పరిస్థితి ఏమిటి?  


* లోక్‌సభ లో ఉన్న 543 స్థానాల్లో దక్షిణాదికి చెందిన 128 స్థానాలలో పరిస్థితి ఇది. ఇందులో బిజెపి కి ఒక 20 వస్తాయనుకుందాం. ఇక మిగిలిన 415 స్థానాలలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 400 మార్క్ చేరాలంటే సుమారు 380 స్థానాలు గెలవాలి.

▪️ఎన్డీఏ మిత్ర పక్షాలైన జనతాదళ్‌ (యునైటెడ్‌), శివసేన (ఏకనాథ్‌షిండే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌), ఎన్డీఏలోని ఇతర చిన్న, చితక పార్టీలకు కేటాయించి సీట్లు పోగా బీజేపీ ఉత్తర భారతం లో పోటీ చేసే సీట్ల సంఖ్యనే 350కి మించదు.

*ఉత్తర భారతదేశంలో బీజేపీ పోటీ చేసే అన్ని సీట్లు గెలిస్తే గాని అంటే పోటీ చేసిన స్థానాలు నూటికి నూరు శాతం గెలిస్తేనే ప్రధాని మోదీ 400 కల నెరవేరదు.

* మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఉపునిచ్చిన మాట నిజమే. లోక్‌ సభ ఎన్నికలలో ఈ మూడు రాష్ట్రాల నుండి బిజెపికి బాగా సీట్లు వచ్చాయి. ఇక అదనంగా సాధించేదేమీ లేదు.

*ఈ మూడు రాష్ట్రాలను వివరంగా పరిశీలిద్దా. ఈ రాష్ట్రాలలో 65 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019 లోక్‌ సభ ఎన్నికలలో బీజేపీకి మాగ్జిమం 61 స్థానాలు లభించాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఒక స్థానంలో గెలుపొందింది. అదనంగా గెలుపొందడానికి 3 స్థానాలే ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో బీజేపీకి 15 నుండి 20 స్థానాలు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు.

*2019 ఎన్నికలలో గుజరాత్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని 52 లోక్‌సభ స్థానాలున్నాయి. 52 స్థానాలను (100శాతం సీట్లు) బీజేపీ గెలుపొందింది. ఇంక పెరిగేందుకు ఏమీ లేదు.

*హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, ఢిల్లీ, గుజరాత్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య ఎన్నికల పొత్తు కుదరడం ఈమధ్య కాలంలో వచ్చిన పరిణామం.ఈ పొత్తు సక్సెస్ అయితే బిజెపి సీట్లు తగ్గడమే తప్ప పెరిగేందుకు అకాశం లేదు.

*ఉత్తర ప్రదేశ్ బిజెపికి కొండంత అండ. ఇక్కడ బిజెపి అధికారంలో ఉంది. రామాలయం నిర్మించింది. ఈ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019 లో 62 స్థానాలు బీజేపీ గెలిచింది. 2014 తో పోల్చితే 9 సీట్లు తగ్గాయి.

2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 41.29 శాతం ఓట్లు మాత్రమే బీజేపీ పొందింది.యూపీలో అయోధ్య తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోక పోవడం, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వలన బీజేపీకి గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే కనీసం 20 సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది తప్ప పెరిగే వాతావరణం లేదు.

*ఉత్తరాన మరొక ముఖ్యమైన రాష్ట్రం బీహార్‌. ఈ రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాలలో 2019లో బీజేపీకి 17, ఎన్డీఏ పక్షాలైన జనతాదళ్‌ (యునైటెడ్‌)కు 16, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపి)కి 6 స్థానాలు వచ్చాయి. ఇక్కడ బిజెపితో జెడి(యు) ఇపుడు పొత్తుపెట్టుకుంది. ఈ పొత్తుతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాగా చెడ్డపేరు వచ్చింది.బిజెపికి కూడా అంతే చెడ్డపేరు వచ్చింది. ఈ బ్యాక్ గ్రౌండ్ లో నితిష్ ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జెడి), కాంగ్రెస్‌, వామపక్ష కూటమి ఏర్పడటం బిజెపికి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంది. అపుడు ఇక్కడ సీట్లు తగ్గడమే గాని పెరగే అవకాశం లేదు.

*జార్ఖండ్‌ రాష్ట్రం తీసుకుందాం. అక్కడ మొత్తం 14 లోక్ సభ స్థానాలున్నాయి. 2019లో బీజేపీకి 11 వచ్చాయి. ధాని మిత్రపక్షం ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యు) ఒక స్థానంలో గెలిచింది. ఇక ఇక్కడ కూడా బిజెపికి పెరిగే అవకాశం లేదు. ఉన్నా ఒకటి రెండు మాత్రమే. అయితే, కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎమ్‌ ఎమ్‌) కు మంచి ఫలితాలు వస్తాయిన సర్వేలు చెబుతున్నాయి.

*ఇక మహారాష్ట్రని చూస్తే, ఇక్కడ కూడా పార్టీ ఆరోగ్యం బాగున్నట్లు లేదు. ఇక్కడ 42 లోక్‌సభ స్థానాలకుగాను 2019 లో బీజేపీ 23, అప్పటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన 18 స్థానాలను పొందాయి. కాంగ్రెస్‌ ఒకటి, ఎన్సీపి నాలుగు, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచాయి. ఇంతకంటే బిజెపికి పెరిగే అవకాశం లేదు. ఇక్కడ పరిస్థితులు బాగా మారాయి. ఇప్పుడు శివసేన (ఏకనాత్‌ షిండే), ఎన్సీపి (అజిత్‌ పవార్‌) ఎన్డీఏ తో ఉన్నారు. శివసేన (ఉద్దవ్‌ థాక్రే), ఎన్సిపి (శరద్‌ పవార్‌) ఇండియా కూటమితో ఉన్నారు. ఇండియా కూటమికే అంతో ఇంతో మెరుగుపడే అవకాశం ఉంది.

▪️పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సాలో బిజెపి బాగా మెరుగు పడి ప్రభంజనం సృష్టించే అవకాశం లేదు. ఎందుకంటే, ఇక్కడ బలమయిన ప్రాంతీయ పార్టీలున్నాయి. ప్రాంతీయ పార్టీలున్న చోటూ బిజెపి బలహీనంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో మొత్తం 63 సీట్లున్నాయి. 2019లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 22, ఒరిస్సాలో బిజు జనతాదళ్‌ 12 స్థానాలలో గెలుపొందాయి. రెండు రాష్ట్రాలలో బీజేపీ పొందిన సీట్లు 26. కాంగ్రెస్‌ కు దక్కింది 3. బలమయిన ప్రాంవతీయ పార్టీలున్నచోట బీజేపీ ఉన్న స్థానాలను కాపాడుకుంటే గొప్ప.

*పంజాబ్‌ 13, జమ్మూ కాశ్మీర్‌ 6, గోవా 2, మొత్తం 21 సీట్లలో 2019లో బీజేపీ 6, కాంగ్రెస్‌ 9, అప్పటి ఎన్డీఏ పక్షమైన శిరోమణి అకాలిదళ్‌ 2, యుపిఏ పక్షం జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 3, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సీటు గెలుపొందాయి. ఇప్పుడు బిజెపి తిరిగి 6 సీట్లు గెలుపొందాలి. సాధ్యమా?

*ఈశాన్య భారతంలోని 7 రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన అస్సాం 14 లోక్‌సభ స్థానాలున్నాయి. మిగతా ఆరు రాష్ట్రాల్లో పది లోక్‌ సభ స్థానాలు ఉన్నాయి. పక్కనే ఉన్న సిక్కింలో ఒక లోకసభ స్థానం ఉన్నాయి. మొత్తం 25 స్థానాలవుతాయి. 2019లో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 15 స్థానాలు సాధించింది. ఎన్డీఏ పక్షాలు మరో 5 గెలిచాయి. అంటే 25లో 20 స్థానాలు బిజెపి బుట్టలోఉన్నాయి. బీజేపీకి గాని, దాని మిత్రపక్షాలకు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఎక్కడ ఉంది.

*ఇక 6 కేంద్ర పాలిత రాష్ట్రాలైన లక్ష ద్వీప్‌, చండీగర్‌, పాండిచ్చేరి, అండమాన్‌ అండ్‌ నికోబార్‌, దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ, డామన్‌ డయూ లోగల 6 లోక్సభ స్థానాలున్నాయి. 2019లో బీజేపీకి 2, కాంగ్రెస్‌ కు ర2, ఇతరులకు 2 వచ్చాయి. ఇక్కడ కూడా బిజెపికి చేకూరే అదనపు ప్రయోజనం లేదు,

*2024 లో ఎవరు ఏర్పాటు చేస్తారనేది పెద్ద ప్రశ్న.దేశంలో బిజెపి చెబుతున్నంత సుభిక్షంగా లేదు. అన్నీ సమస్యలే. బిజెపి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నది. ఈ మైండ్ గేమ్ లో భాగంగా ప్రధాని మోదీ మొన్నతెలంగాణా సభల్లో మాట్లాడుతూ 400 సీట్లు వస్తున్నాయని చెబుతున్నారు. మీరొక చేయి వేయండని తెలంగాణ ప్రజలని కోరారు. పైన చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఇపుడున్న స్థానాలు నిలుపుకోవడమే బిజెపికి కష్టం. 400 స్థానాలు ఎలా వస్తాయి?


Tags:    

Similar News