కర్ణాటక ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేస్తారా? బీజేపీ డిమాండ్‌కు కారణమేంటి
విధాన సౌధలో కాంగ్రెస్ కార్యకర్తలు పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య సర్కారును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలు ఏం జరిగింది..
రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ విజయం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి విధానసౌధ లోపల కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారని బిజెపి ఆరోపించింది. రాజ్యసభ ఎన్నికలలో గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులలో నసీర్ హుస్సేన్ ఒకరు.
ప్రభుత్వాన్ని రద్దుచేయాలంటున్నబీజేపీ..
బిజెపి ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక నేతృత్వంలో పార్టీ నాయకులు 'రాజ్ భవన్ చలో' కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలపై గవర్నర్ గెహ్లాట్‌కు వివరించి అనంతరం వినతిపత్రం సమర్పించారు. అలాగే నసీర్ హుస్సేన్ మద్దతుదారుల చేసిన దేశ వ్యతిరేక నినాదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ లేదా ఇంటెలిజెన్స్ బ్యూరోతో విచారణ జరిపించి, దోషులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని, రాజ్యాంగ విలువలను పరిరక్షించలేని కాంగ్రెస్ సర్కారు రద్దుకు సిఫారసు చేయాలని అశోక డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ దర్యాప్తు నివేదికను తారుమారు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని అశోక విలేకరులతో అన్నారు.
ఎవరిని ఉపేక్షించం.. సీఎం సిద్దరామయ్య
కాగా ఇదే అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్నటి రోజున స్పందించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) నివేదికలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు ఉన్నాయని రుజువైతే, కఠిన చర్యలు తీసుకుంటామని, పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని కాపాడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు సీఎం సిద్ధరామయ్య.