రాజ్యంగ సంబరాలు సరే, రైతుకు చట్టబద్ధ హక్కులు ఎప్పుడు కల్పిస్తారు?
నవంబర్ 26- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం
భారత దేశ వ్యవసాయ రంగం లో రైతుల పేరుతో కొన్ని పథకాలు అమలు అవుతున్నప్పటికీ, అవి రైతులందరికీ చట్టబద్ధ హక్కుగా కాకుండా, ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి అమలవుతున్నాయి. పథకాల అమలుకు ప్రభుత్వాలు తమకు తోచినట్లు మార్గదర్శకాలు రూపొందిస్తున్నాయి. సరైన అంచనా లేకుండా అతి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కేటాయించిన బడ్జెట్ కూడా పూర్తిగా ఖర్చు పెట్టడం లేదు.
వ్యవసాయ కుటుంబాలు సుదీర్ఘ కాలం పాటు ఆర్ధిక సంక్షోభంలో కొనసాగడానికి అసలు కారణం, భారత రాజ్యాంగం పరిధిలో రైతులకు ఒక్క చట్ట బద్ధ హక్కూ లేకపోవడమే .
భారత స్వాతంత్ర్య 75 ఏళ్ల అమృతోత్సవాలు జరుపుకున్నా, రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు నిండినా ఇప్పటికీ దేశంలో ప్రధాన స్రవంతిగా ఉన్న గ్రామీణ జనాభా కోసమూ, ముఖ్యంగా రైతుల కోసమూ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా చట్టాలు రూపొందించాలని ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వమూ అనుకోలేదు. షెడ్యూల్ 7 ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉన్నా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు పూనుకోలేదు.
కేవలం మార్కెట్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఆదాయమూ, ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి సామాజిక భధ్రత అందుతున్నాయి. ఫలితంగానే, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రాలలో జాతీయ నమూనా సర్వే నివేదిక ప్రకారమే 93 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. చాలా చిన్న వయస్సులోనే గ్రామీణ రైతుల, కూలీల అనారోగ్య మరణాలు సంభవిస్తున్నాయి.
దేశ చట్ట సభలలో ఎంపి లు, ఎంఎల్‌ఏ లు సహా వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులకు వేతనాలు, అలవెన్సులు, సౌకర్యాలు కూడా చట్ట బద్ధంగా అందుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు , ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మికులకు వేజ్ బోర్డులు , వేతన కమీషన్ లు , పని స్థలంలో సౌకర్యాలు, రకరకాల అలవెన్స్ లు, కరువు భత్యం లాంటివి నిర్ధిష్ట కాల పరిమితిలో అమలు చేసేలా చట్టాలు, జీవో లు , నిబంధనలు ఉన్నాయి.
1947 లో దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చాక ప్రైవేట్ పారిశ్రామిక, సేవా రంగాలలో కూడా కార్మికులకు కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, పని గంటలు, సెలవులు, ప్రావిడెంట్ ఫండ్ , గ్రాట్యుటీ, బోనస్ లాంటివి కార్మిక చట్టాలలో హక్కులుగా కల్పించారు.
దేశంలో 100 కు పైగా ఉండే కార్మిక చట్టాలు రద్దయి,నాలుగు లేబర్ కోడ్ లు వచ్చాక, కార్మికులకు, ఉద్యోగులకు సంబంధించిన హక్కులు కూడా అమలు కావడం కష్టంగా మారిన మాట నిజమే అయినా , ఇప్పటికీ అవి అధికారికంగా రద్దు కాలేదు.
చివరికి, పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి , ఏదైనా పారిశ్రామిక సంస్థ ఆర్ధికంగా దివాళా ప్రకటించడానికి కూడా నిర్ధిష్ట చట్టాలున్నాయి. బ్యాంకులు,ఇతర ఆర్ధిక సంస్థలు తమ రుణాలను వసూలు చేసుకోవడానికి, లేదా మాఫీ చేయడానికి కూడా అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలు ఉన్నాయి.
కానీ గ్రామీణ ప్రజలకు మాత్రం సహజ వనరులపై హక్కులు ఇవ్వడానికి, , సుస్థిర జీవనోపాధి కల్పనకు, కుటుంబాల ఆదాయ భధ్రతకు , ఆరోగ్య పరిరక్షణకు ఎటువంటి చట్ట బద్ధ హామీ లేదు. రాజ్యాంగపు 5 వ షెడ్యూల్ లో ఆదివాసీ ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించినప్పటికీ, ఆ అధికారాల స్పూర్తితో అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం , 1/70 చట్టం , అటవీ సంరక్షణ చట్టం నియమాలు లాంటివి ఉనికిలోకి వచ్చినప్పటికీ, అవి ఆయా చట్టాల స్పూర్తి తో అమలు కావడం లేదు.
పైగా ఈ చట్టాలకు కొన్ని సవరణలు చేసి లేదా, ఆచరణలో తప్పుడు పద్ధతులు పాటించి, వాటి ప్రాణాలను తోడేస్తున్నారు. అడవిపై హక్కు ఆదివాసీలదే అని రాజ్యాంగం, చట్టాలు ఘోషిస్తున్నప్పటికీ, పోడు భూములకు అక్కడక్కడా పట్టా హక్కులు మాత్రమే గుర్తిస్తూ, అడవిపై, అటవీ వనరులపై ఆదివాసీ ప్రజలకు ఇవ్వాల్సిన సాముదాయక హక్కులు మాత్రం అసలు కల్పించడం లేదు. ఈ పరిస్థితి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ రాష్ట్రాలలో చాలా ఎక్కువగా ఉంది.
కనీసం ప్రభుత్వ సేవలు గ్రామీణ ప్రజలకు నిర్ధిష్ట సమయంలో అందించేలా “ సిటిజెన్ రైట్స్ “ హక్కు కల్పిస్తూ ఇప్పటివరకూ చట్టమే లేదు. ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలు గ్రామీణ ప్రజలకు ఇటువంటి హక్కులు కల్పిస్తామని హామీలు ఇస్తాయి కానీ అమలుకు రావు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అటువంటి హామీ ఇచ్చినప్పటికీ, ఆచరణలో ఒక్క అడుగూ పడలేదు.
ఇప్పటికీ గ్రామీణ ప్రజలు ప్రభుత్వాల , అధికారుల దయ కోసం, పథకాల అమలు కోసం భిక్షగాళ్లుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఆర్ధిక, సామాజిక భధ్రత కు సంబంధించిన అంశాలలో ఇది ఎక్కువ జరుగుతున్నది.
గ్రామీణ ప్రజలకు, రైతులకు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలను అధికారం లోకి వచ్చాక అమలు చేయకుండా సంవత్సరాల పాటు కాల యాపన చేయవచ్చు. అయినా ప్రజలు న్యాయాన్ని కోరుతూ, హామీలను అమలు చేయాలని కోరుతూ,జీవో మార్గదర్శకాల ప్రకారం పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని కోరుతూ కోర్టుకు కూడా వెళ్ళలేరు. వీటికి సంబంధించి గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఒక్క చట్టబద్ధ హక్కు కూడా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఉదాహరణకు తెలంగాణ లో గత రెండేళ్లుగా , ఒక్క పేద కుటుంబానికి కూడా సామాజిక భద్రత పెన్షన్ కొత్తగా అందలేదు. గత నాలుగేళ్లుగా పేద కుటుంబాలకు ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తది అందలేదు.
వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుందామన్న గ్రామీణ కుటుంబానికి సాగు భూమి హక్కుగా అందడం లేదు . దేశంలో మొత్తం సాగు భూములను జాతీయం చేయాలన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ప్రతిపాదనను అప్పటి రాజకీయ వ్యవస్థ ఆమోదించి ఉంటే , వ్యవసాయాన్ని వృత్తి గా ఎంచుకుందామనుకున్న కుటుంబాలకు సాగు భూమి అందుబాటులో ఉండేది. కానీ అది జరగలేదు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 1973 భూ గరిష్ట పరిమితి చట్టం లాంటివి ఉనికిలో ఉన్నప్పటికీ అవి అమలు కావడం లేదు. ఆ చట్టం అమలైతే, నీటి పారుదల సౌకర్యాలు పెరిగిన కొద్దీ, మిగులు భూములు బయట పడి ప్రభుత్వాలు పూనుకుంటే, ఆ మిగులు భూములు భూమి లేని పేద కుటుంబాలకు హక్కుగా దక్కేవి. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందన్న రాజ్యాంగ ఆదేశిక స్పూర్తిని ఈ ప్రభుత్వాలు పాటించడం లేదు కనుక , ఈ భూ గరిష్ట పరిమితి చట్టం కూడా అమలు కావడం లేదు.
పంటల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనం, చౌక ధరలకు రైతుకు హక్కుగా లభించదు . వ్యాపారులు ,కంపెనీలు అమ్మే కల్తీ విత్తనాలు రైతులను దెబ్బ తీస్తే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం రైతులు వినియోదారుల ఫోరంలో ఫిర్యాదు చేసుకోవాలి. ఆ ఫోరం ధగ్గరకు వెళ్ళే రైతుల సంఖ్య అతి తక్కువ. ఒక వేళ వెళ్ళి అక్కడ రైతు గెలిచినా, రైతుకు అందే పరిహారం రైతు ఫోరం చుట్టూ తిరగడానికి అయ్యే ఖర్చుకు కూడా సరిపోదు. రాష్ట్ర స్థాయిలో విత్తనం చుట్టూ ఉండే అన్ని రకాల సమస్యలను పట్టించుకునే విత్తన చట్టమే లేదు. ఇప్పుడు అమలులో ఉన్న విత్తన చట్టం కూడా ఎప్పుడో ప్రభుత్వ వ్యవసాయ శాఖలు, విశ్వ విద్యాలయాలు మాత్రమే రైతులకు విత్తనాలు అందిస్తున్న కాలంలో వచ్చింది. ప్రతస్థుతం మొత్తం విత్తన వ్యవస్థ ప్రైవేట్ కంపనీల చేతుల్లోకి పోయిన దశలో , రాష్ట్ర కొత్త విత్తన చట్టం రైతులకు అనుకూలంగా తీసుకు రావాలన్న స్పృహ ఇప్పటి ప్రభుత్వాలకు ఉండడం లేదు.
వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి బ్యాంకుల నుండీ పంట రుణం రూపంలో సాగు చేసే రైతుకు తప్పకుండా అందాలన్న చట్టమే లేదు . ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తిగా బ్యాంకు మేనేజర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి నడుస్తున్నది. రాష్ట్ర స్థాయిలో ఎస్‌ఎల్‌బిసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకటించినా దానికి చట్ట బద్ధత లేదు. కేవలం అదొక మార్గదర్శకం మాత్రమే. నిజానికి బ్యాంకులు క్షేత్ర పరిశీలన చేసి రైతు పొలంలో ఏ పంట వేశారో చూసి ఆ పంటకు రుణం ఇవ్వాలి. ఈ మేరకు బ్యాంకులు రైతు నుండీ నిర్దిష్ట ఫీజు కూడా వసూలు చేస్తాయి. కానీ ప్రస్తుతం బ్యాంకులు ,క్షేత్ర పరిశీలన చేయకుండానే కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగా భూమి యజమానులకు పంట రుణాలు ఇస్తున్నాయి. వాస్తవ సాగు దారులకు పంట రుణాలు ఇవ్వడం లేదు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంటలు నష్ట పోయినప్పుడు, అధికారులు వెంటనే నష్టం అంచనా వేసి రైతుకు ఇన్ పుట్ సబ్సిడీ తప్పకుండా అందించాలన్న చట్టం లేదు . రాష్ట్ర ప్రభుత్వం “దయ తలచి” , నష్ట పోయిన రైతుల వివరాలు సేకరించి, కేంద్రానికి ఉత్తరం రాసి, కేంద్రం మంజూరు చేసిన పరిహారం రైతుకు ఇవ్వాలనుకుంటే ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకోకపోతే అది కూడా అందదు.
కోర్టుకు వెళ్ళి రైతులకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నా అమలు చేస్తుందన్న గ్యారంటీ లేదు . కోర్టు తీర్పు అమలు చేయకపోతే ప్రభుత్వ పెద్దలకు పడే శిక్ష కూడా లేదు. 2020 లో రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర హై కోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో వచ్చిన హైకోర్టు తీర్పు అమలు కాకపోవడం ఇందుకో పెద్ద ఉదాహరణ.
పంటల బీమా పథకాలు ప్రభుత్వాల ఇష్టాఇష్టాల మీద ఆధారపడి నడుస్తున్నాయి. అసలు అమలు చేయకపోయినా రైతులు అడగడానికి చట్టపరమైన మద్ధతు లేదు.
రైతులు పండించిన పంటలకు కేంద్రం ప్రకటించే కనీస మద్ధతు ధరలకు కూడా చట్ట బద్ధత లేదు . అందుకే కేంద్రం పంటలను సేకరించిన సందర్భంలో తప్ప రైతులకు ఎంఎస్‌పి అందడం లేదు. వ్యాపారులు ఎంఎస్‌పి ఇవ్వకపోయినా, రైతులు కోర్టుకు వెళ్ళే హక్కు లేదు.
ఇక వ్యవసాయ రంగంలో వడ్డీ రాయితీ , విత్తన సబ్సిడీ , యంత్రీకరణ , రైతు భరోసా , విద్యుత్ సబ్సిడీ లాంటి పథకాలను ప్రభుత్వాలు మధ్యలోనే ఆపేసినా , రైతులు నిలదీసి అడగడానికి లేదు. ప్రభుత్వాలు తమకు తోచిన విధంగా రూపొందించే జీవో లు, మార్గదర్శకాలు ప్రాతిపదికగా ఇవి అమలవుతాయి. రైతులకు హామీ ఇచ్చిన విధంగా పథకాలు కొనసాగించాలనీ, వాస్తవ సాగు దారులకు మాత్రమే ఏ ప్రభుత్వ సహాయమైనా అందించాలనీ ప్రభుత్వానికి ఆదేశమిచ్చే నిర్ధిష్ట చట్టమేదీ లేకపోవడమే ఇందుకు కారణం .
గ్రామీణ ప్రజల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా కొన్ని చట్టాలు ఉనికి లోకి వచ్చినప్పటికీ , ప్రభుత్వాలు వాటి స్పూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. గ్రామీణ పేదలకు సాగు భూమి అందిస్తామన్న హామీతో తెచ్చిన భూ సంస్కరణల చట్టాన్ని దశాబ్ధాలు గడిచినా అమలు చేయడం లేదు. ఈ చట్టం అమలు కోరుతూ భూమి లేని పేదలు కోర్టు మెట్లు ఎక్కలేరు. భూమి లేని పేదల పక్షాన ఎవరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినా ఎప్పటికి తీర్పు వెలువడుతుందో ఎవరూ చెప్పలేరు.2006 లో అమలులోకి వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని, స్వంత భూమి లేక కౌలు వ్యవసాయం చేసుకుంటున్న కౌలు రైతులను గుర్తించడానికి 1956 లో, 2011 లో తెచ్చిన చట్టాలను కూడా ఎలా అమలు చేయకుండా పక్కన పెట్టేశారో ప్రత్యక్షంగా చూస్తున్నాం.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం , 2013 భూ సేకరణ చట్టాల అమలు తీరు కూడా అంతే లోప భూయిష్టంగా ఉంది.
ఈ చట్టాలను రూపొందించినప్పుడే వాటిలో ఉన్న బలహీనతలు, లోపాలతో పాటు, అమలు చేయడానికి పాలకులలో లోపించిన రాజకీయ చిత్థశుద్ధి , అధికారుల అలసత్వం, అవినీతి కారణంగా కొన్ని చట్టాలు ఉన్నా లేనట్లే తయారైంది .
రాజ్యాంగం ముందు అందరూ సమానమే అని చెప్పే మాటలు వినడానికి బాగానే ఉన్నా, గ్రామీణ ప్రజలు అతి తక్కువ సమానమని ఆచరణలో కనపడుతుంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పాడాలంటే, వారికి ఉత్పత్తులు, పథకాలు, సేవలు అన్నీ చట్టబద్ధ హక్కుగా అందాలి.
ఈ లక్ష్యంతో కొన్ని చట్టాలు కేంద్ర స్థాయిలో రూపొందించినా, ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుని ఈ చట్టాలను రూపొందించాలి. అన్ని ప్రభుత్వ సేవలూ రైతులకు నిర్ధిష్ట కాల పరిమితిలో అందేలా ‘సిటిజెన్స్ రైట్’ చట్టాన్ని కూడా ఆమోదించాలి. గ్రామీణ కుటుంబాల సాంఘిక బధ్రతకు కూడా చట్టబద్ధత కల్పించాలి.
చట్టాల రూపకల్పనలో రైతులను, రైతు సంఘాలను భాగస్వాములను చేయాలి. ఈ చట్టాలకు విస్తృత ప్రచారం కల్పించాలి. భారత వ్యవసాయం కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతున్న దశలో రైతులకు చట్టబద్ధ హక్కులు లేకుండా మనుగడ సాగించడం చాలా కష్టం.