యువతకు 30 ఏళ్ళు అయినా పెళ్ళిళ్ళు కావటం లేదు, ఎందుకు?

దేశంలో ఆర్థిక అభివృద్ధిలో యువజనులకు చోటు లేకుండా పోతున్నదంటున్నరు ప్రముఖ రచయిత;

Update: 2025-01-23 08:18 GMT

-డా. కత్తి పద్మారావు

భారతదేశంలో ఈనాడు 140 కోట్ల మందిలోను సుమారు 50 కోట్ల మంది యువకులే వుండడం మనకు గర్వకారణం. అయితే వీరికి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల చేతిలో వుంది. కాని పాలక వర్గాలు యువత మీద దృష్టి పెట్టకుండా ఆశ్రితులైన వారికి ఎక్కువగా ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ యువత శక్తిని, సామర్థ్యాన్ని, ప్రతిభను, నైపుణ్యాన్ని, నవ్యతను దెబ్బతీస్తున్నారన్నది మనకు అవగతమవుతున్న విషయం. ముఖ్యంగా ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గం, ఆశ్రిత మేధావి వర్గం, ఆశ్రిత మీడియా వర్గం, వీరి అనుచిత ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గొడుగులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అనుకూల పెట్టుబడిదారి కార్పోరేట్‌ వర్గం ప్రభుత్వ బ్యాంకులను కొల్లగొట్టడం వలన యువతకు, వారి ప్రతిభకు ఆర్థిక వెసులుబాటు కలిగించే లఘుపరిశ్రమలు రూపొందించలేకపోతున్నాయి.

నిజానికి ప్రభుత్వానికి చెల్లించే ప్రత్యక్ష, పరోక్ష పన్నులను తమకు అనుకూలంగా మార్చుకోవటం, తరువాత ఎగవేయటం, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ఆర్థిక ప్యాకేజీల పేరు మీదుగా కొత్తగా మరికొంత సబ్సిడీలను, టాక్స్‌ హాలిడేలను పొందటం గత ఏడాదిలో వారు 5 లక్షల కోట్లు లాభం పొందినట్లు పత్రికలు రాశాయి. భారతదేశంలాంటి దేశాల్లో ప్రభుత్వరంగ సంస్థల ద్వారా జరిగిన పరిశోధన ఫలాలను దొంగిలించటం లేక ఆ సంస్థల అధిపతులను ప్యాకేజీల పేరుతో తీసుకోవటం, తద్వారా రూపాయల ఖర్చుతో ఏర్పడిన ఫలితాలను ఒకమొత్తంగా ఒకరు ఇద్దరు మాత్రమే పొంది లాభపడటం మనదేశంలో ప్రభుత్వ రంగంలో జరిగిన పెట్రోలు, గ్యాస్‌, మందులు, డిఫెన్స్‌, స్పెక్ట్రమ్‌ వంటి పరిశోధనల ఫలాలు సునాయాసంగా దక్కించుకొని మొత్తం లాభాలను ఒకరు ఇద్దరు మాత్రమే అనుభవించటం మనకు తెలుసు.

ఇకపోతే భారతదేశాన్ని లూటీ చేసేవారికేమో ఎక్కువ సంపద వెళుతుంది. భారతదేశంలో యువత బి.ఏ.లు, బి.టిక్‌లు చదివిన వారు కూడా ఉపాధి హామీ పథకంలోని గ్రామీణ జీవన విధానంలో దినసరి కూలీలుగా మారిపోవడం చూస్తున్నాం. నిజానికి బ్యాంకులు వీరికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవటానికి కూడా వీరికి లోన్లు ఇవ్వటం లేదు. వీరు ఆన్‌లైన్‌ యాప్‌లలో లోన్లలకు అలవాటు పడుతున్నారు. జీవన సంక్షోభానికి గురి అవుతున్నారు. వివాహాలు కావడం లేదు. గ్రామంలో జీవించే పరిస్థితులు వీరికి మృగ్యమై జీవన సంక్షోభంలోకి వెళుతున్నారు. జీవితంలో ఉద్యోగం లేక, ఉపాధి లేక, ఆర్థిక ఆసరా లేక నిర్వేధానికి గురై, నిద్రాణతకు గురై, దురలవాట్లకు, వ్యసనాలకు లోనవుతున్నారు. ఇటువంటి వారు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కోవడానికి సంబంధించిన రుణ యాప్‌ల దోపిడీ గురించి సామాజిక విశ్లేషకులు ఇలా చెపుతున్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో రుణయాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని అధికారిక, చట్టబద్ధమైన యాప్‌లు ఉంటే... మరికొన్నింటిని అనధికారిక, మోసపూరిత యాప్‌లుగా గుర్తించారు. మూడు, నాలుగేళ్లుగా ఈ అక్రమ యాప్‌లు పెద్ద యెత్తున వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు, పత్రాలతో పెద్దగా పనిలేకుండా క్షణాల్లో రుణాలు ఇస్తుండటంతో ఈ అనధికారిక యాప్‌ల వలలో చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా యువత పెద్దసంఖ్యలో వీటికి ఆకర్షితులవుతున్నారు.

అప్పులపై పలు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అధిక వార్షిక వడ్డీరేట్లు (18-40 శాతం) విధిస్తూ, భారీగా రుసుములను వసూలు చేస్తున్నాయి. తిరిగి డబ్బులు వసూలు చేసేటప్పుడేమో రుణ గ్రహీతల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో రుణయాప్‌ల వేధింపులకు తాళలేక ఎంతో మంది బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు రుణయాప్‌ల మాటున మోసపూరిత, చట్టవిరుద్ధ కార్యకలాపాలూ పేట్రేగిపోతున్నాయి. కొన్ని అక్రమ రుణయాప్‌ల డేటా చౌర్యానికి పాల్పడటం ద్వారా వినియోగదారులకు తీవ్ర ఆర్థిక నష్టాలను కలిగిస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే కార్య కలాపాలకూ అవి తెగబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో అనధికారిక, మోసపూరిత రుణయాప్‌ల ఆగడాలను అరికట్టి రుణగ్రహీతలకు రక్షణ కల్పించేందుకు రిజర్వు బ్యాంకు 2021లో ఒక వర్కింగ్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2022 సెప్టెంబర్‌లో రిజర్వు బ్యాంకు డిజిటల్‌ రుణాలపై సమగ్ర మార్గదర్శకాలను జారీచేసింది. డిజిటల్‌ రుణ దాతలు ఇచ్చే అప్పులపై వసూలుచేసే వార్షిక వడ్డీరేట్లు, ఇతరత్రా రుసుముల వివరాలన్నీ పారదర్శకంగా రుణ గ్రహీతలకు తెలియజేయాలని నిర్దేశించింది. అంతే కాకుండా, రుణ మొత్తాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలనీ, రుణగ్రహీతల సమాచారాన్ని అధికారిక సర్వర్లలోనే భద్రపరచాలనీ రిజర్వు బ్యాంకు సూచించింది.

అక్రమ డిజిటల్‌ రుణ కార్యకలాపాల నిరోధానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్న కమిటీ సిపార్సును ఇప్పుడు ప్రభుత్వం అమలుచేస్తోంది. నిజానికి ప్రభుత్వం ఎందులో లోన్లు ఇవ్వలేదు. బ్యాంకులు ధనవంతుల ఇళ్ళ వెంట తిరిగి, వారికి లోన్లు ఇచ్చి, వారు లోన్లు ఎలా ఎగరవేయ్యాలో వారికి వీరు బోధించి, వారి దగ్గర నుంచి ఆ ధనంలో భాగస్వామ్యం పొందుతున్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో బహుళజాతి సంస్థలు విజృంభిస్తున్నాయి. ఇండియాలో ప్రధాన బహుళజాతి సంస్థలు ` 2005 భారతదేశంలో దాని విలువ రూ. కోట్లలో 1.సుజికి 13866.80, 2.ఐటిసి 13101.98, 3.హ్యూండాయ్‌ 7867.72, 4.హోల్సిమ్‌ 7705.45, 5.లీవర్‌ 4959.58, 6.హోండా 3007.93, 7.గ్లాక్సో 2527.61, 8.బోష్‌ 2266.28, 9.ఫిలిప్స్‌ 1544.20, 10.ఎబిబి 1255.24.. నిజానికి భారతదేశం స్వాతంత్య్రం వచ్చాక కార్పోరేట్‌ చేతుల్లో నలిగిపోతుంది.

దానికి కారణం కార్పోరేట్లు కులతత్వాన్ని పాటిస్తున్నాయి. ఏ సంస్థ ఏ కులం నుంచి ఏ వర్ణం నుంచి ఆవిర్భవించిందో అంతర్గతంగా ఆ కులాల వారికే ఎక్కువ ప్రాధాన్యత వుంది. అందువల్ల దళితులకు, గిరిజనులకు ఎంత ప్రతిభ వున్న ఈ కార్పోరేట్‌ వ్యవస్థల్లో ఉద్యోగ వసతి ఒక్క శాతమే వుంది. అంతర్గతంగా అస్పృశ్యతని పాటించడమే. నిజానికి ప్రవేటు, కార్పోరేట్‌ నిర్మాణ వ్యవస్థలంతా కూడా రిజర్వేషన్లు పొందే కులాల వారిపై ద్వేషంతో వుంటున్నాయి. వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మార్వాడీ, భూస్వామ్య అగ్రకులాల వారికే ప్రతిభ పేరుతో ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే దళిత, బలహీన వర్గాల్లో నైరాస్యత పెరుగుతుంది. మేము ఎంత చదువుకున్న మాకు వ్యాపార, వాణిజ్య, భవన నిర్మాణ, వస్తు నిర్మాణ రంగాల్లో చొరబాటు దొరకటం లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది.

మరో ప్రక్క వ్యవసాయం యంత్ర పరికరాలతో నిండిపోతున్న తరుణంలో నాటు, కోత, కుప్పనూర్పిడు కూడా యంత్రాలతో చేస్తూ దళితుల వ్యవసాయ కూలీ వ్యవస్థను కుప్పకూలుస్తున్నారు. దళిత స్త్రీలకు ఇప్పుడు గ్రామాల్లో పనిలేదు. ఇంటర్మీడియట్‌, బి.ఏ., ఎం.ఏ.లు చదివిన దళిత యువత కూడా రొయ్యలు వొలవడానికి, క్వారీల్లో పనిచేయడానికి, భవన నిర్మాణానికి, రాళ్ళు ఎత్తే వారిగా వెళుతున్నారు. యువతలకు 30 ఏళ్ళు అయినా పెళ్ళిళ్ళు కావటం లేదు. ఒకవేళ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కలిగినా, భర్త త్రాగుబోతు అవ్వటం వలన భర్త పెట్టే హింస వలన, పిల్లల్ని పట్టుకొని ఒంటిరిగా వుంటున్నారు. వారికి విద్య చెప్పించలేక, సరైనా ఆహారం పెట్టలేక జీవన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బ్యాంకుల్లో లోనులకు వెళితే ఈ స్త్రీలను అపహాస్యంగా చూస్తున్నారు.

నిజానికి ఈ ఒంటిరిగా వున్న స్త్రీలకు ఏ విధమైన పెన్షన్‌లు లేవు. అటు భర్తతో విడాకులు పొందలేక, ఇటు రెండవ వివాహం చేసుకోలేక, చేస్తున్న పనిమీద దృష్టి పెట్టలేక సతమతమవుతున్నారు. బ్యాంకులు ఎందుకు లోన్లు ఇవ్వరో వీరికి అర్థం కావటంలేదు. వీరే ఎక్కువగా అసూయత్వానికి గురి అవుతున్నారు. నిజానికి లైంగిక వేధింపులకు గురవుతున్న స్త్రీలలో భర్త వదిలిపెట్టిన స్త్రీలే ఎక్కువగా వున్నారు. సామాజిక విశ్లేషకులు ఆర్థిక వెసులుబాటును కలిగించడమే కాకుండా ఇరువై ఏళ్ళ నుండి ఇరువై ఐదు ఏళ్ళ మధ్య వున్న స్త్రీల జీవితాన్ని, శీలాన్ని జీవన భద్రతను రక్షించలేకపోతున్నారని ఆందోళన చెందుతున్నారు.

మహిళల గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించే మాటలేవైనా లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కేరళ హైకోర్టు తాజాగా తేల్చిచెప్పింది. ముంబైలోని సెషన్స్‌ కోర్టు సైతం గతంలో ఇలాంటి మేలిమి తీర్పునే వెలువరించింది. ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం, 2022లో మహిళలపై నేరాలకు సంబంధించి 4.45 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 19శాతం స్త్రీల గౌరవ మర్యాదలకు విఘాతం కలిగించినవే. ప్రజలకు మార్గదర్శకులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ నాయకులూ స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటం క్షమార్హం కాదు స్త్రీని ఆదిపరాశక్తిగా భావించి ఆరాధించే భారతావనిలో మహిళలపై గంటకు దాదాపు 51 అకృత్యాలు జరుగుతున్నాయి. చేవచచ్చిన వ్యవస్థ సాక్షిగా రోజుకు 86 అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి.

దేశీయంగా పని ప్రదేశాల్లో స్త్రీలపై లైంగిక వేధింపులకు సంబంధించి అధికారికంగా ఏటా నాలుగు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉంటాయి. ఆ దాష్టీకాలకు తాళలేక అపార ప్రతిభ ఉన్నా ఎంతోమంది మహిళలు ఉద్యోగాలకు దూరమై ఇళ్లకు పరిమితమవుతున్నారు. తాము చవిచూసిన చేదు అనుభవాలను వెల్లడిస్తూ న్యాయంకోసం నిరుడు మహిళా రెజ్లర్లు రోడ్డెక్కడం క్రీడారంగంలోనూ వెర్రితలలు వేస్తున్న విష సంస్కృతిని కళ్లకు కట్టింది. ఓ ప్రొఫెసర్‌ వికృత చర్యలపై హరియాణాలోని చౌదరీ దేవీలాల్‌ వర్సిటీ విద్యార్థినులు నిరుడు గవర్నర్‌, సీఎం, జాతీయ మహిళా కమిషన్‌కు మొర పెట్టుకున్నారు. ఇలా ఎక్కడి కక్కడ పాఠశాలలూ కళాశాలల్లోనూ తిష్ఠవేసి ఆడపిల్లలను కాల్చుకు తింటున్నారు.

సామాజిక మాధ్యమాలూ స్త్రీల వ్యక్తిత్వహననానికి వేదికలవుతున్నాయి. మహిళలపై మానసిక, శారీరక దాడులకు పురిగొల్పుతున్న లింగ వివక్ష యావద్దేశానికీ తలవంపులు తెస్తోంది! దళితుల్లో విద్యాభ్యాసం చేసిన యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి. ప్రభుత్వాలు ఎంతకు భారతదేశాన్ని భారతదేశంలో వున్న స్థలాలను, మైదానాలను, పొలాలను అనేక కార్పోరేట్‌ కంపెనీలకు తాకట్టు పెట్టి వేలాది ఉద్యోగాలు వస్తున్నాయనీ మెప్పించే ప్రకటనలో యువతకు ఏ మేలు లేదు. మేము ఇంజనీరింగ్‌ వ్యవస్థను ఎంతో అభివృద్ధి చేస్తున్నాం అనేది పెద్ద బూటక విషయం.

నిజానికి 1990-91 నుండి 1999-2000 కాలంలో దానికి ముందు 1983 ` 84 ప్రాంతంలోను వచ్చిన మార్పులను పరిశీలిద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో 4.57 పట్టణ ప్రాంతాల్లో 8.18 శాతం తగ్గింది. మొత్తంగా 5.57 శాతం మంది పేరట నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టాక పేదరికం నుండి బయటపడ్డారు. అదే విధానాలు ప్రవేశపెట్టక మునుపు 7 ఏళ్ళకాలంలో 8.88 శాతం గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో 2.89 శాతం మొత్తంగా దేశంలో 7.51 శాతం మంది పేదలు పేదరికం నుండి విముక్తులయ్యారు. అంటే ఏడాదికి కనీసం ఒక శాతం మంది పేదలుయీ ఆపద నుండి బయటపడితే నూతన ఆర్థిక విధానాల తరువాత ఒక శాతం కంటే తక్కువ వుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గిన తీరు చాలా మెల్లిగా జరిగినట్లు అర్థమవుతుంది.

ఈ కాల నిర్ణయంలోను పేదరిక నిర్ధారణకు ఉపయోగించిన గణాంక వివరాల శాస్త్రీయతపై వివాదాలు కొనసాగినప్పటికీ, ప్రభుత్వాలు నూతన ఆర్థిక విధానాల ద్వారా దేశంలో అభివృద్ధిని, పేదరికాన్ని పారద్రోలుతామనే నినాదంలోని డొల్లతనం మనకు యిపుడు అర్ధం అవుతోంది. అప్పులు చేయటం అవసరాన్నిబట్టి అందరికీ కావాలి. దేశాల మధ్య సంబంధాలు పెరిగిన కొద్దీ ఒకరి అవసరాలు యింకొకరు తీర్చే ఒప్పందాలు. అందుకు కావలసిన వనరుల సమీకరణ జరుగుతూనే వుంది. ఒక దేశంలో వనరులున్నప్పటికీ సరైన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి, నైపుణ్యం లేనపుడు వాటిని విదేశాలనుండి అప్పు తెచ్చుకొని జాగ్రత్తగా వాటిని వినియోగించి ఉత్పత్తిని పెంచి అందులోని మిగులు ద్వారా అప్పులు తీర్చేయటమన్నది అందరికీ సమ్మతమైన పద్ధతి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో యీ రుణాలను పొందటం పరిపాటే. గాని అవసరం వున్నా లేకున్నా అప్పులు చేయటం మంచిది కాదు.

1989లో సంక్షోభానికి ముందు భారతదేశం విదేశీ అప్పులు రు. 84,492 కోట్ల రూపాయలు. రెండేళ్ళలో అది 1991 నాటికి రెండిరతలయింది. ముఖ్యంగా యీ అప్పులు పలురకాలుగా తెచ్చినవే అధికం. ఐ.ఎమ్‌.ఎఫ్‌. నుండి తెచ్చింది తక్కువ. నిజానికి విదేశీ మారక సమస్య అని చెప్పి ఐ.ఎమ్‌.ఎఫ్‌. చెప్పిన షరతులకు లోబడి తెచ్చిన అప్పు భారతదేశం వంటి దేశానికి పెద్ద లెక్క కాదు అనటానికి పైన యిచ్చిన గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. నిజానికి ఐ.ఎమ్‌.ఎఫ్‌. అప్పు పదేళ్ళలో తీర్చేసి మళ్ళీ అవసరమున్నపుడు తెచ్చుకొని యిప్పుడు పూర్తిగా ఐ.ఎం.ఎఫ్‌. రుణ విముక్తుల మయ్యాం. ఒక బిలియన్‌ అంటే 100 కోట్లు జనాభా వున్న దేశానికి రెండు బిలియన్‌ డాలర్ల అప్పు ప్రధాన సమస్య కాదు. ఆ అప్పు పేరు చెప్పి దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చే విధానాలను అప్పుగా తెచ్చుకోవటమే అసలైన సమస్య.

1989లో జాతీయాదాయంలో విదేశీ అప్పులు 24.20 శాతం వుంది. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలక వర్గాలు దేశీయ యువతమీద అందునా దళిత, గిరిజన యువత మీద ద్వేషపూరితంగా కులతత్వ పూరితంగా వ్యవహరిస్తున్నారనేది నిస్టూర సత్యం. నిజానికి ఈ పరిస్థితుల్లో కేంద్ర పాలక వర్గాలు దేశీయ యువత ప్రతిభను దెబ్బతీయటం అంటే దేశీయ సంపద సృష్టిని, దేశీయ ఎగుమతులను, దేశీయ ఆర్థిక అంతర్గత శక్తిని దెబ్బతియటమే అని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే డా బిఆర్‌ అంబేడ్కర్‌ 1929 డిసెంబర్‌ 28న దార్వాడ్‌లో చేసిన ఉపన్యాసాన్ని విందాం. మనది మానవ హక్కుల కోసం సాగుతున్న పోరాటం.

అందుకు సత్యాగ్రహం చేయాల్సిరావచ్చు. అదే ఆఖరు అస్త్రం. మన స్వంత దేశీయులకు, విదేశీయులకు వ్యతిరేకంగా సత్యాగ్రహం. ఆ రెండు వర్గాల నుండి ఎదురయ్యే ప్రతిఘటనలను ఎదుర్కొనేందుకు మనం ఎన్నో వ్యూహాలు రచించుకోవాలి. కౌరవులు, పాండవుల మధ్య అంత ఘోరమైన యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? అది కేవలం రాజ్యం కోసమే. అంటరానితనం కొనసాగుతూనే పోతే అది మొత్తం భారతీయ సమాజ పురోగమనాన్ని కుంటుపరుస్తుంది. కాని మనం మన స్థాయిని మెరుగుపర్చుకోవాలి. మన హక్కుల కోసం పోరాడాలి. అగ్రవర్ణస్థుల్లోని ఛాందసత్వం అలాగే ఉంటుంది. అది మనం పొమ్మంటే పోదు.

చివరగా, మీరు స్వావలంబన మార్గాన్ని అనుసరించాలవి సలహా ఇస్తున్నాను. ప్రస్తుత మీ పరాధీన బతుకుల గురించి, కొద్దిపాటి హక్కుల ఉత్తుత్తి గర్వం గురించీ నేను చెప్పేదేమీ లేదు. ఈ మహర్వతన్‌, దాని ఉత్తుత్తి గర్వం మిమ్మల్ని ఎంతగా పరాధీనుల్ని చేశాయో మీకు తెలుసా? ఈ మహర్వతన మహర్లను గ్రామాల్లో బందీలను చేసింది. మహర్‌ అనగా ప్రభుత్వ బిచ్చగాడు అని అర్థం. ఈ మహర్‌వతన్‌ మూలంగా అన్ని గ్రామాల్లో అలాంటి బిచ్చగాళ్ళు తయారయ్యారు. మహర్లను క్రియాశూన్యుల్ని చేసే మహర్‌ వతన్లపైన వారు ఆధారపడకూడదు. దానినుండి బయటపడేందుకు వారు శక్తిమేరకు పోరాటం చేయాలి.

తమ స్వంత బలం మీద వీలయినంత చదువుల సారాన్ని గ్రహించాలి. ఏ కొద్దిమంది మంచి మనుషులో తప్ప ఇంకెవరూ వారికి సహాయపడరు. అంబేడ్కర్‌ ఆ రోజు చెప్పిన ఆలోచనను ఈనాటి ప్రభుత్వాలు ఆచరించకపోయినట్లైయితే భారతదేశంలో కుల, ఆర్థిక సంక్షోభంలో కుల వివక్షపూరితమైన, స్త్రీ అణచివేతపూరితమైన దేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేడ్కర్‌ ఆలోచనలను రాజ్యాంగ బద్ధంగా అనుసరించి దేశ ప్రగతికి పట్టం కట్టవలసిన చారిత్రక సందర్భం ఇది. మనమందరం డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ మార్గంలో నడుద్దాం.

Tags:    

Similar News