తీన్మార్ మల్లన్న గురించి బిసిలు ఏమనుకుంటున్నారు?
తీన్మార్ మల్లన్న స్థాపించిన 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' బిసిలలో చర్చనీయాంశమయింది. ఎందుకు చర్చనీయాంశం అంటే...
-బత్తుల సిద్దేశ్వర పటేల్, బీసీ ఆజాది
తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిన నేపథ్యంలో గతంలో కంటే తనపై విమర్శల దాడి పెరుగుతుంది. అందులో ప్రధానంగా 1) అతడిపై బ్లాక్ మెయిలర్ అనే ముద్ర 2) ఎవరిని లెక్కచేయడని 3) ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోతాడని 4) bjp పార్టీతో జట్టు కడుతాడని 5) నిలకడ లేని వాడని 6) అనుభవం లేని వాడని 7) పార్టీ పేరులో బీసీ పదం పెట్టుకోలేదని 8) డబ్బున్నోడికే పెద్ వేస్తాడని...రకరకాల ఆరోపణలు, సందేహాలు, అసంతృప్తులు...
బీసీ చిరకాల వాంఛ బీసీ రాజకీయ పార్టీ. నేను ఉద్యమ జీవితం ప్రారంభించిన నాటి నుండి బీసీ పార్టీ ఏర్పాటు కోరుకుంటూ వస్తున్న వాడిని. బీసీ నాయకత్వంలో వున్నా,కొన్ని విప్లవ బీసీ పార్టీలను చూసిన. స్వయంగా వీరన్న ఏర్పాటు చేసిన విప్లవ పార్టీలో పని చేసిన.
నాటి నుండి నేటి వరకు బీసీ ఉద్యమకారుల మీద జరిగే అణచివేతను చూస్తూ...అనుభవిస్తూ వస్తున్న వాడిని. విప్లవోద్యమంలోనే ఒక బీసీ బతికుంటే ఆరోపణలు, మరణిస్తే అమరుడు. ఈ రెండు కాకుంటే ఇన్ఫర్మార్. అదే అగ్రకులం వ్యక్తులు ఉద్యమం నుండి దూరమైనా వీర విప్లవ కారుడే, ఇక చనిపోతే గొప్ప అమరవీరుడు.
జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు కూర రాజన్న ఒక తెలంగాణ బెస్త బిడ్డ. ప్రతిఘటన కార్యదర్శి మధుసూదన్ రాజు యాదవ్ ఒక యాదవ బిడ్డ. విప్లవోద్యమంలో కులాన్ని సిద్ధాంతంగా చేసి చర్చకు పెట్టిన మారోజు వీరన్న ఒక కమ్మరి-గౌడ కులాంతర బీసీ బిడ్డ. విప్లవోద్యమం నుండి ఎన్నికల పార్టీల వరకు గమనిస్తే ఆలే నరేంద్ర, దేవేందర్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, చెరుకు సుధాకర్ లాంటి బీసీ యోధులు పార్టీలు పెట్టి అనేక పోరాటాలు నిర్వహించినా అగ్రకులసమాజం వీరిని నిలబడనీయలేదు. వీరందరిపై అగ్రకుల పాలకులు చేసే దుష్ప్రచారం అణచివేత మామూలు ఉండదు.
కుక్కను చంపదల్చుకుంటే పిచ్చికుక్క అని ముద్ర వేసి చంపినట్లు వీలైన విధంగా దుష్ప్రచారాలు కొనసాగించి నిర్వీర్యం చేయడమో, బలి తీసుకోవడము మామూలుగా జారిగేదే. ప్రతిఘటన పార్టీ అధినేత కా,, మధుసూదన్ రాజును అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం వున్నా చంపేశారు. వారి దృష్టిలో బీసీ బిడ్డ ప్రాణం అంత విలువైనది ఏమీ కాదు. కనుక అతన్ని చంపేశారు. జనశక్తి వ్యవస్థాపకుడు కూర రాజన్నను చంపడానికి ఎన్ని పన్నాగాలు పన్నినా, వారి కర్మగాలి కూర రాజన్న ఉత్తర ప్రదేశ్ లో దొరికాడు. అందువల్ల వారికి అది సాధ్యపడలేదు.
ఇక మారోజు వీరన్న గొప్ప గాయకుడు గొప్ప ఉపన్యాసకుడు. తను ఏనాడు తుపాకీ పట్టింది లేదు. దళంలో తిరిగింది లేదు. అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశమున్న అతను మళ్లీ బతికితే...కుల ఉద్యమాలు చేస్తే... ఎవరెంత మందో వారికంత వాటా, పెద్ద సమస్యగా మారుతుంది. కనుక అరెస్టు చేసిన రెండు మూడు గంటల్లోనే కాల్చి చంపి ఎంకౌంటర్ కథ అల్లిండ్రు. జనశక్తిని ధనశక్తి అని అగ్రకుల మీడియా ప్రచారం చేస్తే... కూర రాజన్నను "ఒక మాఫియా నాయకుడని" విప్లవ గణపతి కూడా అనగలడు. వీరన్న విపరీతంగా వసూలు చేస్తున్నాడని దుష్ప్రచారం చేశారు.
బతికున్నప్పుడు దుష్ప్రచారం, చనిపోయాక అయ్యో అని కొందరు, అమర్ హై అని మరికొందరు... బతికున్నప్పుడు ఆ నాయకులను సరిగా అంచనా వేసుకుని ఉంటే ఎంతో కొంత బీసీ సమాజ గమనంలో ఎంతో కొంత పురోగతి ఉండి ఉండేది. అగ్రకుల పాలకుల హింస వల్ల విప్లవ పార్టీలు అణగారిపోయినయి. తెలంగాణ రాష్ట్ర సమితి, ఆలే నరేంద్ర, దేవేందర్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, చెరుకు సుధాకర్ పెట్టిన పార్టీలను నిలబడకుండా చేసింది. టిఆర్ఎస్ ను ఉద్యమ పార్టీ అని ప్రజలు కూడా నమ్మినందువల్ల ఆ పార్టీలు ఆదరణకు నోచుకోలేకపోయినయి. నేడు నాటి పరిస్థితి లేదు పైగా బీసీ ఉద్యమం తీవ్రతరమవుతుంది. అదను చూసి విత్తనం పెడితే పంట పండుతుంది.
తెలంగాణ బీసీ తల్లి ఇప్పటివరకు కన్న రాజకీయ బీసీ బిడ్డలను కోల్పోతూ వచ్చింది. మళ్ళీ గర్భం దాల్చి సెప్టెంబర్ 17న మరో రాజకీయ బిడ్డను కన్నది. బిడ్డ పుట్టిందని ఆనందం ఒకవైపు గతంలో కోల్పోయిన బిడ్డలను గుర్తుకు తెచ్చుకొని భయం మరోవైపు తెలంగాణ బీసీ సమాజానికి మిశ్రమ భావం అలుముకుంది. తీన్మార్ మల్లన్న వ్యక్తిత్వానికి సంబంధించి చాలామంది కత్తులు దూస్తున్నారు. చిన్న వయస్సులోనే పెద్ద పోరాట కార్యక్రమం తీసుకోవడం వల్ల కొంతమేరకు అతిగా కనపడుతుంది. వయసులో పెద్దవారికి ఇది జీర్ణం కాకపోవచ్చు. మనం చేయలేనిది మన తమ్ముడు చేస్తే గర్వించాలి.
బ్లాక్ మెయిలింగ్ తో డబ్బులు సంపాదించాడని ఆరోపణలు. సరే నిజమే అనుకుందాం. మేము తుపాకులు ధరించి తిరిగి ఆర్థిక సమీకరణ చేసి కుల ఉద్యమాలకు పెట్టినం. సర్దార్ సర్వాయి పాపన్న నుండి మారోజు వీరన్న వరకు అందరి పైన ఆర్థిక ఆరోపణలు ఉంటాయి. సర్వాయి పాపన్నను బందిపోటని చరిత్రలు రాసుకున్నారు. సర్వాయి పాపన్న దొర ల ఖజానాలను కొల్లకొట్టకుండా సైన్య నిర్మాణం సాధ్యమయ్యేదా. దోచింది దాచుకుంటే స్వార్థం. దోచింది ఉన్నత లక్ష్యం కోసం వినియోగిస్తే అది ఎంత మాత్రం తప్పు కాదు. ఆర్థికాన్ని సమీకరించుకోకుండా ఉద్యమ నిర్మాణం సాధ్యం కాదు. దేశ స్వాతంత్ర ఉద్యమానికి ఆనాటి పరిస్థితులలో బిర్లా, గోయాంక లాంటివారు గాంధీకి ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అదే విదంగా ఆర్ధిక సమీకరణ చేశాడు.
ఇక మల్లన్న ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోతాడని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీజేపీ పార్టీతో జట్టు కట్టవచ్చని...రకరకాల దుష్ప్రచారాలు మొదలుపెట్టిండ్రు. ఆ లెక్కన చూస్తే బీసీ పార్టీ పెట్టడం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకే ఎక్కువ నష్టదాయకంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ బలం బలహీనత బీసీ సమాజం. బీఆర్ఎస్ కూడా బీసీ పునాది మీదనే నిలబడి వుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు పునాదిగా కలిగిన కాంగ్రెస్ పార్టీకి నష్టం తక్కువే. ఇప్పటికిప్పుడు బీజేపీ వైపు పోతడని భయపడాల్సిన పనేం లేదు. నిలకడ లేనివాడు అనే విమర్శకు సంబంధించి ఒక స్పష్టమైన లక్ష్యం గోచరించే వరకు వెతుకులాట లో భాగంగా అనేక మార్పులుంటాయి.
బుద్ధుడు పుట్టగానే బుద్ధిమంతుడు కాలేదు. ఏదో సాదించాలనే తపన తో వున్న మనిషి అప్పటికప్పుడు తనకు తోచింది చేసుకుంటూ పోతాడు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మల్లన్న, బీసీ ఉద్యమమే తన జీవిత లక్ష్యంగా ప్రకటించుకున్నాడు. అనుభవం లేని వాడని విమర్శ, అనేక అనుభవాలున్న మేం చేయగలిగిన దాని కంటే సమర్థవంతంగా చేయగలుగుతున్నాడు. కొత్తగా ప్రారంభించే ఉద్యమంలో కొత్త ప్రశ్నలు కొత్త అనుభవాలు కొత్త సమాధానాలు ఉంటాయి. ఇక సంస్థ పేరులోనే బీసీ పదం లేదని మరికొందరి మాట. సమాజ్వాది, ఆర్జెడి, డీఎంకే పార్టీ పేర్లలో బీసీ అనే పదం లేకుండా బీసీ పార్టీలు గానే మన గలుగుతున్నాయి. దయచేసి మా మీటింగ్ కు అగ్ర కులాలు రాకూడదని విజ్ఞప్తి చేసిన ధైర్యం తీన్మార్ మల్లన్నది.
ఇక వ్యక్తిత్వానికి సంబంధించి ఒక వ్యక్తిలోని మంచి అంశాలను ఒక పట్టానా అంగీకరించలేని సమాజమిది. నాతో సహా ఎంతోమంది నా విప్లవ సోదరులు విప్లవోద్యమంలో ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్దమై వచ్చిన వారు, వివాహం కాడికి వచ్చేసరికి కులాంతర వివాహాలు చేసుకునే సాహసం చేయలేక పోయిండ్రు. ఎటువంటి ఉద్యమాలలో లేని మల్లన్న ప్రేమ కులాంతర వివాహం మాదిగింటికి అల్లుడిని చేసింది. తనకు ఇద్దరు బిడ్డలు. ఇద్దరూ ఆడబిడ్డలు.
ఒక బిడ్డ మానసిక వికలాంగురాలు. తన వ్యక్తిగత సౌక్యమే ముఖ్యమనుకుంటే సహజంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు రకరకాల మాటల ద్వారా తనను దారి మళ్ళించి మరో కులపు పిల్లను చేసేవారు. తను, తన సౌఖ్యమే మేలనుకుంటే వారి మాటలు వినేవాడు. తను ప్రశాంతమైన జీవితంలోకి వెళ్ళేవాడు. ఒక రాజకీయ పార్టీ పెట్టే సాహసం చేసేవాడు కాదు. ఎందుకంటే రహస్య పార్టీల నాయకులే కాదు, ఎన్నికల పార్టీల నాయకులను కూడా నిర్మూలించిన చరిత్ర అగ్ర కులాలది. అనేక దాడులు, కేసులు ఎదుర్కొని జైళ్ళ పాలయి కూడా తాను ధైర్యంగా నిలబడుతూ తన బీసీ బంధుమిత్రులకు, బీసీ సమాజానికి ధైర్యం ఇవ్వడం మాములు విషయం కాదు. యాద్రుచ్చికంగా మేము పుట్టిన కులం ఒకటే కావచ్చు. అతను నాకు బంధువు కాదు, గతంలో మిత్రుడు కూడా కాదు. అతను మాదిగంటి బిడ్డను వివాహం చేసుకున్నాడు. నేను మాదిగుల్ల కలుద్దాం జంబురాజ్యం స్థాపిద్దామని నినాద సృష్టికర్తను.
చివరగా ఒక మాట. మారోజు వీరన్న, రహస్య కమ్యూనిస్టు పార్టీగా కొనసాగుతూనే ఎన్నికల రంగంలోఅగ్రకుల పార్టీలతో సమర్ధ వంతంగా యుద్ధం చేయడానికి ఒక ఎన్నికల పార్టీని కూడా పెట్టాలని ఆలోచించాడు. ఊ. సాంబశివరావు నాయకత్వంలో దాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించినం. వీరన్న మరణంతో అది జరగలేదు. ఆ తర్వాత వీరన్న ఆలోచనలో భాగంగానే బీసీలు ఎవరైనా పార్టీ పెట్టినపుడు మద్దతుగా నిలబడుతూ వచ్చినం. విజయశాంతి పెట్టిన తల్లి తెలంగాణ పార్టీకి అండగా నిలబడ్డం. నేడు తీన్మార్ మల్లన్న పెట్టిన "తెలంగాణ రాజ్యాధికార పార్టీకి" మా మద్దతు వ్యక్తిగతమైంది కాదు. వీరన్న ఆలోచనా పరులుగా, బీసీ ప్రజాస్వామిక వాదులుగా... అండగా నిలబడతాం. "తెలంగాణ రాజ్యాధికార పార్టీని" బలపరుచు కోవాలని బీసీ సమాజానికి ఉంది.
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత వ్యక్తి గత అభిప్రాయాలు. వాటిని అచ్చేసినంత మాత్రం ‘ఫెడరల్ తెలంగాణ’ వాటితో ఏకీభవించినట్లు కాదు. ‘ఫెడరల్ తెలంగాణ’ భిన్నాభిప్రాయాల వేదిక మాత్రమే.)