తెలంగాణలో కొత్త బీసీ రాజకీయ పార్టీ అవసరమేమిటి?

జర్నలిస్టు తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ సృష్టిస్తున్న చర్చ...

Update: 2025-09-20 09:39 GMT
Telangana Map

- డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్


తెలంగాణ బీసీ ఉద్యమాలకు ప్రయోగశాల. బీసీ ఉద్యమాల పుట్టిల్లు.నిజాం నిరంకుశంత్వానికి, రజాకార్ల రాక్షసత్వానికి, జాగీర్దారుల, జామిందారుల జులుంకు, అధికారుల అరాచకాత్వానికి వ్యతిరేకంగా తిరుగబడ్డ తెలంగాణ. వెట్టి విముక్తికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సై అని కాలుదువ్విన కడవెండి. దోపిడీ దుర్మార్గాలకు నిరసిస్తూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ అంతా తెగించి పోరాడి హైదరాబాద్ రాష్ట్రం సాధించుకున్నాము. సెప్టెంబర్ 17, 2025 రోజు చరిత్రలో చారిత్రాత్మక మైనది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన నాయకత్వంలో తాజ్ కృష్ణ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించింది.1952 లో బీసీ నాయకుడు జయ సూర్య నాయకత్వంలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పొలిటికల్ పార్టీ ని ప్రారంభించి తెలంగాణ ప్రాంతంలో 90 ఎమ్మెల్యే స్థానాలు ఎనిమిది 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నాడు.జయ సూర్య స్ఫూర్తితో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీని ప్రారంభించాడు. వచ్చే, ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు.

ప్రజా చైతన్య ఉద్యమాలు

హైదరాబాద్ రాష్ట్రంలో 1952 ముల్కి ఉద్యమం మొదలయింది. నిజాం ప్రభుత్వ కాలంలో స్థానికులకు ఉద్యోగావకాశాల కోసం ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. వలసాంధ్రుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, భూస్వాముల ఆగడాలను నిరసిస్తూ "దున్నేవాడికి భూమి" కావాలని 1970ల నుంచీ 1990ల వరకు నక్సలైట్ ఉద్యమాలకు ప్రయోగశాలగా తెలంగాణ నిలిచింది.1994ల తెలంగాణ మలిదశ ఉద్యమం తెర మీదికి వచ్చింది.సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారు. కెసిఆర్ నాయకత్వంలో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ నినాదమే సామాజిక ఉద్యమాలను పక్కకు తోసింది.ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయితాయని ప్రజలను భ్రమల్లో ఉంచారు.2014 లో తెలంగాణ రాష్ట్రము తర్వాత కెసిఆర్ పదేండ్ల పాలనలో బంగారు తెలంగాణ ముసుగులో బీసీలను దగా చేసాడు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నియంతృత్వంతో వ్యవహారించింది. తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడల్ల పోరాటాలతో లేచి నిలబడిన నేల. అణిచివేత దారులను తరిమిన గడ్డ. ఆత్మగౌరవపతాకాన్ని గుండెల్లో మోస్తున్న నెల. మాట అంటే పడని నేల. మోసం అంటే విరుచుకుపడిన నేల. సీమాంధ్రలు మోసం చేస్తే తరిమి వేసి నేల. అందుకే తెలంగాణలో స్వార్ధపూరిత అగ్రకులాలు చెప్పే ప్రతిదాన్నీ ప్రశ్నించాలి. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో దోపిడి చేస్తుంటే, బీసీల హక్కుల కోసం జర్నలిస్ట్ గా ఉన్న తీన్మార్ మల్లన్న తన క్యూ ఛానల్ ద్వారా ఒంటరి పోరాటం చేసి ,బీసీలను చైతన్యం చేశాడు.కెసిఆర్ తప్పులు ప్రజలకు తెలుస్తున్నాయనే భయంతో ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి రెండు ధపాలుగా అరెస్టు చేసి 110 రోజులు జైలు కు పంపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తీన్మార్ మల్లన్న ఎక్కుపెట్టిన పోరాటంలో నిరాశ నిస్పృహలకు తావివ్వకుండా రాష్ట్ర ప్రజలపై అంతులేని మమకారంతో, విశ్వాసంతో అప్పటినుండి ఇప్పటికీ వరకు ఉద్యమ జైత్రయాత్ర సాగిస్తున్నాడు. దీంతో బీ.సీ.లు బుద్ధుడు, ఫూలే, పెరియార్ రామస్వామి, అంబేద్కర్లని సొంతం చేసుకోని సామాజిక, రాజకీయ రంగాల్లో చైతన్యవంతులైనారు.

టిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చిన మల్లన్న కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గా తీన్మార్ మల్లన్న బాధ్యతలను చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసింది. ఇతని పరిపాలనలో ప్రజాస్వామిక హక్కులు కాపాడుతామని, మార్పు కోసం, ప్రజాపాలన కోసం కాంగ్రెస్ ముందుకొచ్చింది. అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. పేరు ప్రజా పాలన, తీరు రెడ్ల పాలన అయింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు చాలా హామీలు ఇచ్చింది. ఏడాది గడిచినా ఏ ఒక్కటీ అమలు చేయలేదు. బీసీల బతుకులు ఏమి మారలేదు. సరికొత్త హామీలు, నినాదాలతో మోసం ఎప్పటిలాగే కొనసాగుతుంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా అణచివేతకు, వివక్షకు గురవుతూనే ఉన్నాము. అవకాశాలు కోల్పోతున్నం. అన్ని రంగాలల్లో వెనకబడే ఉన్నాము. కారణం చాలా స్పష్టం. మనం అధికారంల లేకపోవుడే. ఓట్లు మనయి. అధికారం మాత్రం ఆధిపత్య కులాలది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించాడు. కులగణన తప్పుల తడకగా నిర్వహించడంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు అన్యాయం జరిగిందని కులగణన ను తప్పు పట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాడు. దీంతో పార్టీ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. అందుకే బీసీలను చైతన్యము రాజకీయ పార్టీ స్థాపించాడు.

బీసీలు లేని ఊరు లేదు.

 తెలంగాణ బిసి లేని ఊరు లేదు.ఉద్యమం లేదు. ఉత్పత్తి లేదు. చేయని సేవ లేదు. మన చెమట ఇనుకని చేను లేదు. మనం చేయని వస్తువూ లేదు. దేశంల మన సేవలు, ఉత్పత్తుల ద్వారా స్వయం పోషకత్వాన్ని కల్పిస్తున్నం. దేశ సంపదను పెంచుతున్నం. పంచుతున్నం. కానీ పాలనల మాత్రం మనం లేము. మారుతున్న కాలంతో మనల్ని అధికారం లోకి రాకుండా అడ్డుకుంటున్నారు.

ప్రతి చారిత్రక సందర్భంలో మనం ప్రతి పోరాటంలో ఉన్నాము. మనం లేని సామాజిక ఉద్యమం లేదు. త్యాగం మనది. కానీ వంచనతో ఫలితం అనుభవించేది ఆధిపత్య కులాలే. ఎన్నికలల్ల మన ఓట్ల కోసం తీయటి హామీలిస్తారు. గెలిచినంక మన గోతులు తీస్తారు. రెడ్డి, వెలమల పాలన తేనే పూసిన కత్తులని తెలిసోచ్చేసరికి మన బతుకులు తెల్లారి పోతూనే ఉన్నాయి. ఎవడేలితే మనకేంది. మన బతుకులు ఎంగిలి ఇస్తారాకులే. నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. గొర్రెలు, చేపలు, పెన్షన్లు ఇచ్చి బిచ్చగాండ్లను చేసారు. గత తెరాస ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిల పెద్దతేడా ఏమి లేదు.

ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు. అరకొరగా ఎంపీ టిక్కెట్లు ఇచ్చిండ్లు. అది కూడా ఓడిపోయే నియోజకవర్గాలే. నామినేటెడ్ పదవులూ ఇవ్వలేదు. ఇదేమి సామాజిక న్యాయం. ఏ పార్టీ అయితేంది ముఖ్యంగా బీసీల పట్ల సవితి తల్లి ప్రేమే. పెనం మీదికెల్లి పొయిల పడ్డయింది బీసీల పరిస్థితి. ఎప్పుడో ఇది పసిగట్టే "సకల సమస్యలకు రాజ్యాధికారం పరిష్కారం" అన్నడు అంబేద్కర్. సోది ఆపి, సోయి తెచ్చుకుందాం.

ఇకనైనా మేలుకుందాం. మనల మనమే ఏలుకుందాం. ఇకపై ఓట్లు మనయే. సీట్లూ మనయే. పార్టీలు టిక్కెట్లు అమ్మొద్దు. ప్రజలు ఓట్లు అమ్ముకోవద్దు. అభ్యర్థులు టిక్కెట్లు కొనొద్దు. ఓట్లూ కొనొద్దు. గట్లాంటి నిజాయితీ గల పార్టీ ఈ రోజు ప్రారంభం అయింది.వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు పెడతాం. ఇదే అదను. కదిలి కదిలిద్దాం. కరిగి వెలుగు ఇద్దాం.మార్పు కావాలి. మార్పు రావాలి. ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. అవినీతి అంతం కావాలి. నీతి, నిజాయితీగల పాలన రావాలి. అందుకు విలువలతో కూడిన బహుజన చైతన్యంతో సరకొత్త రాజకీయ పార్టీ ని స్థాపించాడు. ఇకనైనా సోది ఆపి, సోయి తెచ్చుకుందాం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల పాలన అంటే... 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మాటకు ప్రజల పాలన అంటాడు. పదవులేమో రెడ్లకిస్తాడు. నయవంచనకు తెర లేపిండు. సామాజిక న్యాయాన్ని సమాధి చేసిండు. మెజారిటీగా ఉన్న బహుజనులకు ఉత్త చేయి చూపిస్తున్నాడు.తుంట ఎత్తేసి, మొద్దు ఎత్తుకున్నట్లు అయింది మన పరిస్థితి. ఎన్నికలకు ముందే బీసీలకు పాలన చేత కాదన్నడు. వెలమలకు రెడ్లకు మాత్రమే పాలించే సామర్ధ్యం ఉందన్నడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నడు. అయినా గతి లేక కాంగ్రెస్ ను గెలిపించినం. ఇంకెంత కాలం మోసపోదాం. గోస పడుదాం. ఇకపై ఈ దొంగల భరతం పడుదాం.

బీసీలు చైతన్యంతో పార్టీ వచ్చింది. మన ప్రజల వద్దకు పోదాం. ఓటు విలువ తెలియజేద్దాం.రాజకీయ చైతన్యం పెంచుదాం. నిశ్శబ్ద ఓట్ల విప్లవానికి నేడే నాంది పలుకుదాం.

బీసీలకు రాజకీయ పార్టీ ఎందుకు?

1.తెలంగాణ రాష్ట్రంలో 8 శాతం ఉన్న ఓసి కులాలు లోకసభలో 62 శాతం అనగా 8 ఎంపీ సీట్లతో అధికారాన్ని అనుభవిస్తున్నారు. 17 ఎంపీ సీట్లలో ఓసి కులాలకు దామాషా ప్రకారం ఒక ఎంపీ సీటు మాత్రమే ఉండాలి. బీసీ జనాభా ప్రకారం బీసీలకు 8 సీట్లు రావాలి. కానీ నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. అందుకే బీసీలకు రాజకీయ పార్టీ వచ్చింది.

2.రాష్ట్రంలో విద్యా వ్యాపారం లో అధిపత్య కులాలదే పైచేయిగా ఉంది. ప్రతి ఏడాది 90 వేల కోట్ల రూపాయల విద్యా వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం రెడ్డి, వెలమ కులాల చేతిలో 75% బీసీలకు 12 శాతం మాత్రమే విద్యాసంస్థలు ఉన్నాయి. అందుకే నాణ్యమైన విద్య కోసం బీసీ రాజకీయ పార్టీ అవసరం.భారతదేశంలో 72% ఉన్న సామాన్య వ్యక్తులు చెల్లించిన పన్నులతో రాష్ట్రపతి నుండి సామాన్య ఉద్యోగి వరకు వేతనాలు ఇస్తున్నారు. కానీ అత్యున్నతమైన విద్యా సంస్థలైన ఐఐటి ఐఐఎం ఎయిమ్స్ లలో మన బీసీ బిడ్డలు లేరు. బీసీలు కట్టిన పన్నుల సంపదతో సంపన్నులను చదివిస్తున్నారు ఇదెక్కడి సమానత్వం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి78 ఏళ్లు గడిచిన ఐఐటీ లలో ఓసి ప్రొఫెసర్లు 6043 మంది ఉన్నారు. బీసీ ప్రొఫెసర్లు 676 మాత్రమే ఉన్నారు. మన ఉద్యోగాలు మనకు తగ్గాలంటే బీసీలకు రాజకీయ పార్టీ అవసరం.

3. తెలంగాణలో విద్య, వైద్యం పేరుతో ఆధిపత్య కులాల వ్యాపారులు లక్ష కోట్ల రూపాయలు. ఇందులో 62,000 కోట్లు బీసీ పన్నుల తోటే లబ్ధి పొందుతున్నారు. అందుకే నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు ఉచితంగా ఇవ్వడానికి రాజకీయ పార్టీ అవసరం.

4. తెలంగాణలో ప్రధాన రోడ్లన్నీ ఆధిపత్య కులాల కబంధహస్తాల్లోనే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న 28 టోల్ గేట్లలో ఓసీలకే మొత్తం 28 ఉన్నాయి. అందులో బీసీలు లేరు. అందుకే బీసీలకు రాజకీయ పార్టీ అవసరం.

5. 2025 సెప్టెంబర్ నాటికీ రెడ్డి వెలమ పార్టీ ప్రభుత్వాలు 8, 06,298 కోట్లు అప్పులు చేశారు. ఇందులో బీసీలు కట్టాల్సిన అప్పు 4,99, 905 కోట్లు, ఓసీలు కట్టాల్సినవి 64,504 కోట్లు. అప్పు బీసీలకు, ఆస్తులు అగ్రవర్ణాలకా? అధికారం ఓసీలకు అప్పులు బీసీలకా? సొమ్ము బీసీలది,సోకు ఓసి లేదా?

అందుకే బీసీలకు రాజకీయ పార్టీ అవసరం...

6. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా కోటి 60 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణ భూమి ఉన్నట్లుగా గణాంకాలు తెలియజేస్తూ ఉంటాయి . తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల చేతిలో 67 లక్షల ఎకరాల భూమి ఉంది. భూమిలేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సెంటు భూమి పంచలేదు. కానీ ప్రాజెక్టుల కోసం ముంపు భూములని బీసీల దగ్గర 32 లక్షల ఎకరాలు గుంజుకొన్నారు. నీరు పారే భూములన్ని అగ్రవర్ణాల భూమిలే ఉన్నాయి.

7. ఎనిమిది శాతం ఉన్న ఓసీలు 34 శాతం బడ్జెట్ ను కంట్రోల్ చేస్తున్నారు. 62 శాతం ఉన్న బీసీ మంత్రులు 6% మాత్రమే బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. అందుకే ఆర్థిక నిర్వహణ బీసీల చేతుల్లోకి రావాలంటే,బీసి రాజకీయ పార్టీ తోనే సాధ్యం.

8. 1952 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 1324 ఎమ్మెల్యేలలో ఓసీలు 1045 మంది ఉన్నారు. అంటే 105 శాతం అధికారం అనుభవిస్తున్నారు. బీసీలు 279 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ విధంగా ఓసీ కులాలు బీసీలకు ద్రోహం చేశారు. తెలంగాణలోని విధాన పరిషత్ లో 8 శాతం ఉన్న అధిపత్య కులాలకు 54 శాతం అనగా 23 మంది ఉన్నారు. వీరికి దామాషా ప్రకారం ముగ్గురు మాత్రమే ఉండాలి. 62 శాతం ఉన్న బీసీలకు 30% అంటే 12 మంది మాత్రమే ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ధీటుగా, వాటిని నేరవేర్చే బలమైన ప్రజారాజకీయ శక్తిగా ఈ నూతన రాజకీయ పార్టీని నిర్మించుకునేందుకు బిసిలు ముందుకు రావాలి.


( డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్. హైదరాబాద్ సిటిలోని ఒక  ప్రయివేటుకాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్. అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం)

Tags:    

Similar News