‘ఫాసిజం ముందు మేము తలవంచం, ప్రతిఘటిస్తాం’
ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సదస్సు (NAPM) హైదరాబాద్ డిక్లరేషన్;
నలు వైపులా నిరాశా నిస్పృహలు నిండిపోయిన సమయంలో 2025 మార్చ్ 1 నుండీ 4 వరకూ హైదరాబాద్ నగరం మాత్రం ప్రజా ఉద్యమాల కార్యకర్తలతో ఉర్రూతలూగింది. 24 రాష్ట్రాల నుండీ హైదరాబాద్ తరలి వచ్చిన 600 మందికి పైగా నాయకులు ,కార్యకర్తలు తమదైన శైలిలో భవిష్యత్తుపై ఆశలు నింపారు. మొదటి రోజు ప్రారంభ సమావేశంలో కొందరు, సాయంత్రం బహిరంగ సభలో మరి కొందరు వక్తలు తమ ఉపన్యాసాలతో సమావేశ ప్రతినిధులలో ఉత్సాహం నింపడమే కాదు, ఆలోచనలను రేకెత్తించారు. ప్రజా పక్ష మేధావులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, కళాకారులు, ఈ వక్తలలో ఉన్నారు. గత మూడు దశాబ్ధాలలో NAPM నేతృత్వంలో, ఇతర ప్రజా ఉద్యమాలలో అసువులు బాసిన అమరులకు నివాళి అర్పించడం నుండీ, వివిధ రాష్ట్రాల కళాకారులు పాడిన పాటలతో సభలను హోరెత్తించడం వరకూ నాలుగు రోజుల సభలూ విభిన్నంగా సాగాయి.
దేశంలో కీలకమైన 14 అంశాలపై ప్రతినిధులు రెండవ రోజు లోతైన చర్చలు జరిపారు. ప్రతి సమస్యకూ ఎన్నో కోణాలు, అక్కడి ప్రభుత్వాల భిన్న వైఖరులు చర్చకు వచ్చాయి. సమస్యల పరిష్కారం కోరుతూ, నిర్ధిష్ట డిమాండ్లు ముందుకు తెస్తూ, ఈ పారలల్ సమావేశాలు ముగింపులో అనేక తీర్మానాలను ఆమోదించాయి.
రెండవ రోజు సాయంత్రం ప్రజా ప్రదర్శన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుండీ గన్ పార్క్ వరకూ తీయాలని భావించి, పర్మిషన్ కోసం 20 రోజుల మును నుండే సమావేశాల నిర్వాహకులు పోలీసు అధికారులను కలసి విజ్ఞప్తి చేసినా, చివరి వరకూ తిప్పుకుని, చివరి రోజు అనుమతికి నిరాకరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన గురించి, 7 వ గ్యారంటీ గా ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం, ప్రజల శాంతియుత ప్రదర్శనలకు కూడా అనుమతి నిరాకరించడం, దేనిని సూచిస్తుంది ?
రెండవ రోజు సాయంత్రం సదస్సులో , తెలంగాణ ప్రజా సమస్యలపై ఒక ప్రత్యేక సెషన్ జరిగినది. వివిధ రంగాలలో క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తున్న 16 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రసంగించారు. దేశ వ్యాపితంగా వివిధ రాష్ట్రాల నుండీ తరలి వచ్చిన ప్రతినిధులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రత్యేక సమస్యల తీవ్రత లోతుగా అర్థమయింది. కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వకపోవడం, అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయక పోవడం, ఆదివాసీలకు అనుకూలంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం, అడవిపై సాముదాయక పట్టా హక్కులు కల్పించక పోవడం, ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉండడం, ఇరతర రాష్ట్రాల నుండీ తరలి వస్తున్న కార్మికులతో తెలంగాణ యవత శ్రమ చేయడంవ పోటీ పడలేక పోవడం, వాతావరణంలో వస్తున్న కారణంగా, ప్రకృతి వైపరితరహయాలు పెరగడం, అవి గ్రామీణ, పట్టణ ప్రజలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు, రాష్ట్రంలో ఏర్పడుతున్న 30 ఇథనాల్ పరిశ్రమలు సృష్టించబోయే విధ్వంసం, రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ రద్ధు చేస్తామనీ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరించడం, 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేస్తామనీ , గత ప్రభుత్వం అక్రమంగా రైతుల నుండీ గుంజుకున్న భూములను వెనక్కు ఇచ్చేస్తామనీ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన హామీకి భిన్నంగా , కేంద్ర చట్టానికి భిన్నంగా KCR తెచ్చిన 2017 భూ సేకరణ చట్టం ప్రకారమే కొత్త నోటిఫికేషన్ లు జారీ చేయడం, సంవత్సరాలు గడుస్తున్నా కనీస వేతనాలను సవరించకపోవడం, మూసీ నది పునరుద్ధరణ పేరుతో, పేదల బస్తీలను తొలగించాలని చూడడం లాంటి అంశాలను వక్తలు తమ ప్రసంగాలలో ప్రస్తావించారు.
మూడవ రోజు సంస్థాగత విషయాలపై చర్చ జరిగినది. వేదికకు కొత్త జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ నుండీ విస్సా కిరణ్ కుమార్, మీరా సంఘమిత్ర, షేక్ సలావుద్దీన్, సిస్టర్ లిజి జాతీయ వర్కింగ్ గ్రూప్ సభ్యులుగా ఉన్నారు.
నాలుగవ రోజు కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీ, సిపిఐ, సిపిఐ(ఎం ), సిపిఐ ( ఎం-ఎల్ –లిబరేషన్ ), తెలంగాణ జనసమితి నాయకులతో, ఫాసిస్టు కాలంలో రాజకీయ పార్టీల, ప్రజా ఉద్యమాల పాత్ర అనే అంశం పై ప్రత్యేక సమావేశం జరిగింది.
చివరిలో నాలగవ రోజు సమావేశాలలో హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదించారు. డిక్లరేషన్ అనేక అంశాలను ప్రస్తావించింది. వివిధ విషయాలపై స్పష్టమైన తన వైఖరిని ప్రకటించింది. హైదరాబాద్ డిక్లరేషన్ సారాంశం దేశంలో ప్రజా ఉద్యమాలకు దిక్సూచిగా ఉంది.
హైదరాబాద్ డిక్లరేషన్ :
ప్రతిఘటనకు పిలుపు, పునర్నిర్మాణానికీ, ప్రత్యామ్నాయాలకూ ప్రతిజ్ఞ
ఆనకట్టలను నిరాకరించే నదులం మనం
ఖనిజ తవ్వకాలను నిరాకరించే సముద్రాలం మనం
నరికి పారేయలేని అరణ్యాలం మనం
దొంగిలింతకూ, విధ్వంసానికీ అంగీకరించని భూమి మనమే
లొంగని, దెబ్బతినని, ఎప్పటికీ మరణించని ప్రజలం మనం
ముప్పై ఏళ్లుగా కలిసి నడుస్తూనే ఉన్నాం
లోయలు, అడవులు, ఎడారులు, కొండలు, గ్రామాలు, మురికి వాడలు...
బుల్డోజర్లను ఎదిరించాం, భూమిని పరిరక్షించాం,
అవరోధాలను బద్దలుగొట్టాం, అన్యాయపు గోడలను తుత్తునియలు చేశాం
కులం పేరిటా, మతం పేరిటా, స్త్రీ అనీ, పురుషుడనీ చీలడానికి నిరాకరించాం
ద్వేషాన్ని ప్రేమతో, సహానుభూతితో ఎదుర్కొన్నాం.
ఇవాళ, హైదరాబాదులో మరొకసారి కలుసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాం,
ఆగ్రహాన్ని ప్రకటిస్తున్నాం, పునరంకితమవుతున్నాం.
మనం చెక్కు చెదరని ప్రజా ఉద్యమాలం.
రాజ్యాంగ న్యాయం దిశగా సాహసంతో, నిబద్ధతతో మన మార్గంలో సాగిపోతూనే ఉంటాం
మనం జీవిస్తున్న కాలం
మనం జీవిస్తున్న ఈ కాలం సాధారణమైనది కాదు. భూమినీ, నీటినీ, అడవులనూ, సముద్ర తీరాలనూ, శ్రమనూ కార్పొరేట్లకు అప్పగిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. అదే సమయంలో రైతులను, మత్స్యకారులను, కార్మికులను, పట్టణ పేదలను రుణ భారపు అంచులకూ, ఆకలి వైపుకూ, విధ్వంసం వైపుకూ నెడుతున్న కాలమిది. ఆనకట్టలు గ్రామాలను మింగి త్రేనుస్తున్నాయి. గనులు భూమాత కడుపును చీలుస్తున్నాయి. కర్మాగారాలు గాలిని విషమయం చేస్తున్నాయి. పారిశ్రామిక కారిడార్లు నిర్వాసితుల మృతదేహాల మీద సమాధి రాళ్లలా లేచి నిలుస్తున్నాయి. ప్రతి ఒక్క పథకమూ పేద ప్రజల సమాధుల మీద లాభం కోసం నిర్మించిన ఆలయంగా ఉన్నది.
నయా ఉదారవాదమూ, హిందుత్వా చేయీ చేయీ కలిపి నడుస్తున్నాయి. ఒకటి లూటీ చేస్తుంది, మరొకటి హత్య చేస్తుంది. భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలూ నాయకత్వం వహిస్తున్న ఉక్కు పిడికిలి రాజ్యం ప్రజాస్వామ్యపు శ్వాస గొంతు నులుముతున్నది. ఈ రాజ్యం తనను తాను “కొత్త” అని చెప్పుకుంటున్నది గాని వాస్తవానికి అది రాజుల, పెట్టుబడిదారుల అతి పాత నిరంకుశత్వపు కంపు కొడుతున్నది. అది నిరంతరాయంగా చరిత్రలను పదే పదే సవరిస్తున్నది, వ్యవస్థా నిర్మాణాలను కూలదోస్తున్నది, భిన్నాభిప్రాయాల కుత్తుకలు ఉత్తరిస్తున్నది. మార్కెట్లూ, అదానీ-అంబానీ వంటి ఆశ్రితులూ ఉత్సవాలు జరుపుకుంటుండగా పాలకులు రాజ్యాంగానికి సవరణలు చేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తున్నారు, ప్రజా ప్రతినిధులను బేరమాడుతున్నారు, ప్రజా వ్యతిరేక చట్టాలను అమలులోకి తెస్తున్నారు, అనైతిక రాజకీయాలు రాజ్యం చేస్తున్నాయి. విద్యను ఒక సరుకుగా మార్చేశారు. విశ్వవిద్యాలయాలను స్వాధీనం చేసుకుని, భిన్నాభిప్రాయాల చెరసాలలుగా, హిందూ రాష్ట్రపు పంటపొలాలుగా మారుస్తున్నారు. జ్ఞానాన్ని ఎంతగా పంజరాల్లో బంధిస్తున్నారో అంతగా అజ్ఞానాన్ని ఆయుధంగా మారుస్తున్నారు.
పొరుగు వారిని శత్రువులుగా, ప్రేమను ద్వేషంగా, పౌరసత్వాన్ని దూరం పెట్టే సాధనంగా మారుస్తున్న హిందుత్వ తన పట్టు బిగిస్తున్నది. కులం వల్ల, పితృస్వామ్యం వల్ల, మత ఆధిక్యతా వాదం వల్ల జరిగే హానికి దళితులు, బహుజనులు, ముస్లింలు, స్త్రీలు, ఎల్ జిబిటిక్యూఐఏ+ సమూహాలు గురవుతున్నాయి. పీడన మీద ‘అభివృద్ధి’, ‘జాతీయవాదం’ అనే ముసుగులు కప్పబడి ఉన్నాయి. రాజ్యం నిర్బంధమే తన ఏకైక విధానంగా తలమునకలుగా ఉన్నది. కార్యకర్తలను జైళ్లకు పంపుతున్నారు, జర్నలిస్టులు నోరెత్తకుండా చేస్తున్నారు, కళాకారుల మీద ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజల ఉద్యమాల మీద ‘తీవ్రవాది’, ‘దేశ ద్రోహి’, ‘అర్బన్ నక్సల్’ అని ముద్ర కొడుతున్నారు. ప్రతి స్క్రీన్ మీదా తప్పుడు సమాచారం వరదలెత్తుతున్నది. సామాజిక మాధ్యమాలను ద్వేషం వ్యాపింపజేసే ఆయుధంగా, మూక దాడులు రెచ్చగొట్టేదిగా మార్చేశారు. వాస్తవికత స్థానాన్ని ప్రచారం ఆక్రమించింది. ఫాసిజం అడ్డూ అదుపూ లేకుండా ముందుకు సాగుతుండగా ప్రజలను నిరాసక్తతలోకీ, నిష్క్రియలోకీ మొద్దుబార్చారు.
ఇప్పుడిక వాళ్లు తెంపరితనంతో ఇవే “అచ్చేదిన్” అంటున్నారు. కాదు, ఇది యుద్ధం, ఇది నిరంకుశత్వం అని మనం వాళ్లకు చెప్పవలసి ఉంది.
ప్రపంచం మొత్తం మీద చూస్తే, మనం ఒక మూడో ప్రపంచ యుద్ధం అంచులలో నిలిచి ఉన్నాం. గాజాలో, యుక్రెయిన్ లో, కాంగోలో, సూడాన్ లో, మరెన్నో చోట్ల ఘర్షణలు చెలరేగుతున్నాయి. అసంఖ్యాక దేశాలలో తీవ్ర మితవాద శక్తుల విజృంభణ ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారింది. ఈ పాలకులలో ఎందరో తమ అధికారాన్ని, ఫాసిజాన్నీ, వలస విస్తరణనూ, సర్వవ్యాపిత ఆధిపత్యాన్నీ అమలు చెయ్యడానికి వాడుకుంటున్నారు. నిఘా యంత్రాంగం ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నది. డిజిటల్ నిర్బంధం ద్వారా అసమ్మతిని తుడిచేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను డబ్బుతో సాగే తమాషాగా కుదించారు. ఆశ్రిత, భక్షక పెట్టుబడితో చేతులు కలిపి యుద్ధం నుంచీ, విధ్వంసం నుంచీ లాభాలు పిండుకుంటున్నారు. పెట్టుబడిదారీ విధానం తాను సృష్టించిన వ్యర్థ పదార్థాల మీద బతుకుతూ ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభానికి కుంటుకుంటూ నడుస్తుంటే, పాలకులు విచారణాతీత, శిక్షాతీత ప్రవృత్తితో ప్రపంచ అసమానతను పెచ్చరిల్ల జేస్తున్నారు. వాతావరణ సంక్షోభాన్ని దోపిడీకి అంగడిగా మార్చేస్తున్నారు. ప్రపంచం తగులబడి పోతుంటే ఉత్పాతాలను డబ్బుగా మార్చుకుంటున్నారు.
వాతావరణ సంక్షోభం నానాటికీ పెచ్చరిల్లుతుంటే అది తక్షణ చర్యలు తీసుకోవాలనే ప్రమాద హెచ్చరికగా కాక, లాభాలు సంపాదించే మార్కెట్ గా చూస్తున్నారు. నదులకు ఆనకట్టలు కడుతున్నారు, అరణ్యాలను వేలం వేస్తున్నారు, కొండలను పేల్చివేస్తున్నారు, చివరికి పునరుత్పత్తి ఇంధన వనరులను కూడా కార్పొరేట్లు తమ గుత్తాధిపత్యం కిందికి తెచ్చుకున్నాయి. ఇది కేవలం ప్రజల మీద యుద్ధం మాత్రమే కాదు, ఇది అసలు మౌలికమైన జీవన వ్యావృత్తి మీదనే యుద్ధం. పర్యావరణ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు, జీవజాతులను అంతరించి పోయేవైపు నెడుతున్నారు, అసలు భూగోళాన్నే వాడి పారేయదగిన సరుకుగా చూస్తున్నారు. ప్రకృతిని ఇలా నిర్లక్ష్యంగా లూటీ చేయడం తరతరాల వాతావరణ న్యాయ సూత్రాల ఉల్లంఘనే. ఇంకా పుట్టని తరాలకు చెందిన భవిష్యత్తును వారి నుంచి దొంగిలించడమే. వారికి కొరతలూ విధ్వంసాలూ నిండిన ప్రపంచాన్ని వదలడమే. ప్రజల గళాలను అబద్ధాల సముద్రాలలో ముంచివేసి, మీరెంతో స్వేచ్ఛగా ఉన్నారని నమ్మ బలుకుతున్నారు. ఇవాళ న్యాయం కోసం పోరాటం మానవతా హద్దులను కూడా అధిగమించినది. ఇవాళ మొత్తంగా జీవితాన్ని పరిరక్షించవలసి ఉంది. సహజ ప్రాకృతిక ప్రపంచం కొల్లగొట్టబడకుండా ప్రతిఘటించవలసి ఉన్నది. భూమి, నీళ్లు, గాలి ఎంతమాత్రమూ సరుకులుగా చూడబడని, సమస్త జీవులూ పంచుకోవలసిన పవిత్ర వారసత్వంగా చూసే ఒక భవిష్యత్తును సాధించవలసి ఉన్నది.
అయితే, చివరికి ఇటువంటి కాలంలో కూడా, నదుల నుంచీ, సముద్రాల నుంచీ, నగరాల నుంచీ, పల్లె సీమల నుంచీ ప్రతిఘటన ఉవ్వెత్తున లేస్తున్నది.
అందువల్ల వాళ్లకు ఒక మాట చెపుదాం: మేం ఎంతమాత్రమూ భయపడడం లేదు. మేం తల వంచం. మేం మీ ముందు ప్రాధేయపడం. మేం విధ్వంసాన్నీ, నిర్వాసితత్వాన్నీ, అసమానతనూ, హింసనూ, మానవహక్కుల ఉల్లంఘననూ ప్రతిఘటిస్తాం.
మేం ప్రజల పోరాటాలం. మేం సుస్థిరత, మానవ గౌరవం, న్యాయం ద్వారా భవిష్యత్తును పరిరక్షించడానికి నిలబడతాం.
ముప్పై సంవత్సరాల కింద, నయా ఉదారవాదపు మంటలు మొట్టమొదట ప్రారంభమైనప్పుడు, ఈ నేలను ఆక్రమించడానికీ, మనను విభజించడానికీ మతోన్మాదం తన వికారమైన తలను పైకెత్తుతున్నప్పుడు, మనం ఎన్ ఎ పి ఎం అనే ఒకే వేదిక మీదికి వచ్చాం. నర్మద నుంచి నందిగ్రామ్ దాకా, కళింగనగర్ నుంచి కూడంకుళం దాకా, ప్లాచిమాడా నుంచి దభోల్ దాకా, భోపాల్ నుంచి పోస్కో దాకా మనం పోరాడాం. మనం ఆ పోరాటం ఒంటరిగా చేయలేదు. ఒక ఐక్య వేదికగా ఆ పోరాటం చేశాం. ఎన్నో సౌహార్ద సంస్థలతో, ఉద్యమాలతో కలిసి ప్రజలుగా ఉమ్మడిగా పోరాడాం. ఏదో ఒక సాధించరాని ఆదర్శంతో పోరాడి కాలగర్భంలో కలిసి పోవడానికి కాదు, సాధించగలిగిన ఉన్నత మనుగడ కోసం దూరదృష్టితో, విశాలంగా, లోతుగా పోరాడాం.
ఇవాళ, మనం ప్రకటిస్తున్నాం: ప్రత్యామ్నాయాలను నిరంతరంగా అభివృద్ధి చేస్తూ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
ఇది కేవలం మనుగడ కోసం పోరాటం మాత్రమే కాదు. ఇది భవిష్యత్తు కోసం పోరాటం. దున్నే రైతులు తమ భూమి మీద సొంతదారులుగా ఉండే భవిష్యత్తు. తాము చేపట్టిన పనిముట్లు కార్మికులకే చెందే భవిష్యత్తు. నదులు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ప్రవహించే భవిష్యత్తు. అరణ్యాలు సమున్నతంగా విస్తరించే భవిష్యత్తు. కొండల మీద చారలు పడని భవిష్యత్తు. హిమఖండాలు రక్షించబడే భవిష్యత్తు. అభివృద్ధి అంటే మానవ గౌరవం, శాంతి, న్యాయం అని అర్థం ఉండే భవిష్యత్తు. విధ్వంసం, పీడన అనే అర్థం ఉండని భవిష్యత్తు. పాఠశాలల్లో భయం కాక స్వేచ్చా భావన నేర్పే భవిష్యత్తు. కుటుంబాలూ సముదాయాలూ ద్వేషం మీద కాక ప్రేమ మీద నిర్మాణమయ్యే భవిష్యత్తు. వీథుల మీద అధికారం పోలీసులకు కాదు, ప్రజలకు ఉండే భవిష్యత్తు. ప్రజాస్వామ్యం కార్పొరేషన్లకు కాదు, పౌరులకు ఉండే భవిష్యత్తు. వాతావరణ సంక్షోభాన్ని లాభాపేక్షతో కాక, న్యాయ భావనతో ఎదుర్కొనే భవిష్యత్తు. వర్తమానపు దురాశ కాక తరతరాల సమానతా న్యాయం విధాన నిర్ణేత అయ్యే భవిష్యత్తు. పెట్టుబడి బలివేదిక మీద ప్రకృతిని బలి ఇవ్వని భవిష్యత్తు.
రాజ్యం చాలా శక్తిమంతమైనదనీ, కార్పొరేషన్లు చాలా సంపన్నమైనవనీ, ద్వేషం లోలోతులనుంచి ఉన్నదనీ, అందువల్ల ప్రతిఘటన నిష్ఫలమనీ పాలకులు మనకు చెపుతుంటారు. తమ నిఘా యంత్రాంగం అసమ్మతిని కాలరాచివేయగలదనీ, తమ ప్రచారం ప్రజలను మొద్దుబార్చగలదనీ, చరిత్రను ఇష్టారాజ్యంగా తిరగరాయవచ్చుననీ, ప్రజాస్వామ్యాన్ని వేలం వేసి ఎవరు ఎక్కువకు పాడితే వారికి అమ్మివేయవచ్చుననీ పాలకులు చెపుతుంటారు.
కాని మనం వాళ్లకు జవాబు చెప్పవలసి ఉంది: మీకన్న ముందర ఎన్నో సామ్రాజ్యాలు అలాగే అనుకున్నాయి. వాటి లాగానే మీరూ కూలిపోతారు.
మన ప్రతిజ్ఞ: ప్రతిఘటన, పునర్నిర్మాణం, అహింసతో విప్లవం
భూమినీ, నీటినీ, అడవులనూ, శ్రమనూ, సాముదాయక సంపదనూ కార్పొరేషన్లు లూటీ చేయడాన్ని ప్రతిఘటించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. చరిత్రకూ, చట్టాలకూ, పౌరసత్వానికీ ఫాసిస్టు తిరగరాతలను ప్రతిఘటించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. విద్యను, ఆరోగ్యసేవలను, గృహవసతిని సరుకీకరణ చేయడాన్ని ప్రతిఘటించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. కార్మికుల హక్కులు కొల్లగొట్టడాన్ని, కుల వివక్షను ప్రతిఘటించడానికి, ఆదివాసీ స్వతంత్ర ప్రతిపత్తిని, స్త్రీ పురుష సమానత్వ న్యాయాన్ని ఎత్తిపట్టడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. జైళ్లలో ఉన్న ఖైదీల విడుదల కోరుతూ, పౌర హక్కుల అణచివేతను ప్రతిఘటిస్తూ, ప్రజాస్వామిక పాలనను కోరుతూ మనం ప్రతిజ్ఞ పూనుదాం. తప్పుడు సమాచార వ్యాప్తినీ, సామాజిక మాధ్యమాలను ఆయుధాలుగా మార్చడాన్నీ ప్రతిఘటించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. దేశాల, ప్రజల సార్వభౌమాధికారాన్ని కొల్లగొడుతూ, అసమానతనూ, దోపిడీనీ పెంచుతూ సాగుతున్న ప్రపంచ పెట్టుబడి ప్రవాహాన్ని ప్రతిఘటించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం.
సముదాయాల మీద, సహకార సంస్థల మీద, పర్యావరణ సమతుల్యత మీద ఆధారపడిన ప్రజా ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. కోటీశ్వరులూ రాజకీయ నాయకులూ కాక గ్రామ సభలూ, ప్రజా శాసనసభలూ ఆధికారం నెరపే రాజకీయాలు సాధించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. దళితులు, ఆదివాసులు, మహిళలు, మైనారిటీలు ఏదోలా బతకడం మాత్రమే కాదు, గౌరవంతో, ఒక సమానత్వ సమాజంలో జీవించగలిగే వ్యవస్థను సాధించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. విద్యార్థులను విధేయమైన యంత్రాలుగా మార్చడం కాకుండా సృజనాత్మక మేధలుగా తీర్చిదిద్దే విద్యా వ్యవస్థ సాధించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. ఏ ఒక్క మనిషినీ చట్టవ్యతిరేకంగా చూడని, ఏ ఒక్క మతాన్నీ ఇతర మతాలకన్న పైన చూడని, ప్రేమ నేరం కాని ఒక దేశాన్ని సాధించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం. వాతావరణ సంక్షోభ పరిష్కారం లాభాపేక్షతో కాక న్యాయభావనతో సాగే ప్రపంచాన్ని, భూగోళాన్ని ఒక వాడుకోగలిగిన ఆస్తిగా కాక, వర్తమాన, భవిష్యత్ జీవులందరి ఉమ్మడి గృహంగా చూసే స్థితి సాధించడానికి మనం ప్రతిజ్ఞ పూనుదాం.
రండి, అందరమూ కలిసికట్టుగా ఈ పోరాట మార్గంలో కవాతు చేద్దాం!
మనం ఎవరో రక్షకుల కోసం ఎదురుచూడలేం. యంత్రాల, యంత్రాంగాల సాయంతో అమ్మకాలు, కొనుగోళ్లతో వోట్లను తారుమారు చేస్తున్న ఎన్నికల మీద మనం నమ్మకం పెట్టుకోలేం. మనం ప్రజల ఉద్యమం. మనం పరివర్తన కోసం పోరాడుదాం.
ఇది మన ఉద్యమం. ఇది మన సొంత ఇల్లు. ఇది మన సొంత దేశం.
మన నినాదాలూ, మన కవాతు పాద ధ్వనులూ విని పాలకులూ, రాజకీయ ఉన్నత వర్గాలూ వణికిపోనీ.
మనం కలిసికట్టుగా లేచి నిలుద్దాం, కలిసికట్టుగా మాట్లాడుదాం, కలిసికట్టుగా పోరాడుదాం. మన ఉమ్మడి భవిష్య దృష్టినీ, మన స్వప్నాలనూ, మన ఆశలనూ ముందుకు తీసుకుపోదాం. మనం మన స్వప్నసీమ అయిన భారతదేశాన్నీ, మానవతనూ నిర్మిద్దాం.
రాజ్యాంగానికి జై! జై భీమ్! జై జన్ ఆందోళన్! జై జగత్!
ప్రజా ప్రతిఘటన వర్ధిల్లాలి!
ప్రజల ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి!
ఎన్ ఎ పి ఎం వర్ధిల్లాలి!
(నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్స్ ముప్పయవ వార్షిక మహాసభ సందర్భంగా 2025 మార్చ్ 4న హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన)