నారాయణుడనే కొత్తదేవుడు ఎలా అవతరించాడు?
రామాయణంలో నిరుత్తరకాండ-44: విష్ణువుకు మరో పేరుగా ప్రసిద్ధమైన నారాయణుడి గురించి కల్లూరి భాస్కరం చెబుతున్న విశేషాలు;

వైష్ణవ భక్తి సంప్రదాయంలో, బహుశా విష్ణువు కన్నా కూడా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది నారాయణుడే; వైష్ణవంలో ఆయనే అతిముఖ్యదైవంగా కనిపిస్తాడు. ‘ఓం నమో నారాయణాయ’ అనేది క్రీ.శ.11వ శతాబ్దికి చెందిన విశిష్టాద్వైత మతస్థాపకుడు రామానుజాచార్యులు ప్రబోధించి ప్రసిద్ధిలోకి తెచ్చిన మంత్రం. ఇటువంటి నారాయణుడి చరిత్రలోకి వెళ్లినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన దృష్టికి వస్తాయి.
ఋగ్వేదంలో విష్ణువును ఉద్దేశించిన సూక్తాలే అతి తక్కువ అనుకుంటే, నారాయణుని ఉద్దేశించిన సూక్తాలు అసలే లేవు. కాకపోతే, ఋగ్వేదం 10వ మండలంలోని 90వ సూక్తాన్ని ‘నారాయణసూక్తం’గా చెబుతారు కానీ, ఆ సూక్తాన్ని చెప్పిన ఋషి పేరు మాత్రమే నారాయణుడు; ఆ సూక్తం ఉద్దేశించిన దేవుడి పేరు, పురుషుడు. పురుషోత్తముడనే పేరుతో ఈ పురుషుడు కూడా విష్ణువు పేర్లలో ఒకటిగా మారాడు; పురుషుని కారణంగానే ఆ సూక్తం ‘పురుషసూక్త’ మైంది.
నారాయణ, పురుషోత్తమ నామాలే కాక; వాసుదేవుడు, రాముడు, కృష్ణుడు మొదలైన పేర్లు, లేదా అవతారాలు కూడా విష్ణువు పేర్లలో చేరాయి; ‘విష్ణుసహస్రనామా’ల పేరిట ఒక స్తోత్రమే వెలసింది. క్రీస్తు పూర్వపు తొలి శతాబ్దాలకు వెడితే, వైదికేతర, లేదా బ్రాహ్మణసంప్రదాయేతరజనాలలో ఒకవైపు శైవ, శాక్తేయాలు; మరోవైపు వాసుదేవుని కొలిచే భాగవతసంప్రదాయమూ ఉండేవి. ‘భాగవత’మనే పేరు ఋగ్వేద దేవతలలో ఒకడైన భగుడి పేరునుంచి వచ్చిందని అంటారు. ఉత్తరభారతంలోని మధుర కేంద్రంగా యాదవులలో పుట్టిన ఈ సంప్రదాయం వాయవ్యభారతంవైపు వ్యాపించింది. అప్పట్లో ఈ దేశంలో స్థిరపడిన కొందరు గ్రీకులు కూడా దానివైపు ఆకర్షితులయ్యారు.
ప్రముఖ చరిత్రకారుడు హేమచంద్ర రాయ్ చౌదరి (మెటీరియల్స్ ఫర్ ది స్టడీ ఆఫ్ ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది వైష్ణవ సెక్ట్- Materials for the study of The Early History of the Vaishnava Sect-1936)ని ఉటంకించుకుంటే, భాగవతసంప్రదాయానికి మూలదైవమైన వాసుదేవుని గురించి ప్రామాణికమైన సమాచారం లేదు. అంటే ఆ దేవుడు ఎలా ఉనికిలోకి వచ్చాడో తెలియదన్నమాట. అదలా ఉంచితే, మొదట్లో బ్రాహ్మణీయసంప్రదాయం భాగవతసంప్రదాయంపట్ల శత్రుపూరితవైఖరితో ఉండేది. మౌర్యులు బౌద్ధమతాన్ని ప్రచారం చేస్తున్న కారణంగా కావచ్చు, క్రమంగా బ్రాహ్మణీయసంప్రదాయం భాగవతసంప్రదాయాన్నితనలో కలుపుకుంది. ఈ విలీనం దరిమిలా వాసుదేవుని కూడా బ్రాహ్మణీయదేవుళ్ళైన విష్ణువుగానూ, నారాయణుడిగానూ గుర్తిస్తూవచ్చారు.
క్రీ.శ. 3-6 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన గుప్తయుగానికి వస్తే, ఆ యుగపు రాజులు కూడా భాగవతసంప్రదాయాన్నిఆదరించారు. మహాభారతం, భాగవతం, భగవద్గీత, రామాయణం ఈ కాలంలోనే లిఖితరూపం ధరించాయంటారు. యోగదర్శనంతోనూ, సూర్య ఆరాధనతోనూ భాగవతసంప్రదాయానికి సన్నిహితసంబంధం ఉన్నట్టు గుప్తయుగానికి చెందిన వివిధలిఖిత ఆధారాలు చెబుతాయనీ; భగవద్గీతలోనూ, నారాయణీయమనే మరో గ్రంథంలోనూ కూడా ఇది కనిపిస్తుందనీ రాయ్ చౌదరి అంటారు. భాగవతసంప్రదాయాన్ని గుప్తుల కాలంనాటి వైష్ణవంగా ఆయన చెబుతూ, ఇందులో విష్ణువు అవతారాలను కొలవడం ప్రముఖంగా కనిపిస్తుందంటారు.
కాకపోతే ఆయన ప్రకారం, గుప్తులకు చెందిన ఏ శాసనంలోనూ రాముడి పేరు కనిపించదు. గుప్తుల కాలానికే చెందినట్టు భావిస్తున్న కాళిదాసు మాత్రం, ’రామాభిదానో హరిః’ అని చెప్పి రాముని ప్రస్తావిస్తాడు. ‘రాముడనే పేరు కలిగిన హరి’ అని ఈ మాటకు అర్థం. దీనినిబట్టి రాముని కొలవడం అప్పటికింకా శైశవదశలోనే ఉందనీ, అసలు విష్ణువు దశావతారాల కల్పనే అనేక మార్పులకు లోనవుతూ అనేక దశల మీదుగా జరిగిందనీ రాయ్ చౌదరి అంటారు.
రామాయణంలో రాముని విష్ణువు అవతారంగా చెప్పిన భాగాలు అనంతరకాలంలో ఎవరో చేర్చి ఉండవచ్చునని మనం అనుకుంటున్న ప్రస్తుతసందర్భంలో ఇవి చాలా ముఖ్యమైన వివరాలు.
దక్షిణభారతానికి వస్తే, క్రీ.శ. 7-10 శతాబ్దాల మధ్య ఆళ్వారులు భక్తి ఉద్యమరూపంలో వైష్ణవాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇది కూడా ఉత్తరభారతానికి చెందిన భాగవతసంప్రదాయంనుంచి, లేదా వాసుదేవకులనుంచి పుట్టినదేనని రాయ్ చౌదరి అంటారు. ఆ తర్వాత ఇది కూడా బ్రాహ్మణసంప్రదాయంలో భాగమై, ఒక తాత్విక ఆలంబనను కూర్చుకుని, తిరిగి భ్రాహ్మణసంప్రదాయేతర జనాలను కలుపుకుంది. రామానుజాచార్యులు మొదలైనవారు ఇందులో ప్రముఖపాత్ర వహించారు. సామాన్యజనం, లేదా జానపదులు కొలుచుకునే దేవుళ్ళను, వారి విశ్వాసాలను, తంతులను ఇలా బ్రాహ్మణీకరించడం మనదేశంలో ఆదిమకాలంనుంచి ఆధునికకాలం వరకూ జరుగుతూవచ్చిన ప్రక్రియ; దీనినే ‘సంస్కృతీకరణ’గా చెప్పడమూ ఉంది. అదలా ఉంచితే, దక్షిణభారతవైష్ణవంలో విష్ణువుకు గల అనేక ఇతర నామాలను మించి నారాయణుడి పేరే ఎక్కువ ప్రాముఖ్యాన్ని తెచ్చుకున్నట్టు కనిపిస్తుంది.
పై చారిత్రకవివరణ స్థూలమే తప్ప సమగ్రం కాదు; కొన్ని ముఖ్యవివరాలు ఇందులో లోపించి ఉండవచ్చు. నారాయణుడి గురించి చెప్పుకునే క్రమంలో మాత్రమే ఈ కాస్త పూర్వరంగాన్ని ఇవ్వవలసివచ్చింది. ఇప్పుడు నారాయణశబ్ద వ్యుత్పత్తితో ప్రారంభించి ఇతర విశేషాలలోకి వెడదాం.
‘నారములు’ అంటే జలాలు, ‘అయనము’ అంటే నివాసంగా ఉన్నవాడు - నారాయణుడని నిఘంటువు చెబుతున్న ఒక అర్థం. ఇందులో జలాలకు సముద్రమనే వివరణ కూడా ఉంది. మరో అర్థం ప్రకారం, ‘నారము’ అంటే నరసమూహం, లేదా జనసమూహం; ఆ జనసమూహం నివాసంగా ఉన్నవాడు; అంటే జనంలో ఉండేవాడు – నారాయణుడు. పౌరాణిక విష్ణువు క్షీరసముద్రంలో శేషతల్పం మీద శయనిస్తాడు కనుక, ఆయనే నారాయణుడు కూడా కనుక ఆమేరకు నారాయణశబ్దానికి చెప్పిన మొదటి అర్థం సరిపోతోంది. అయితే, ‘నారము’ అనే మాటకు నరసమూహమని అర్థం చెప్పి నారాయణుడు జనసమూహమే నివాసంగా ఉన్నవాడని చెప్పడం సూటిగా కాకుండా డొంకతిరుగుడుగా, కృతకంగా, అసంబద్ధంగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఏ దేవుడైనా జనసమూహంలోనే ఉంటాడు.
అదీగాక, మహాభారతం నారాయణుని నరునితో కలిపి చెబుతూ ‘నరనారాయణు’లనే జంటపదానికి ప్రాచుర్యం కల్పించింది. అందులో అర్జునుడు నరుడైతే, కృష్ణుడు నారాయణుడు; మళ్ళీ ఇద్దరూ ముందుజన్మలో అవే పేర్లు కలిగిన ఋషులు. ఋగ్వేదం నారాయణ ఋషిని పేర్కొన్న సంగతిని ఇంతకుముందు చెప్పుకున్నాం. నరనారాయణులనే పేరుతో నరునీ, నారాయణునీ కలిపి చెప్పుకుంటున్నప్పుడు; మళ్ళీ నారాయణ శబ్దంలోని ‘నార’కు కూడా నరుడనే అర్థమే చెప్పుకోవడం కొంత పునరుక్తి దోషానికి దారితీయదా; నారాయణశబ్దానికి నారములు, అంటే జలాలు నివాసంగా కలిగినవాడనే అర్థం సూటిగానూ, అర్థవంతంగానూ ఉండగా; డొంకతిరుగుడుగా, అసంబద్ధంగా కనిపించే రెండో అర్థాన్ని ఎందుకు కల్పించవలసివచ్చిందన్నవి ఇక్కడ సహజంగానే తలెత్తే ప్రశ్నలు.
సంగతేమిటంటే, ‘నారము’ అనే మాట ‘నీరు’ అనే అర్థంలో ద్రవిడభాషల్లో కూడా ఉంది. దీనినిబట్టి ద్రవిడభాషాసంస్కృతుల నేపథ్యం నుంచి నారాయణుడు సంస్కృతంలోకి; వేద, ఇతిహాస, పురాణాదుల్లోకి, వాటి ద్వారా ఉత్తరభారతవైష్ణవంలోకి వెళ్లాడా అన్న సందేహానికి అవకాశం ఏర్పడుతుంది. ఆవిధంగా నారాయణశబ్దానికి ఉన్న ద్రవిడసంబంధానికి అదనంగా, లేదా దానిని మరుగుపుచ్చడానికి ‘నారము’లనే మాటకున్న ‘జన, లేదా నరసమూహ’ మనే రెండో అర్థాన్ని ముందుకు తెచ్చి; జన, లేదా నరసమూహంలో ఉండే దేవుడన్న-ఒక అసంబద్ధ అర్థంలో-నారాయణుని చెప్పారా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
నిజానికి నారాయణుడు ద్రవిడభాషాసంస్కృతుల నేపథ్యంనుంచి ఉత్తరభారతవైష్ణవంలోకి వెళ్లాడా అన్నది పూర్తిగా నిరాధారమైన సందేహం కాదు. అదెలాగో చెప్పుకునే ముందు నారాయణుడి గురించి రాయ్ చౌదరి ఏమన్నారో చూద్దాం:
ఆయన ప్రకారం, నారాయణుని పేరు మొదటిసారి శతపథబ్రాహ్మణంలో కనిపిస్తుంది. వేదాలకు భాష్యాలైన బ్రాహ్మణాలను క్రీ.పూ. 9-7 శతాబ్దాల మధ్యకాలానికి చెందినవిగా చెబుతారు. శతపథబ్రాహ్మణం శుక్లయజుర్వేదానికి భాష్యం. ఇది నారాయణుని విశ్వరూపునిగా చెప్పి, విశ్వసంబంధి అయిన పురుషుడితో ముడిపెడుతుంది తప్ప; విష్ణువుగా, లేదా ఆదిత్యునిగా గుర్తించదు. ఋగ్వేదం 10వ మండలంలో నారాయణుడనే పేరు గల ఋషి చెప్పిన 90వ సూక్తంలో దేవుడు పురుషుడని, అదే పురుషసూక్తం పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిందనీ చెప్పుకున్నాం. ఋగ్వేదంలోని పురుషుడే శతపథబ్రాహ్మణంలోకి ప్రవేశించి ఉండవచ్చు.
ఆ తర్వాత తైత్తిరీయ ఆరణ్యకంలోనూ, మహాభారతంలోనూ నారాయణుని ప్రస్తావన వస్తుంది. క్రీ.పూ.7వ శతాబ్దికి చెందినవిగా చెబుతున్న ఆరణ్యకాలు వేదాలలోని యజ్ఞాలు వగైరా కర్మకాండకు తాత్వికమైన అన్వయాన్ని ఇస్తాయి. అరణ్యాలలో ఆశ్రమజీవనం గడిపే ఋషులు అభివృద్ధిచేసినవిగా వాటికి ఆరణ్యకాలనే పేరు వచ్చిందంటారు. వేదాలకు తాత్విక అన్వయం ఇచ్చేవిగా అవి వేదాలకూ, అనంతరకాలపు ఉపనిషత్తులకూ మధ్య వారధులయ్యాయి. ఆరణ్యకాలలో తైత్తిరీయ ఆరణ్యకం మరింత నవీనం. అదీ, మహాభారతమూ కూడా విష్ణువును, నారాయణుని వేర్వేరు దేవుళ్ళుగానే చెబుతాయని రాయ్ చౌదరి అంటారు.
మొత్తంమీద పైన చెప్పుకున్న వివరాల సారాంశమేమిటంటే, ఋగ్వేదంలో విష్ణువే తప్ప నారాయణుడనే దేవుడు కనిపించడు; ఋగ్వేద అనంతరకాలానికి చెందిన శతపథబ్రాహ్మణం, తైత్తిరీయ ఆరణ్యకం, మహాభారతాలలో మాత్రమే కనిపిస్తాడు. అవి కూడా నారాయణునీ, విష్ణువునూ వేర్వేరుగానే చెబుతాయి తప్ప, నారాయణుడే విష్ణువని చెప్పవు. అంటే ఏమిటన్నమాట! ఋగ్వేదంలో చివరిదైన పదవ మండలంలో ఒక ఋషిగా అడుగుపెట్టిన నారాయణుడు ఆ తర్వాతి వేదవాఙ్మయంలో దేవుడిగా మారి; విష్ణువు మొదలైన ఇతర దేవుళ్ళలో ఒకడిగా ఉండి; ఇంకా ఆ తర్వాతి కాలానికి వచ్చేసరికి తనే విష్ణువు అవడమే కాకుండా వైష్ణవంలో అతిముఖ్యదైవంగా మారాడన్నమాట!
కొత్తగా ఒక దేవుణ్ణి నిర్మించి ఆయనను ఒక్కొక్కమెట్టే పైకి ఎక్కించిన క్రమాన్ని ఈ పరిణామక్రమం మొత్తం కళ్ళకు కట్టిస్తుంది. ఈవిధంగా నారాయణుడు కొత్తగా ప్రవేశపెట్టబడిన దేవుడు! కొత్తదేవుడు!! విచిత్రంగా మహాభారతం ఆయనను అనేక సందర్భాలలో కొత్తదేవుడిగానే పరిచయం చేస్తుంది!
అందులోకి వెళ్లబోయేముందు పైన రాముడి గురించి చెప్పినది కూడా ఇక్కడొకసారి గుర్తుచేసుకోవడం సందర్భోచితంగా ఉంటుంది. గుప్తుల కాలంనాటి వైష్ణవంలో విష్ణువు అవతారాలను ప్రముఖంగా కొలవడం కనిపిస్తుందనీ, అయితే గుప్తులకు సంబంధించిన శాసనాలలో, ఇతర లిఖిత ఆధారాలలో రాముడి ప్రస్తావన కనిపించదనీ, కనుక రాముణ్ణి కొలవడం అప్పటికింకా శైశవదశలో ఉందనీ, దశావతారాల కల్పనే అనేక మార్పులకు లోనవుతూ అనేక దశల మీదుగా జరిగిందనీ రాయ్ చౌదరి అన్నట్టు పైన చెప్పుకున్నాం. అంటే నారాయణుడి విషయంలో చెప్పుకున్న పరిణామక్రమంలాంటిదే రాముడి విషయంలోనూ ఉందన్నమాట. రామాయణంలో రాముని విష్ణువు అవతారంగా చెప్పే భాగాలను ఎవరు, ఎందుకు చేర్చి ఉండవచ్చునన్న వెనకటి ప్రశ్నకూ, దీనికీ ఉన్న ముడిని గుర్తుపెట్టుకుని ముందుగా మహాభారతం నారాయణుని కొత్తదేవుడిగా ఎలా పరిచయం చేసిందో చూద్దాం.
***
మహాభారతం నారాయణునితోపాటు నరుని కూడా కలిపి నరనారాయణుల పేరుతో పరిచయం చేస్తుంది; పరిచయం చేస్తుందనడంలోనే వారిని కొత్తగా ప్రవేశపెట్టారన్నది ధ్వనిస్తుంది. ఆ పరిచయం కూడా ఒకసారి కాదు, ఒకచోట కాదు; అనేకసార్లు, అనేకుల ద్వారా, అనేక చోట్ల ఒక పథకం ప్రకారం జరుగుతుంది.
తొలి పరిచయం అరణ్యపర్వంలో! పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు భవిష్యత్తులో జరగబోయే కురుపాండవసంగ్రామం కోసం అస్త్రసంపాదనకు పూనుకుంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. “పూర్వజన్మలో నువ్వు నరుడనే ఋషివి. నారాయణుని మిత్రుడివి. మీరిద్దరూ బదరికావనంలో అనేకాయుతవర్షాలు తపస్సు చేసిన మహావీర్యవంతులు” అని అర్జునునితో అంటాడు. ‘అయుతము’ అంటే పదివేల సంవత్సరాలు. అర్జునుని నరునిగా చెప్పడానికి ఇదే ప్రారంభం. ‘నువ్వు పూర్వజన్మలో నరుడనే ఋషివి’ అని శివుడు అర్జునునితో చెప్పడం- అర్జునుడికే కాక; పాఠకులకు, లేదా శ్రోతలకు కూడా నరుని కొత్తగా పరిచయం చేస్తున్నట్టే ధ్వనిస్తుంది.
అదే పర్వంలో ఆ తర్వాత ఇంద్రుడు అర్జునుడితో మాట్లాడుతూ, “పూర్వం నువ్వు నరుడనే ఋషివి. బ్రహ్మ నియోగించడంతో మనుష్యుడిగా ఉత్తమక్షత్రియకులంలో ఉద్భవించావు” అంటాడు. ఋగ్వేదం పదవమండలంలో పేర్కొన్న నారాయణుడు కూడా ఋషే నన్న సంగతి ఇక్కడ గుర్తుకొస్తుంది.
అక్కడినుంచి ఉద్యోగపర్వానికి వెడితే, నరనారాయణుల గురించి ఈసారి భీష్ముడు దుర్యోధనుడికి చెబుతాడు. అది మరింత ఆసక్తికరంగా ఉంటుంది:
బ్రహ్మ ఒకసారి కొలువుతీరి ఉన్నాడు. అక్కడున్న ఇంద్రాది దేవతల కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ ఇద్దరు పురుషులు ఒకరినొకరు రాసుకుంటూ వారి ముందునుంచి నడిచి వెళ్లారు. “మిమ్మల్ని కూడా లెక్కచేయకుండా అలా వెడుతున్నారు, ఎవరు వీరు?” అని బ్రహ్మను దేవగురువు బృహస్పతి అడిగాడు.
“వీరు నరుడు, నారాయణుడనే పేర్లతో ప్రసిద్ధి కెక్కిన మునులు, గొప్ప తపోబలం, బలదర్పాలు ఉన్నవారు. లోకహితం కోసం ఏ యుగంలోనైనా చరించగలరు. దేవతలకు మేలు చేస్తారు, దనుజులను శిక్షిస్తారు, అధర్మయుద్ధం జరిగే చోట ధర్మపరులను గెలిపిస్తారు. దేవాసురసంగ్రామంలో ఇంద్రునికి వీరు సాయం చేశారు. అప్పటినుంచి వీరి గురించి అందరికీ తెలుసు” అని బ్రహ్మ చెప్పాడు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే, దేవాసురసంగ్రామంలో ఇంద్రుడికి సాయం చేయడంతో సహా ఇంత చరిత్ర ఉన్న ఆ ఇద్దరి గురించీ అందరికీ తెలుసు కానీ, సాక్షాత్తు దేవగురువైన బృహస్పతికి తెలియదు!
అదలా ఉంచితే, నరునితో కలిపి నారాయణుని కొత్తగా ప్రవేశపెడుతున్న సంగతి, బ్రహ్మతో చెప్పించిన ఈ మాటలలో మరింత స్పష్టంగా ధ్వనిస్తుంది. కాకపోతే, ఈ నారాయణుడు ఋగ్వేదంలో చెప్పిన నారాయణ ఋషిగానే ఉన్నాడు కానీ ఇంకా దేవుడు కాలేదు; ఆయన గురించి చెప్పిన తీరును బట్టి దేవుడుగా మారే క్రమంలో ఉన్నాడని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.
అక్కడినుంచి భీష్మపర్వానికి వెళ్ళేసరికి దేవుడిగా మారనే మారాడు! కురు-పాండవుల యుద్ధం నాలుగవరోజున మళ్ళీ భీష్ముడే, మళ్ళీ దుర్యోధనుడికే నరనారాయణుల మహిమను వివరిస్తాడు. అది ఇలా ఉంటుంది:
“మానస సరస్సు వద్ద బ్రహ్మ కొలువుతీరి ఉన్నాడు. దేవతలు, మునులు, అప్సరసలు ఆయనను కొలుస్తున్నారు. అంతలో మణిఖచితమైన ఒక విమానం మెరిసిపోతూ ఆకాశంలో కనిపించింది. సర్వాత్ముడు అందులో ఉండి తనను సమీపిస్తున్నట్టు గమనించిన బ్రహ్మ లేచి నిలబడి నమస్కరించాడు. ‘నారాయణా! నీకు జన్మించిన నేను, నీ రక్షణలో ఈ జగత్తులన్నింటినీ సృష్టించాను. ఈక్షణాన మానవలోకం రాక్షసుల ఆగడాలవల్ల వ్యాకులమవుతోంది. కరుణించి నువ్వు యాదవకులంలో పుట్టు. నువ్వూ, నీ సఖుడైన నరుడూ నరలోకంలో జన్మించి దైత్యుల పీడ తొలగించండి. భూభారం తగ్గించండి’ అన్నాడు. నారాయణుని నీడ అయిన నరుని కూడా అలాగే ప్రార్థించాడు. నారాయణుడు అలాగే జరుగుతుందంటూ అంతర్థానమయ్యాడు.
ఇదంతా చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ‘పరమేష్టీ! నువ్వంత భక్తి, వినయాలతో ప్రార్థించిన వీరెవరు?’ అని అడిగారు. ‘వీరు పరమమునులు, ఆదిపురుషులు, నర-నారాయణులు, నాకు ఆరాధ్యులు. భూమిమీద జన్మించమని నర సహితంగా ప్రార్థించాను. భూమిమీద క్రీడార్థం జన్మించిన వీరిని కేవలం మర్త్యులుగా భావించి లెక్కచేయనివారు చెడిపోతారు’ అని చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్లిపోయాడు.
చివరిగా, ఈ కథను నారద, పరశురామ, వ్యాసుల ద్వారా తను విన్నానని భీష్ముడు చెబుతాడు.
ఇందులో నారాయణుడు, నరుడే కాదు; వాళ్లతోపాటు వారి అవతారాలుగా కృష్ణుడు, అర్జునుడు కూడా దేవుళ్లుగా మారిపోయారు! అంటే ఏకంగా నలుగురు కొత్తదేవుళ్ళు అవతరించారన్నమాట!
రామాయణంలో రాముని విష్ణువు అవతారంగా మార్చిన ప్రక్రియను అర్థం చేసుకోడానికి మహాభారతంలో జరిగిన ఈ కొత్తదేవుళ్ళ సృష్టి క్లూ ఇస్తూ ఉండవచ్చు.
నారాయణుడి గురించిన మరికొన్ని విశేషాలు తర్వాత...