రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎలాగుంది?

తీపి మాటలు,భారీ ప్రపోజల్స్, కుచ్చు టోపీలు...అంతేనా

Update: 2024-12-05 07:22 GMT

-రమణాచారి

సమయానుకూలంగా, స్వంత అవసరాలకోసం పలుమార్లు మాటలు మార్చి మాట్లాడుతున్న సందర్భంలో నరం లేని నాలుక ఎటైనా, ఏదయినా మాట్లాడుతుంది అనడం పరిపాటి. "నరం లేని నాలుక" అన్నది తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయం ఉన్న లోకోక్తి. దీన్ని ప్రధానంగా మాటి మాటికీ మాట మార్చుతూ మాట్లాడే వారికోసం, మాట్లాడే మాటకు ఆచరణకు తేడా ఉన్న సందర్భంలో దీన్ని వాడుతుంటారు. ప్రధానంగా రాజకీయ పార్టీల నేతలు, అధికారం దక్కించుకోవడం కోసం,అధికారం లో ఉన్న ప్రజాప్రతినిధులు దీని వాడకంలో అగ్రగణ్యులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట ఒంటి మీద బట్టలు మార్చినంత తేలికగా మార్చి మాట్లాడేయగలరు. అందుకే ఈ పదం వారికి ఎక్కువగా నప్పుతుంది.

అధికారం కోసం,ఉన్నతపదవి దక్కించు కోవడానికి రాజకీయ పార్టీ నేతలు ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలు ఇలాగే ఉంటాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో, ప్రధానంగా తెలంగాణలో నేతలకు ఇది పరిపాటిగా మారింది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించి అధికార పీఠం ఎక్కేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ ఇంద్రవెల్లి వెళ్లి నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు. ఖాకీ డ్రెస్ వేసుకుని కార్మికుల కోసం పిడికిలెత్తినట్లు నటించారు. అధికారంలోకి రాగానే నక్సలైట్ల అణచివేత కోసం గ్రేహౌండ్స్ బలగాలను సృష్టించాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉంటూనే మామను గద్దె దింపి అక్రమ మార్గంలో అధికారం దక్కించుకున్న చంద్రబాబు గ్రీన్ టైగర్స్, రెడ్ టైగర్స్, బ్లాక్ టైగర్స్ అంటూ ప్రైవేట్ హంతక ముఠాలను సృష్టించి వివిధ ప్రజా సంఘాల నాయకులను, బెదిరించాడు. పౌర హక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా హత్యలు చేయించాడు. తెలంగాణ నడిబొడ్డున హైదరాబాదులో ఉన్న అసెంబ్లీలో తెలంగాణ అనే పదం వాడవద్దని, వెనుకబడ్డ ప్రాంతాలు అనాలని స్పీకర్ తో రూలింగ్ ఇప్పించాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులపై క్రూర నిర్బంధాన్ని ప్రయోగించాడు. ఆట- పాట- మాట బంద్ అన్నాడు. ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు, మారోజు వీరన్న బూటకపు ఎన్ కౌంటర్, బెల్లి లలిత, అలుగుబెల్లి రవీందర్ రెడ్డి దారుణ హత్యలు ఈయన కాలంలో జరిగినవే. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజల, మేధావుల, బుద్ధి జీవుల డిమాండ్ కు తలొగ్గి వైయస్ రాజశేఖర్ రెడ్డి నక్సలైట్లతో శాంతి చర్చలు తూ.తూ.. మంత్రంలా జరిపాడు. వెనువెంటనే తెలుగు రాష్ట్రాల్లో బూటకపు ఎన్ కౌంటర్లతో రక్తపుటేరులు పారించాడు. మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండాగా ప్రకటించిన కె.సి.ఆర్. ప్రభుత్వం మేడారం అడవుల్లో శృతి, సాగర్ లను అత్యంత పాశవికంగా హత్య చేసింది. తర్వాత కొంత దిద్దుబాటు చేసుకున్నట్లు కనబడింది. కానీ, ప్రజా నిరసనలకు అనుమతించలేదు. తద్వారా ఏర్పడిన ప్రజాగ్రహ ఫలితంగా టి. ఆర్. ఎస్. అధికారం కోల్పోయింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేకుండానే,ఎలాగైనా ఉన్నత పదవి సంపాదించాలని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు రేవంత్ . నక్సలైట్ల వల్ల అభివృద్ధి జరగదని భావించాము గానీ, వారు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పలు వేదికలపై చిలక పలుకులు పలికాడు. మావోయిస్టులు రావాలి, ప్రగతి భవన్ పేల్చి వేయాలి అనే స్థాయి వరకు కాంగ్రెస్ నేతల గొంతులు హోరెత్తాయి.ఎలాగైతేనేం, చంద్రబాబు సహకారంతో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే రెండు బెటాలియన్లు భద్రాచలం, ములుగు ప్రాంతాలకు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. సంవత్సర కాలంలోనే ఆ రెండు ప్రాంతాలలో వేట ప్రారంభించి, ఎన్ కౌంటర్ల పేరిట విప్లవకారులను కాల్చి చంపింది. నాడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి,నేడు మావోయిస్టులమీద గన్నులు పెట్టిస్తున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రం కొనసాగిస్తున్న కగార్ ఆపరేషన్ లో భాగస్వామి అయి మావోయిస్టులను అతి ఘోరంగా, క్రూరంగా ఎన్ కౌంటర్ల పేరున హత్యలు చేయిస్తున్నది. ప్రజా సంఘాలు మీటింగ్ లు పెట్టుకునే అవకాశాలు కల్పించడం, ఎన్కౌంటర్ మృతుల కోసం సమావేశాల నిర్వహణ అనుమతులు. పౌరుహక్కుల నేతల విజ్ఞప్తులను, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాలను తెలిసుకోవడం వంటివి చేస్తున్నారు. కొంత ప్రజాస్వామికంగా కనిపించినా ప్రజల ఆకాంక్షలకు తగినంత మాత్రంలో నెరవేర్చడం లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ప్రచారం చేసిన లేదా భావించిన బుద్ధిజీవులకు, ఉద్యమ కారులకు ఈ వరుస ఘటనలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.

సుమారు ఆరు దశాబ్దాలపాటు వివిధ పోరాట రూపాలలో ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజల మౌలిక సమస్యల పరిష్కారాన్ని ప్రక్కదారి పట్టించేందుకు అభివృద్ధి పేరిట వరుస సమస్యలను సృష్టిస్తోంది. మూసీ సుందరీకరణ, దామగుండం అడవిలో రాడార్ స్టేషన్ ఏర్పాటు, గతంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని ఫోర్త్ సిటీగా అభివృద్ధి, లగచర్ల లో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం, దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీ (ప్రజల తిరుగుబాటుతో వెనక్కి తగ్గడం), మెట్రో రైల్ దారిపొడిగింపు, రీజనల్ రింగ్ రోడ్డు, ఇలా పలు రకాల ప్రతిపాదనలను చేస్తూ నిరంతరంగా ప్రజలను, ప్రతిపక్షాలను తప్పుదారి పట్టించే కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు బయటకు పొక్కకుండా, ప్రజా పాలన నినాదాన్ని ఎత్తుకొని కోట్లాది రూపాయలు ప్రచారానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది.

రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లు దండుకునేందుకు ఇలా చిత్ర విచిత్ర నినాదాలు ఎత్తుకోవడం, తర్వాత అమలు చేయక పోవడం వరుస క్రమంలో జరుగుతుంది. అధికారం కోసం మాత్రమే కాదు, అంతర్గతంగా సహజ సంపదలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి తద్వారా కోట్లాది రూపాయలు దండుకోవడానికి అమలు చేస్తున్న భారీ ప్రణాళిక అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రణాళికల అమలులో అన్ని రాజకీయ పార్టీలది ఒకే ఎజెండా. ప్రశ్నించే వారిని గొంతు నొక్కడం, లోభాలకు మేధావులను అక్కున చేర్చుకోవడం, ప్రతిఘటించే వారి ప్రాణాలు తీయడం మానవ చరిత్ర అంతటా పురావృతం అవుతున్నదే.

దండకారణ్యంలో కాంగ్రెస్ పార్టీ సల్వాజుడుం సృష్టిస్తే, బిజెపి కగార్ ప్రకటించి అమలు చేస్తున్నది .ఎమర్జెన్సీ గురించి అంతా చర్చిస్తున్నారు కానీ, అప్రకటిత ఎమర్జెన్సీ పైన సరైన స్పందన కానరావడం లేదు. అధికారికంగా ప్రకటిస్తే తప్ప సమస్య తీవ్రత అర్ధం చేసుకోలేని అసహాయ స్థితిలో పౌర సమాజం కూరుకుపోవడం బాధించే విషయం. మన కళ్ళ ముందే, కేవలం నేరారోపణ చేయబడ్డ కారణంగా పదేళ్లు అండా సెల్ లో నిర్బంధంచబడి, పూర్తి అనారోగ్యం పాలై మధ్యంతరంగా అసువులు బాసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబా ను మరిచిపోయామా? కేవలం నీరు త్రాగేందుకు స్ట్రా కోసం డిమాండ్ చేసి జైల్లోనే ప్రాణాలు విడిచిన ఫాదర్ స్టాన్ స్వామి గుర్తు లేకుండా పోయాడా? అక్రమ కేసులో ఇరికించబడి నిర్బంధంలో ప్రాణాలు కోల్పోయిన పాండు నరోటే ను ఎందుకు మరిచాం? ప్రశ్నించిన లేదా తేల్చి చెప్పిన బ్రూనో, స్పార్టకస్, సోక్రటీస్ రాజ ద్రోహులుగా గుర్తించబడిన వారే. ఆదివాసుల స్వయం పాలన కోసం పోరాడిన రాంజీ గోండు, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు లాంటి రాజ్యంపై తిరుగుబాటుదారులంతా దేశద్రోహులుగా చిత్రీకరించబడ్డవారే. భగత్ సింగ్, ఆజాద్, సుఖదేవ్ ఇలా ఎందరో నాడు ద్రోహులుగా ప్రకటించబడిన వారే. తర్వాత కాలంలో వీరులుగా గుర్తించబడడం చరిత్రలో సర్వసాధారణంగా జరుగుతున్న విషయమే.దోపిడీ దుర్మార్గాలను ప్రతిఘటించిన వారు, మానవతావాదులంతా పాలకులకంటిలో నలుసులే. అందుకే ఫాసిస్ట్ పాలకులు తాము భయపడుతూ, సమాజాన్ని టెర్రరైజ్ చేసేందుకు ఉద్యమకారులను, విప్లవకారులను పాశవికంగా హత్యలు చేస్తూ శాంతి వచనాలు పలుకుతున్నారు. ఎంతో చైతన్యవంతమైన, సుదీర్ఘ పోరాట చరిత్ర గల తెలంగాణలో పాలకుల ఆటలు కొనసాగడం విషాదకరం

Tags:    

Similar News