భారత రాజ్యాంగంలో బొమ్మలు ఏమి చెబుతున్నాయి?

ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలనా పగ్గాలు చేపట్టారో దాన్ని వారే అతిక్రమిస్తుంటారు.

Update: 2024-12-28 10:46 GMT

 భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన ప్రత్యేక చర్చ గందర గోళంతో ముగిసింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ను అవమానించారంటూ పార్లమెంట్ లోపలా వెలుపలా జరిగిన ఆందోళనలో అనూహ్య దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఎన్డీఏ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గౌరవాన్ని కాపాడేందుకు. కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలని రాజ్యాంగాన్న పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. వీటి వల్ల రాజ్యాంగం గురించి ఏమి చర్చించారు అనేది మరుగున పడి పోయింది. అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు మీరు రాజ్యాంగ వ్యతిరేకులంటే కాదు మీరని, రాజ్యాంగాన్నిగౌరవించకుండా మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, విమర్శించు కున్నారు. ఈ 75 సంవత్సరాలలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ప్రవర్తించారో సోదాహరణల తో దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ వివరాల ద్వారా ప్రజలకు అర్థమయ్యింది ఒక్కటే. ఇంతకాలం నుంచి పరిపాలించి న వారికే రాజ్యాంగం ప్రకారం నడవాలనే సోయి లేదు. అధికారం తో విర్రవీగుతూ ప్రతి పార్టీ తనకు అనుకూలమైన విధానాలు రాజ్యాంగ బద్దమైనా, కాకపోయినా ప్రజల పై బలవంతంగా రుద్దుతున్నాయి. వీరి నీతివాక్యాలు, ప్రవచనాలు నమ్మి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నది సామాన్య ప్రజలు మాత్రమే. ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలనా పగ్గాలు చెపట్టారో దాన్ని వారే అతిక్రమిస్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు సంధించుకుంటున్న సమయంలో కొన్ని ఆసక్తికరమైన, ఎక్కువ మందికి తెలియని అంశాలు కూడా బయటకు వచ్చాయి. వాటిలో ఒకటి రాజ్యాంగంలో పొందుపరిచిన చిత్రాలు. కేంద్ర హోమ్ మంత్రి అమీత్ షా వాటి గురించి మాట్లాడారు.

రాజ్యాంగపు మూల ప్రతిలో కనిపించే గొప్ప చిత్రాలను మరుగు పరిచి, రాజ్యాంగాన్ని కేవలం మాటలకు కుదించారని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ద్రోహం చేయడమేనని ఆయన విమర్శించారు. రాముడు, బుద్ధుడు, జైన మహావీరుడు,, గురు గోవింద్ సింగ్ ల చిత్రాలు ఎన్నో విలువలను ప్రబోధిస్తాయని ఆయన అన్నారు. రాముడు, సీత, లక్ష్మణుల చిత్రాలు ప్రాథమిక హక్కులకు ప్రాతినిధ్యం వహిస్తాయని, భగవద్గీత, శివాజీ మహారాజ్, రాణి లక్ష్మీబాయిలను చేర్చడం దేశభక్తికి ప్రోత్సాహ మిస్తుందని ఆయన అన్నారు. నలంద విశ్వవిద్యాలయం భారతదేశ ప్రాచీన విద్యావిధానానికి ప్రతీక అని, గురుకుల వ్యవస్థ విద్య యొక్క ఆదర్శ నిర్మాణంపై అంతర్ దృష్టిని అందిస్తుందని ఆయన వివరించారు. నటరాజ ప్రతిరూపం జీవితంలో సమతుల్యత సూత్రాన్ని ప్రతిబింబిస్తుందంటూ ఆయన ప్రసంగించారు.

ఈ చిత్రాలు, దృశ్యాల బొమ్మలు వేల సంవత్సరాల భారత నాగరికతకు గాఢమైన వ్యక్తీకరణలని ఆయన నొక్కి చెప్పారు. తద్వారా "మేరా భారత్ మహాన్" సిద్ధాంతాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు. ఆధునిక విలువల నుంచి దృష్టి మరల్చి మనుస్మృతి వంటి ప్రాచీన ధర్మాల వైపు దేశాన్ని నడిపించడానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న సంప్రదాయ పునరుద్ధరణ ప్రయత్నాలలో భాగంగా ఆయన ఈ ప్రస్తావనలు చేశారు. బొమ్మల పై, భారత సంస్కృతి పై ఆయనకు అంత ప్రత్యేక ఆసక్తి ఉంటే రాతప్రతిలో ఉన్న అక్బర్, టిప్పుసుల్తాన్ చిత్రాలను ఎందుకు ప్రస్తావించలేదు? కేవలం హిందూ దేవతలను వారి చిత్రాలను ప్రస్తావించి రాజ్యాంగం నుంచి ఆ దేవతలను తరిమేశారనే భావనను సృష్టించడమె ఆయన ఉద్దేశ్యము. ఇది ఉద్దేశపూర్వకంగా తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని అన్వయించుకోవడం కాదా?

భారత రాజ్యాంగం యొక్క మూల రాతప్రతిలో చిత్రాలు ఉన్న మాట వాస్తవమే. అవి ఎలా ఎప్పుడు వచ్చి చేరాయో చూద్దాము. 1950లో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మార్గదర్శకత్వంలో ఏర్పాటైన కమీషన్ రాజ్యాంగాన్ని చేతిరాత ప్రతిగా తయారు చేయాలని సంకల్పించింది. ఢిల్లీకి చెందిన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా (సక్సేనా) ఇటాలిక్ శైలిలో రాజ్యాంగాన్ని అక్షరీకరించారు. భారత రాజ్యాంగ ప్రతిని అందంగా రూపొందించే బాధ్యతను ప్రముఖ శాంతినికేతన్ చిత్రకారుడు నందలాల్ బోస్ కు అప్పగించారు. ఆయన బ్రిటిష్ వలస వాద చిత్రకళా శైలికి భిన్నంగా బెంగాల్ పునరుజ్జీవ నోద్యమంలోభాగంగా శాంతినికేతన్ శైలిని అభివృద్ది పరచిన గొప్ప చిత్రకారుడు. రాజ్యాంగంలోని ప్రతి భాగం ప్రారంభంలో, నందలాల్ బోస్ భారతీయ చరిత్ర , సంస్కృతి యొక్క వివిధ దశలకు ప్రాతినిధ్యం వహించే 22 దృశ్యాలను చిత్రీకరించాడు. ప్రతి పేజీకి ఒక ఫ్రేమ్ ఉంది. దానిని శాంతినికేతన్ శైలిలో అలంకరించారు. ఈ చిత్రాలంకరణ కు నాలుగు సంవత్సరాలు పట్టి 1954 లో పూర్తయ్యింది. ఒరిజినల్ వెర్షన్ పై 1950 జనవరిలో రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ సంతకం చేశారు. దాని ఫోటోలిథోగ్రాఫ్ కాపీలను డెహ్రాడూన్ లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో భద్రపరిచారు.

భారత రాజ్యాంగం యొక్క నిర్దిష్ట చేతిరాత సంచికలోని చిత్రాలను పన్నెండు చారిత్రక కాలాలుగా వర్గీకరించారు. అవి - మొహెంజోదారో కాలం, వేద కాలం, ఇతిహాస కాలం, మహాజనపద-నంద కాలం, మౌర్య కాలం, గుప్త కాలం, మధ్యయుగ కాలం, ముస్లిం కాలం, బ్రిటిష్ కాలం, భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమం మరియు సహజ లక్షణాలు. ఈ చిత్రాలన్ని కలిపి చూస్తే భారతీయ సమాజ నిర్మాణం గురించి, సంస్కృతి గురించి రేఖా మాత్రంగా ఒక అవగాహన కలగడానికి తోడ్పడతాయి. ఒక్కొక్క బొమ్మను విడిగా పరిశీలిస్తే అవి భారతీయ సంస్కృతి లేక గతం లోని విశిష్ట ఘట్టాలను ప్రతిబింబిస్తాయి.

ఈ బొమ్మల్లో మొదటిది బుల్ సీల్ [వృషభ ముద్ర] భౌగోళికంగా సింధు లోయ-దక్షిణాసియా లోని ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉండేది. సింధు లోయ-మొహంజదారో-నాగరికత గొప్పతనాన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కోణాల్లో పండితులు చర్చించారు.. సింధు లోయ నాగరికతకు ప్రతిబింబమైన ఈ ఎద్దు ముద్రను భారతీయ ప్రాచీన నాగరికతకు చిహ్నంగా స్వీకరించారు. ఇది శక్తి, బలం, నాయకత్వ లక్షణాలకు ప్రతీక.

రెండవ చిత్రం ఒక వేద ఆశ్రమ సన్నివేశం. పురుష సన్యాసి వ్యక్తులు ప్రార్థనలు, యజ్ఞాలు చేయడం వంటి రోజువారీ విధులను నిర్వహిస్తుంటారు. కనిపించే వృక్షజాలం, జంతుజాలం ఈ ఆశ్రమం యొక్క భౌగోళిక స్థానాన్ని ఆశ్రమ పర్యావరణ వ్యవస్థ గురించి సాధారణ అవగాహనను కలిగిస్తుంది. భారతీయ సంస్కృతిలో మతం కీలక పాత్ర పోషించే ఒక కోణాన్ని చిత్రించడానికి చిత్రకారుడు ప్రయత్నించాడు.మానవాళిని ప్రకృతితో అనుసంధానం చేయడం, కనిపిస్తుంది..ఒకప్పుడు జ్ఞాన ఉత్పత్తికి ముఖ్యమైన వనరుగా వున్న పురాతన సంప్రదాయ వ్యవస్థకు ప్రతీకగా ఈ చిత్రాన్ని భావించవచ్చు.

మూడవ చిత్రం ప్రాచీన ఇతిహాసం రామాయణంలోని ఒక ముఖ్యమైన సన్నివేశం. ఇది ప్రాథమిక హక్కులు అనే మూడవ భాగం ప్రారంభం లో వున్నది. ఇక్కడ సీత ,రాముడు, లక్ష్మణుడితో కలిసి రథంపై ప్రయాణిస్తూ మధ్యలో కూర్చుంది. ఈ మూడు పాత్రలు కలిసి రథంపై ప్రయాణించిన సందర్భాలు కనీసం రెండు ఉన్నాయి. మొదటిది, వారు పద్నాలుగు సంవత్సరాల పాటు రాజ్య బహిష్కరణకు గురైనప్పుడు . రెండవది, వనవాస కాలం గడిపిన తరువాత వారి రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు. ఈ చిత్రం బహిష్కరణను సూచిస్తుందా లేదా తిరిగి రావడాన్ని సూచిస్తుందా అనేది చెప్పలేము. కానీ ఒక వ్యక్తి ఉన్నత స్థాయి చైతన్యానికి చేరుకోవడానికి చేయవలసిన ప్రయాణాన్ని ఈ చిత్రం సూచిస్తుంది.

పటం 4. లో కృష్ణుడు తన స్వంత బంధువైన కౌరవులతో యుద్ధానికి వెళ్ళడానికి అపరాధభావంతో ఉన్న అర్జునుడిని ఒప్పిస్తాడు. నైతిక బాధ్యతల కంటే 'ధర్మం' లేదా కర్తవ్యం యొక్క ప్రాముఖ్యత ముఖ్యం అని కృష్ణుడు అర్జునుడికి గీతాబోధన చేసినట్లు ఇతిహాసం పేర్కొంది.

పటం 5 లో మరొక ఆశ్రమ దృశ్యాన్ని చూస్తాము, కూర్చుని వున్న బుద్ధుని చుట్టూ ఆయన శిష్యులు, అనేక జంతువులు ధ్యానం చేస్తున్నట్లుగా వుంటుంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో బౌద్ధ తత్వశాస్త్రం భారతీయ సంస్కృతి లో ఒక కీలక సారాంశంగా ఉంది. మహాత్మా గాంధీ అహింసను ఒక వ్యూహంగా స్వీకరించినందున ప్రకృతి,మానవత్వం గురించి బుద్ధుని ఇతర బోధనలు కూడా ప్రాచుర్యం పొందాయి.సచిత్ర రాజ్యాంగంలోని రెండు ఆశ్రమ దృశ్యాలు బహుళ ఆచారాలు, పద్ధతు లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కనిపిస్తాయి. .

 

పటం 6. ఈ వ్రాతప్రతిలోని ఆరవ చిత్రం జైన మతానికి చెందిన ఇరవై నాలుగవ తీర్థంకరుడైన మహావీరుడు. ఇక్కడ ఆయన రెండు అరచేతులను ఒకదానికొకటి ఆనించి, కళ్ళు మూసుకుని, ముఖం మూసుకుని పైకి చూస్తూ కూర్చున్నాడు. విలక్షణమైన నేపథ్యం వున్నది. ఆకాశం, భూమి,చేపలతో కూడిన నది, ఒక పక్షి, నెమలి/హంస తలకిందుల పువ్వును పట్టుకొని కనిపిస్తున్నది. అహింస, మానవ ఆత్మ విముక్తిపై ఆధారపడిన ఒక సాంస్కృతిక ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది, తద్వారా జైనులను వారి అనుచరులను భారతీయ సంస్కృతిలో భాగంగా గుర్తించారు.

పటం 7. అశోక చక్రవర్తి ఒక శక్తివంతమైన ఏనుగుపై కూర్చున్నాడు, అతని ముందు బౌద్ధ సన్యాసులు ఉన్నారు. చక్రవర్తి వెంట అనేక మంది సేవకులు బహుమతులు ధరించి కవాతు చేయడం ఈ చిత్రంలో కనిపిస్తుంది. అశోక మహారాజు ఏ ప్రాణినీ బాధించనని ప్రతిజ్ఞ చేశాదు. అశోకుడు బౌద్ధమతానికి పోషకుడు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అశోకుని నుండి రెండు ప్రాతినిధ్యాలను స్వీకరించింది ఒకటి జాతీయ చిహ్నమైన సింహాల ప్రతిమ, రెండవది జాతీయ జెండా మధ్యలో ఉన్న అశోక చక్రం లేదా ధర్మ చక్రం. స్వాతంత్ర్యోద్యమ చారిత్రాత్మక పరిణామాల తరువాత సమానత్వం, సామరస్యానికి చిహ్నంగా అశోక ధర్మం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

పటం 8. ఒక కాలు ముడుచుకుని, చేతులు పైకి చాచి, ఎగిరి పోతున్నట్లు వున్న పెద్ద పొట్ట గల మగ ఆకారం కనిపిస్తోంది. ఎడమ వైపున ఉన్న చిత్రంలో కొన్ని మొక్కలు, బ్యాక్ గ్రౌండ్ లో ఇల్లు లాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఇది గుప్తరాజుల కాలంనాటి చిత్ర విశేషం. బహుశా ఇది దేవతలకు- మానవులకు మధ్య దూతలుగా వ్యవహరిస్తారని పేరున్న గంధర్వులను ప్రతిబింబిస్తున్నది.

పటం 9.విక్రమాదిత్య రాజు (క్రీ.శ. 389 - 415) ఆస్థానం యొక్క సచిత్ర ప్రతిరూపం. పాలకుడు సింహాసనంపై కూర్చొని సంగీత కారులు, నృత్యకారులు ప్రదర్శనలు ఇస్తుండగా, జంతువులు మరియు పక్షులు కూడా శ్రావ్యమైన బాణీలను వింటున్నట్లు వుంటుంది. ఈ రాజు సాహిత్యం, కళలకు గొప్ప పోషకుడు అని పేరు పొందాడు. అతని రాజ్యం దక్షిణాసియాలో సుదూరంగా విస్తరించింది. చక్రవర్తి రాజ్యం గురించి చైనా యాత్రికుల అభిప్రాయం ప్రకారం, అతని పాలన అసాధారణ మైనది .అతను హిందువు అయినప్పటికీ, ఇతర నమ్మకాలు మరియు మత విశ్వాసాల పట్ల సహనంతో ఉండేవాడు. 'మన మహిమాన్విత గతం' “ విస్తృతమైన కీర్తి’ ని గుర్తు చేయటానికి ఈ చిత్రం చేర్చి వుంటారు.

పటం 10. ఈ చిత్రంలో ఒక విశ్వ విద్యాలయంల కనిపిస్తుంది. అనేకమంది విద్యార్ధులు పండితులు చర్చల సాగిస్తున్నట్లు వుంది. బహుశా ఇది నలందా విశ్వ విద్యాలయం రూపు కావొచ్చు.

11 వ పటం: ఇది కోణార్క్ లోని ఒక ఇసుకరాయి శిల్పం నమూనా నుడి గీయబడింది. ఆ శిల్పంలో కత్తితో సాయుధుడైన ఒక వ్యక్తి గుర్రం పక్కన నిలబడిన మరో వ్యక్తికి శిరచ్చేదం చేసినట్లు వుంటుంది. ఇదే శిల్పం 1949 లో10 పైసల పోస్టల్ స్టాంపుపై ముద్రించ బడింది. ఇక్కడ కూడా ఆ బొమ్మ తలలేకుండా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో శిరచ్ఛేదం చేయబడిన వ్యక్తికి తలను అతికించారు. మత పరమైన కారణాల వల్ల శిల్పాలను వికృతం చేస్తున్న వైఖరికి ప్రపంచ వ్యాప్తంగా అనేక శిల్పాలు సాక్ష్యంగా వున్నాయి . ప్రకృతి వైపరీత్యాలు కూడా కొన్ని బొమ్మలను విరూపం చేసి వుండవచ్చు. అందువల్ల ఇక్కడ తలను చేర్చడం గత చారిత్రక దుస్సంఘటనలను అంగీకరించమని , వాటిని సరిచేస్తామని చెప్పడానికి ఒక చిహ్నం కావొచ్చు. అక్కడ తలను తిరిగి అతికించడాన్ని బిజెపి ప్రభుత్వం మసీదుల వెనుక వున్న దేవాలయాల పునరుద్ధరణకు స్పూర్తిగా తీసుకోవచ్చు

పటం 12: హిందూ దేవత అయిన నటరాజు నృత్య దృశ్యం, అనేక మత గ్రంథాలు, పుణ్యక్షేత్రాలలో శివుడిని నటరాజు గా చూపించారు. మానవులోని అజ్ఞానాని కి చిహ్నమైన మరుగుజ్జు- అపస్మార పురుషుని పై తాండవ మాడుతున్న నటరాజు తన ఎడమ వెనుక చేతిలో అగ్నిని, కుడి వెనుక చేతిలో దమరుక మనే వాయిద్యాన్ని కలిగి ఉంటాడు. ఎడమ చేయి గజహస్త స్థితిలో ఉండగా, ముందు కుడి చేయి అభయ ముద్రలో ఉంటుంది. భక్తులకు భరోసాను ఇస్తున్నట్లు వుంటుంది. నటరాజ విగ్రహం పూర్తిగా భారతీయమైనది అది కాలక్రమేణా, భారతీయతను సూచించే సాంస్కృతిక చిహ్నంగా మారింది.

13వ చిత్రం: మహాబలిపురం ఏకశిలా రాతి శిల్పం ఈ విగ్రహానికి ప్రత్యక్ష నమూనా. ఇందులో అనేక మంది పౌరాణిక వ్యక్తులను చూడవచ్చు- గంగను భూమికి దించడానికి తపస్సు చేసిన భగీరథుడు కనిపిస్తాడు. దేవతలు, జానపదాలు సంస్కృతిలో ముఖ్యమైన భాగాలు, నందలాల్ బోస్ గంగా నది యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపాడు. కాని నది, దాని ఒడ్డున సాధారణ కార్యకలాపాల వాస్తవిక చిత్రణను ఇవ్వకుండా పురాణాలు ఇతిహాసాల ద్వారా ప్రస్తావించాడు.

పటం 14. భారతదేశాన్ని ఏలిన ప్రసిద్ధ రాజ వంశాలలో ఒకటైన మొఘలుల ప్రాతినిధ్యం ఈ చిత్రం.ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థాన కళాకారులతో సమావేశమై సింహాసనంపై కూర్చుని వున్నాడు.మొఘలుల 225 సంవత్సరాల పాలనలో అనేక యుద్ధాలు జరిగాయి. అలాగే అనేక బృహత్ నిర్మాణాలకు, కళాఖండాలకు, కట్టడాలకు జన్మనిచ్చింది. ఈ ముస్లిం పాలకుల కృషికి ఒక ప్రతీకాత్మక చిన్న ప్రస్తావన ఈ చిత్రం.

పటం 15(ఎ)చిత్రంలో మరాఠా పాలకుడు శివాజీ, గురుగోవింద్ సింగ్ లు, 15(బి) భాగం లో రాణి లక్ష్మీబాయి, టిప్పు సుల్తాన్ ఉన్నారు. బొమ్మలతో పాటు, కత్తులు, ఈటెలు, విల్లులు బాణాలవంటి వారి శక్తివంతమైన ఆయుధాలు కూడ ప్రముఖం గా కనబడతాయి. మొత్తం రాతప్రతిలో చిత్రించబడిన ఏకైక చారిత్రక మహిళ లక్ష్మీ బాయి.

16 వ చిత్రం లో బ్రిటీష్ పాలకులు ఉప్పుపై చట్టవిరుద్ధంగా పన్ను విధించడాన్ని నిరసిస్తూ గాంధీ తన అనుచరులతో కలిసి చేసిన దండి యాత్ర చిత్రణ వుంది. గాంధేయ సిద్ధాంతాలకు సంఘీభావంగా ఠాగూర్ రాసిన 'ఏక్లా చోలో' అనే పాటతో ఈ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధీ పాత్రకు సగౌరవ ప్రతీక ఈ చిత్రం పటం 17: ఒక సామాజిక సమావేశం సందర్భంగా గాంధీకి స్వాగతం పలుకుతున్న చిత్రం,.నవకాలి మత మతకలహాల సమయంలో గాంధీ చేసిన కృషిని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో తిలకం దిద్దుతున్న హిందూ స్త్రీలు, కుఫీ టోపీలు, గళ్ళ లుంగీతో వున్నముస్లిం పురుషుల ప్రాతినిధ్యం గుర్తించదగినది.

పటం 18. స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్ ప్రయాణాన్ని ఇక్కడ చిత్రించారు. బోస్ తన సైనిక దుస్తులలో , తల పైకెత్తి, భారత జాతీయ పతాకానికి నమస్కరిస్తూ వుండగా; శక్తిమంతమైన పర్వతాల నేపథ్యంలో దిగుతున్న యుద్ధ విమానాలు, హడావుడిగా కదులుతున్న సైనికులు కనిపిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బోస్ ఒక భారత జాతీయ దళానికి నాయకత్వం వహించాడని వివిధ చారిత్రక ఆధారాల ద్వారా స్పష్టమవుతోంది. భారతదేశంలోని తన రాజకీయ సమకాలికులతో ఆయనకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, స్వాతంత్ర్యోద్యమానికి ఆయన చేసిన కృషికి ఆయన విప్లవాత్మక దృష్టికి ప్రజలు చూపిన గౌరవానికి తార్కాణంగా ఈ చిత్రం కనిపిస్తుంది.

పటం 19: కొండ ప్రాంతాలు, బహుశా హిమాలయాల నేపథ్యంలో కొందరు నడుచుకుంటూ వెళ్తున్న సమూహాలు కనిపిస్తాయి ఒంటె వీపులపై వెళ్తుండటాన్ని కూడా చూడవచ్చు. ఈ చిత్రం లో యుద్ధ ఆయుధాలు ఏవీ కనిపించనందున, వీరు కవాతు చేస్తున్న సైనికులు కాదని ఊహించవచ్చు. ఇది బహుశా ప్రాచీన వాణిజ్యాన్ని సూచిస్తున్న దేమో. . దీనికి భిన్నంగా వీరు కశ్మీరీ తత్వవేత్త ఆధ్యాత్మికవేత్త అభినవ్ గుప్తా అనుచరులని, అతను ఒంటెపై సమూహానికి నాయకత్వం వహిస్తున్నాడని మరి కొందరు భావిస్తారు. ఈ చిత్రం వల్ల జ్ఞాన, ఉత్పత్తి రంగాల ఉచ్చ దశను తెలుసుకోవచ్చు. జిజ్ఞాసులు జ్ఞాన సేకరణకు భారత దేశాన్ని సందర్శించారనేది ఒక వాస్తవం. ఈ చిత్రం దానికి ప్రతీక కావొచ్చు.

 

నంద లాల్ బోస్ స్వాతంత్య్రానికి పూర్వం పలు బహిరంగ సభలకు పెవిలియన్ల రూపకల్పన లో కృషి చేశారు. పోస్టర్ల నుండి సభల లేఅవుట్ల రూపకల్పన వరకు, బోస్ తన శైలిని, సౌందర్య జ్ఞానాన్ని పార్టీ ప్రచారానికి కొత్త దృశ్య భాషను నిర్మించడానికి ఉపయోగించారు.స్వాతంత్ర్య పోరాటం అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల తో పెన వేసుకుని సాగింది. రాజ్యాంగ ప్రతిలో బోస్ చిత్రించిన దృశ్యాలు ఈ చరిత్రను రూపు కడతాయి. కళాకారులు భారత గణతంత్రానికి సాంస్కృతికంగా పునాదిగా వాటిని చిత్రించారు. .

అయితే ఈ చిత్రాలంకరణ రాజ్యాంగంలోని విషయాంతర్భాగం కాదని, కేవలం అలంకారిక కాలిగ్రఫీ లో భాగమని అనేకులు పరిగణిస్తారు. చిత్రాలకు కాలక్రమం గాని లేదా చిత్రం క్రింది భాగంలోని పాఠంతో గాని ఎటువంటి సంబంధం లేదు. ఎలాంటి అన్వయమూ లేదు. అసలు భారత రాజ్యాంగం అంటే 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లు, పీఠిక మాత్రమే అని ఎక్కువ మంది భావిస్తారు. అలాంటి చిత్రాలను ఇప్పుదు సవివరంగా గుర్తు చేయడంలో అమిత్ షా కు ఒక ప్రచ్చన్న ఉద్దేశం లేకపోలేదు.

ఈ చిత్రాలలో వాస్తవ చరిత్ర, భౌగోళిక అంశాలు, పురాణ గాథల మేళవింపు ఉంది. రామాయణం, మహాభారతం వంటి మన పురాణాలకు సంబంధించిన చిత్రాలను 'ఇతిహాస కాలం' కింద ముద్రవేసి, కాలక్రమం ప్రకారం 'వేద కాలం' తర్వాత జాబితాలో చేర్చారు. ఇది ఇతిహాసాలను చరిత్రగా పరిగణిస్తున్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అయితే కళాకారులు వాటిని సాంస్కృతిక పునాదిగా చూసే అవకాశం ఉంది. భారతీయత పేర ఈ చిత్రాలకు రాజ్యాంగ చిత్రమాలికలో స్థానం కల్పించారు. అయితే ఈ సాంస్కృతిక సమ్మేళనాన్ని పూర్తి వాస్తవ చరిత్ర గా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు పరిపాలకులు. ఏది సత్యం, ఏది కల్పన అన్న సరిహద్దులు చెరిపివేసి అంతటినీ మన చరిత్ర గా వ్యవహరిస్తున్నారు. చివరకు లౌకిక వ్యవహారాలలో కూడా వీటిని సాక్ష్యాలుగా అంగీకరించి న్యాయమూర్తులు తీర్పులు ఇస్తున్నారు. పౌరాణిక గాధల ఆధారంగా ఒక భ్రమను వ్యాపింప జేస్తూ ఒక జాతీయ మిథ్యా గౌరవాన్ని సృష్టిస్తున్నారు. ప్రస్తుతం భారత జాతీయత పేర ఇది చలామణి అవుతున్నది. సచిత్ర రాజ్యాంగంలోని కొన్ని చిత్రాలు దానికి తోడ్పడే విధంగా వుండటంతో ప్రస్తుతం వాటిని ప్రచారం చేస్తున్నా రు.

దేశం, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, ప్రజలు వారి ప్రాధమిక హక్కులు వంటి ముఖ్యమైన అంశాలను చర్చించే బహుళ పునాదులు కలిగి ఉన్న భారత రాజ్యాంగం లోని పాఠ్యాంశానికి, ఈ చిత్రాలకు పొంతన లేదు. ఈ చిత్రాలు ఆధునిక అభివృద్ధికి ఎలా తోడ్పడతాయి? అని ఆలోచించాలి. చారిత్రక స్పృహ వుండటం వేరు. చరిత్రలోనే కూరుకు పోయి వుండటం వేరు అని గుర్తించాలి. రాజ్యాంగం లో భాగమైనా కాకపోయినా రాజ్యాంగ ప్రతిలో ఇవి వున్నాయి. వీటికి ఒక ప్రయోజనం వుంటుంది. కేవలం అలంకరణగా మాత్రమే చూడలేము. చిత్రకారుని లేక వారిని నియోగించిన కమిషన్ భావజాలం ప్రకారమే ఈ బొమ్మలు స్థానం పొందాయని నిర్ద్వంద్వం గా చెప్పుకోవాలి. ఆనాటి వారి ఉద్దేశ్యాలు ఎలాగున్నా అవే బొమ్మలను ఈ నాడు సాంస్కృతిక పునరుజ్జీవనం పేరిట తిరోగమనానికి ఉపయోగించుకోవటం గర్హ్యనీయం. దీనికి కావలసిన భావజాల పునాదులు ఆ బొమ్మలలోనే వున్నాయని భావించక తప్పదు.

Tags:    

Similar News