పహల్గామ్ దాడి: నాలుగు జంటలను కాపాడిన కశ్మీరీ గైడ్..
ప్రాణాలను ఫణంగా పెట్టి..కశ్మీర్‌ను పర్యటనకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఎనిమిది మందిని, వారి పిల్లలను కాపాడిన నజకత్ అహ్మద్ షా..;
పహల్గామ్(Pahalgam)కు సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రమూకలు తుపాకులతో కాల్పులకు తెగబడినపుడు..28 ఏళ్ల కశ్మీరీ టూరిస్ట్ గైడ్ (Guide) నజకత్ అహ్మద్ షా ధైర్యసాహసాలు చాటాడు. ప్రాణాలను ఫణంగా పెట్టి ఓ పర్యటక బృందాన్ని (Tourists) కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు.
'షా రుణం ఎప్పటికీ తీర్చుకోలేం’
పహల్గామ్ నుంచి తిరిగివచ్చాక పర్యాటకుల్లో ఒకరైన అరవింద్ అగర్వాల్ షాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "మీ ప్రాణాలను పణంగా పెట్టి మా ప్రాణాలను కాపాడారు. నజకత్ భాయ్ రుణాన్ని మేం ఎన్నిటీకీ తీర్చుకోలేము" అని రాసుకొచ్చారు. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో షా వెలుగులోకి వచ్చారు.
ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లా నుంచి నాలుగు జంటలు ఇద్దరు పిల్లలలో కలిసి జమ్ము కశ్మీర్ పర్యటనకు బయల్దేరాయి. అగర్వాల్, కుల్దీప్ స్థపక్, శివాంష్ జైన్, హ్యాపీ వాధవన్ కుటుంబాలకు టూరిస్ట్ గైడ్ నజకత్ అహ్మద్ చాలా ఏళ్లుగా తెలుసు. ఇతను శీతాకాలంలో చిర్మిరిలో శాలువలు అమ్మడానికి వస్తుండడంతో వీరికి పరిచయమయ్యాడు.
దగ్గరుండి తీసుకొచ్చా...
"వారంతా ఏప్రిల్ 17న జమ్మూకు రావడంతో నేను రిసీవ్ చేసుకున్నా. శ్రీనగర్, గుల్మార్గ్, సోన్‌మార్గ్ చూశాక చివరగా పహల్గామ్‌కు వెళ్లాం. మా గ్రామం పహల్గామ్‌కు సమీపంలో ఉండడం వల్ల దాన్ని టూర్ షెడ్యూల్ చివర్లో ఉంచాల్సి వచ్చింది." అని షా చెప్పారు.
టపాసుల శబ్ధం అనుకున్నాం..
"మధ్యాహ్న సమయంలో బైసరన్ చేరుకున్నాం. పర్యాటకులు పోనీ రైడ్‌ను ఆస్వాదిస్తూ.. ఫొటోలు తీసుకుంటున్నారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. ఇక బయల్దేరుదాం అని చెప్పా. ఫొటోల కోసం కుల్దీప్ మమ్మల్ని వెయిట్ చేయించారు. అప్పుడే మాకు కాల్పుల శబ్ధం వినిపించింది. మేము మొదట్లో టపాసుల శబ్ధం అనుకున్నాం. కాసేపటికి అవి తూటాల శబ్దం అని తెలిసింది. అప్పటికే పర్యాటకులు భయాందోళనతో పరిగెత్తడం కనిపించింది. నేను కూడా అలర్టయ్యా. నా ఆలోచనంతా మొదట పిల్లలను రక్షించడంపైనే ఉంది. బైసరన్ లోయ చుట్టూ కంచె ఏర్పాటుచేయడంతో తప్పించుకోవడం అంత సులభం కాదు. కంచె వదులుగా ఉన్న చోట మనిషి దూరి వెళ్లేందుకు అవకాశం ఉండడంతో కుల్దీప్ బిడ్డతో పాటు మరో బిడ్డను నా దగ్గరకు తీసుకుని బయటపడ్డా. వారిని పహల్గామ్ పట్టణానికి సమీపంలో ఓ చోట భద్రంగా ఒకరికి అప్పగించి తిరిగి అక్కడకు చేరుకున్నా. నాలాగే దూరి బయటపడమని చెప్పి నాలుగు కుటుంబాలను సురక్షితంగా కాపాడారు. "అల్లాహ్‌కు ధన్యవాదాలు.. నేను నా అతిథులను సురక్షితంగా పహల్గామ్‌కు తీసుకురాగలిగాను" అని షా చెప్పారు.
‘మీరు ఎప్పటికీ గుర్తుంటారు..’
"తుపాకీ కాల్పుల శబ్దానికి బెదరక, మీ ప్రాణాలను పణంగా పెట్టి మీరు చూపిన మానవత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని కుల్దీప్ హిందీలో షాకు కృతజ్ఞతలు చెప్పారు.
‘మానవత్వం చాటుకున్నారు..’
కుల్దీప్ వెంట వెళ్లిన మరో పర్యాటకుడు, చిర్మిరి టౌన్ బీజేపీ కార్పొరేటర్ భర్త స్థపక్ మాట్లాడుతూ "ప్రజలు మతం, కులం గురించి చర్చించుకుంటారు. కానీ మానవత్వాన్ని చాటుకున్న నజకత్ భాయ్‌ను ఎన్నటికీ మర్చిపోం?" అని పేర్కొన్నారు. "నజకత్ భాయ్.. నువ్వు నా ప్రాణాన్ని కాపాడటమే కాదు. మానవత్వాన్ని సజీవంగా ఉంచావు. నా జీవితాంతం నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను" అని స్థాపక్ పోస్టు చేశారు.
దురదృష్టవశాత్తూ షా బంధువు ఆదిల్ హుస్సేన్ ఉగ్ర దాడి(Terror Attack)లో మరణించాడు.