తెలంగాణ మామిడి రైతులపై ట్రంప్ దెబ్బ
ప్రతి వేసవిసీజన్లో మనదేశంనుండి అమెరికాకు లక్షల టన్నుల్లో మామిడిపండ్లు ఎగుమతి అవుతుంటాయి;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం దెబ్బ ప్రపంచదేశాలమీద ఎలాగ ఉండబోతోందో క్లారిటి లేదుకాని తెలంగాణ మీద మాత్రం గట్టిగానే పడబోతోంది. తెలంగాణ మీద ఏ విధంగా పడబోతోంది అంటే మామిడిపండ్ల ఎగుమతుల రూపంలో. మనదేశంనుండి అమెరికా(America)కు ఎగుమతి అయ్యే వస్తువుల మీద ట్రంప్ 26 శాతం పన్నులు విధించాడు. ట్రంప్ విధించిన 26 శాతం పన్నుల పరిధిలోకి ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ తో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా వస్తాయి. ఈవ్యవసాయ ఉత్పత్తుల్లోనే మామిడిపండ్లు(Mango Exports) కూడా ఉన్నాయి. ప్రతి వేసవిసీజన్లో మనదేశంనుండి అమెరికాకు లక్షల టన్నుల్లో మామిడిపండ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇకనుండి ఎగుమతులపైన ట్యాక్సుల ప్రభావం గణనీయంగా పడబోతోంది.
దేశంమొత్తంమీద మామిడిపండ్ల ఉత్పత్తిలో తెలుగురాష్ట్రాల షేర్ చాలా ఎక్కువగా ఉంటుంది. తెలుగురాష్ట్రాల్లో 7,64,500 ఎకరాల్లో మామిడిపండ్ల సాగు జరుగుతోంది. ప్రతి సీజన్ లో సుమారు 24 లక్షల టన్నుల మామిడిపండ్ల ఉత్పత్తి జరుగుతోంది. 24 లక్షల టన్నుల మామిడిపండ్ల ఉత్పత్తిలో చాలావరకు ఆస్ట్రేలియా(Australia), జపాన్(Japan), న్యూజిల్యాండ్, సౌత్ ఆఫ్రికా, బహరైన్, నేపాల్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇవికాకుండా అమెరికాకు మాత్రమే 45 వేల టన్నుల మామిడిపండ్లు ఎగుమతవుతాయి. ఈ 45 వేల టన్నుల్లో కూడా తెలంగాణ(Telangana) నుండి రు. 250 కోట్ల విలువైన సుమారు 15 వేల టన్నుల మామిడిపండ్లు అమెరికాకు వెళతాయి. పోయిన సీజన్ వరకు అమెరికాలోకి దిగుమతయ్యే మామిడిపండ్ల మీద అమెరికా ప్రభుత్వం 0-5 శాతం మధ్యలో ట్యాక్సులు విధించింది.
ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత అంటే తాజాగా ప్రతీకార పన్నులు(Trump Taxes) యుద్ధంలో మామిడిపండ్ల మీద దిగుమతి సుంకం 26 శాతానికి పెంచాడు. మనదేశం(India) నుండి అమెరికాకు మామిడిపండ్లు ఎగుమతి చేయాలంటే ఎగుమతిదారులు 26 శాతం సుంకం కట్టాల్సిందే. సుంకాలు 0-5 శాతం నుండి ఒక్కసారిగా 26 శాతానికి పెరిగిపోయాయి. పెరిగిన 21శాతం ట్యాక్సులే ఇపుడు మామిడిపండ్ల ఎగుమతులపైన తీవ్రప్రభావం చూపబోతున్నాయి. ట్యాక్సులు పెరగటం వల్ల ఏమవుతుందంటే మామిడిపండ్ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. పండ్ల ధరలు విపరీతంగా పెరిగితే మధ్య, సామాన్య తరగతుల జనాలు అమెరికాలో కొనుక్కోలేరు. ఇదే సమయంలో పెరిగిన మామిడిపండ్ల ధరల దామాషాలో లాభాలవాట రైతులకు వస్తుందా అంటే అదీలేదు. రైతులకు ఎగుమతిదారులకు మధ్య ఉండే దళారీలే లాభాల్లో అత్యధిక వాటాను తీసుకుంటారు. ఎగుమతి ట్యాక్సులు ఎక్కువగా కట్టాలి కాబట్టి ఎక్స్ పోర్టర్లు దళారీల దగ్గర మామిడిపండ్లను తక్కువ ధరకే కొంటారు. దళారీలు తక్కువ ధరలకే ఎగుమతిదారులకు మామిడిపండ్లను అమ్మాలికాబట్టి రైతుల నుండి దళారీలు మరింత తక్కువధరలకు కొంటారు. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే అంతిమంగా నష్టపోయేది తెలంగాణ మామిడిపండ్ల రైతులే.
ఇదేవిషయమై అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటి(అపెడా) అసిస్టెండ్ జనరల్ మేనేజర్ ఆర్ పీ నాయుడు ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ‘పెరిగిన ఎగుమతుల ట్యాక్సుల ప్రభావం తెలంగాణ మామిడిరైతుల మీద తీవ్రంగానే పడుతుంద’ని చెప్పారు. ‘దేశంలోని మామిడిపండ్ల ఉత్పత్తిలో రెండు తెలుగురాష్ట్రాలే సుమారు 25 శాతం ఉత్పత్తిచేస్తున్నాయ’ని చెప్పారు. అమెరికాకు ఎగుమతి సుంకాలు పెరిగిన నేపధ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాలని తెలిపారు. ‘అమెరికాకు బదులు పైన చెప్పిన దేశాలకు ఎగుమతులను పెంచే విషయంతో పాటు మరికొన్ని కొత్తదేశాలకు ఎగుమతి చేసేవిషయంపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం వచ్చింద’ని అభిప్రాయపడ్డారు. ‘అమెరికా మార్కెట్ కు ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం చూడటం అంత తేలికైన విషయం కాకపోయినా ప్రత్యామ్నాయ మార్కెట్ కు గట్టిగా ప్రయత్నాలైతే చేయాల’న్నారు. ఎగుమతి ట్యాక్సుల పెంపువల్ల మామిడిపండ్ల రైతులకు జరిగే నష్టాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో చూడాలని నాయుడు చెప్పారు.
వరంగల్ కు చెందిన మామిడిపండ్ల వ్యాపారి గోర్నాతల సమయ్య మాట్లాడుతు ‘సుంకాల యుద్ధంలో నలిగిపోతున్న తమను, రైతులను ప్రభుత్వమే ఆదుకోవాల’న్నారు. ‘పోయిన ఏడాది సీజన్ లో 400 టన్నుల మామిడిపండ్లను ఎగుమతిచేస్తే అందులో అమెరికాకు మాత్రమే 50 టన్నులు ఎగుమతిచేసి’నట్లు చెప్పారు. తాను అమెరికాతో పాటు నేపాల్(Nepal) లాంటి దేశాలకు కూడా మామిడిపండ్లను ఎగుమతిచేస్తున్నట్లు చెప్పారు. ‘సడెన్ గా ఎగుమతి సుంకాలను పెంచేయటం వల్ల ఈసారి బిజినెస్ ఎలాగుంటుందో చూడాల’ని ఆందోళన వ్యక్తంచేశారు. ‘అమెరికాకు ఎగుమతయ్యే మామిడిపండ్లలో బంగినపల్లి, దసేరి, కేశరి, హిమాయత్ రకాలు ఎక్కువగా ఉంటాయ’ని చెప్పారు. ఈ సీజన్లో మామిడిపండ్ల ఎగుమతి ఇంకా మొదలుకాలేదని, తనతో పాటు మరికొందరు ఎగుమతిదారులకు కూడా ఎగుమతి సుంకాల దెబ్బ తప్పేట్లు లేదని సమయ్య చెప్పారు.
జగిత్యాలకు చెందిన మామిడిపండ్ల రైతు రాజేందర్ రావు మాట్లాడుతు ‘ఎగుమతులు తగ్గిపోతే తమ ఆదాయం తగ్గిపోతుంద’ని ఆవేధన వ్యక్తంచేశారు. ‘ఎగుమతి సుంకాల పెంపు పేరుతో వ్యాపారులు తమదగ్గర తక్కువ ధరలకే పండ్లను కొంటార’ని చెప్పారు. ‘తక్కువరేట్లకు పండ్లను అమ్ముకోవటం అంటే గిట్టుబాటు ధరలు కూడా దక్కుతాయో లేదో’ అని ఆందోళన వ్యక్తంచేశారు. దేశీయ మార్కెట్లో ఇప్పటికే ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. ‘ఎగుమతి సుంకాల పేరుతో ధరలను మరింతగా తగ్గిస్తే తాము నష్టపోవటం ఖాయ’మని రాజేందర్ రావు చెప్పారు.